విజయనగరం, నవంబర్ 7, (way2newstv.com)
ఎన్నికలు అయిపోయి ఆరు నెలలు గడుస్తుంది. అప్పటి నుంచి ఆయన కన్పించకుండా పోయారు. కనీసం రాష్ట్రంలో కూడా లేరు. గత ఆరు నెలలకే ఢిల్లీకే పరిమితమయిన ఈనేతను జనం ఇక ఎందుకు గెలిపిస్తారు? ఢిల్లీలో సేదతీరుతుంటే ఇక్కడ ప్రజల కష్టాలు ఎవరు పట్టించుకుంటారు? ఇదేచర్చ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో జరుగుతుంది. ఆయనే కురుపాం రాజవంశీయుడు కిశోర్ చంద్రదేవ్. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఢిల్లీకి చెక్కేసిన కిశోర్ చంద్రదేవ్ ఇక అయితా పయితా లేకుండా పోయారు. ఆయనను గెలిపించినా అంతే… గెలిపించకున్నా అంతే.మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పడం కష్టమే. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కొనసాగి మంత్రిపదవులను దక్కించుకున్న కిశోర్ చంద్రదేవ్ మొన్న జరిగిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిపోయారు.
పాలిటిక్స్ లో నో సీజనల్ లీడర్స్
పార్టీ మీద ప్రేమ కాదు ఈయనకు. కేవలం తాను మరోసారి పార్లమెంటులో అడుగుపెట్టి ఢిల్లీలో సేదతీరాలన్నదే. అరకు నియోజకవర్గంలో అంతటి బలమైన నేత టీడీపీకి కూడా దొరకకపోవడంతో వెంటనే కిశోర్ చంద్రదేవ్ కు కండువాతో కూడా బీఫారం ఇచ్చేశారు చంద్రబాబునాయుడు.కిశోర్ చంద్రదేవ్ 1977, 1980, 1984లో పార్వతీపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2004 లో పార్వతీపురం, 2009లో అరకు పార్లమెంటు నుంచి ఎన్నికలయ్యారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. పోనీ గెలిచినప్పుడయినా నియోజకవర్గానికి వస్తారా? అంటే అదీ లేదు. చుట్టపు చూపుగా వచ్చిపోతారు. కేంద్రమంత్రిగా కిశోర్ చంద్రదేవ్ బాధ్యతలను స్వీకరించినప్పుడు అరకు ప్రజలు ఆనందిచారు. తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశించారు. గిరిజన నేతగా తమను ఆదుకుంటారని అనుకున్నారు. కానీ అది భ్రమ మాత్రమే అని తేలడంతో ఇక వరసగా కిశోర్ చంద్రదేవ్ ను ఓడించడం మొదలు పెట్టారు.ఎప్పుడైనా కురుపాం వచ్చినా ఆయన తన కోటకే పరిమితమవుతారు. ప్రజలను కలిసేందుకు ఇష్టపడరు. కనీసం తాను ఉన్న పార్టీనేతలను కూడా ఆయన కలసిని సందర్భాలు లేవు. కొన్ని దశాబ్దాలుగా కిషోర్ చంద్రదేవ్ ఇదే చేస్తున్నారు. అయితే ఇప్పుడు గిరిజనంలో కూడా చైతన్యం వచ్చింది. తమకు అందుబాటులో ఉండే నేతలనే ఎంపిక చేసుకుంటున్నారు. రాజు కిశోర్ చంద్రదేవ్ ను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఇప్పుడు అరకు పార్లమెంటుకు ఇన్ ఛార్జిని నియమించాలని టీడీపీనేతలు సయితం చంద్రబాబును కోరుతున్నారు. కిశోర్ చంద్రదేవ్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. మళ్లీ ఐదేళ్లకు రావాలని ఆయన అనుకుంటున్నట్లుంది. కిశోర్ చంద్రదేవ్ లాంటి సీజనల్ లీడర్లకు ఇక రాజకీయంగా కాలం చెల్లినట్లేనని చెప్పక తప్పదు.