విజయవాడ, నవంబర్ 4, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఒకవైపు జగన్ ప్రభుత్వం పార్టీ నేతలపై పెడుతున్న కేసులను ఎలా ఎదుర్కొనాలని ఒకవైపు, ఓటమితో కుంగిపోయిన టీడీపీ క్యాడర్ లో జోష్ నింపాలన్న ప్రయత్నం మరోవైపు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే చంద్రబాబు అనుకుంటున్నట్లు పార్టీ నేతలు లేరన్నది వాస్తవం. చంద్రబాబు ఎంత ధైర్యం నూరిపోస్తున్నా వారి లెక్కలు వారికున్నాయి. అధికారంలో లేకపోవడంతో ఎక్కడకు వెళితే తమకు లాభదాయకమని నిర్ణయించుకుంటున్నారు. అందుకే చంద్రబాబు సమీక్షలకు ముందే తాము పార్టీ నుంచి వెళ్లిపోతామని రివీల్ చేస్తున్నారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి పాలు కావడంతో చంద్రబాబు నేతల్లోనూ, క్యాడర్ లోనూ ధైర్యం నూరిపోసేందుకు జిల్లా పర్యటనలు పెట్టుకున్నారు.
చంద్రబాబు పర్యటనల ముందే జంప్
ఇప్పటికే తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లా పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. రాయలసీమ వైపు ఇంకా వెళ్లలేదు. త్వరలోనే తన సొంత జిల్లా చిత్తూరుకు వెళ్లాలనుకుంటున్నారు. అయితే కడప జిల్లాలో చంద్రబాబు సమీక్షలు చేయకముందే పార్టీ నేతలు కొందరు బయటకు వెళ్లిపోతున్నట్లు చెప్పేస్తుండటం విశేషం.కడప జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. మొన్నటి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. జీరో రిజల్ట్ రావడంతో ఇక్కడ టీడీపీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. టీడీపీ ఓటమి పాలు కాగానే రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు సీఎం రమేష్ బీజేపీలోకి జంప్ చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగానే సీఎం రమేష్ జారుకున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా తాను బీజేపీలోకి జంప్ అవుతున్నట్లు ముందుగానే చంద్రబాబును కలసి చెప్పారు. జగన్ నుంచి తనను తాను కాపాడుకోవడానికే బీజేపీలోకి వెళుతున్నట్లు చంద్రబాబుతో ఆదినారాయణరెడ్డి చెప్పారుఇక కడప జిల్లాకు చెందిన మరికొందరు నేతలు సయితం బీజేపీ బాట పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన వారు పార్టీకి మొహం చాటేస్తున్నారు. ఎన్నికలకు ముందే బద్వేలు ఎమ్మెల్యే జయరాములు టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అలాగే కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి సయితం త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్న ఆరిఫుల్లా కూడా బీజేపీలో చేరారు. మరికొందరు నేతలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటిస్తున్నారు. చంద్రబాబు కడప జిల్లాలో సమీక్ష నిర్వహించకముందే టీడీపీ నేతలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటిస్తుండటం పసుపు పార్టీలో ఆందోళన రేకెత్తిస్తుంది.