సీఎం జిల్లాల్లో టీచర్ల కరువు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీఎం జిల్లాల్లో టీచర్ల కరువు

కడప, నవంబర్ 11, (way2newstv.com)
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు మన బడి.. నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో జిల్లాలో 1059 పాఠశాలలను గుర్తించారు. వాటిలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం జిల్లాకు రూ. 220 కోట్లు కేటాయించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ జిల్లాలోని కొన్ని  పాఠశాలల్లో బోధనకు సంబంధించి  ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. దీనికి తోడు ఈ ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకంతో ప్రైవేటు పాఠశాలల నుంచి 14,247 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఫలితంగా బోధకుల సంఖ్య  కొంత వెంటాడుతోంది. దీంతో విద్యార్థులకు సక్రమంగా బోధన అందడంలేదు. ఈ కారణంగా విద్యార్థులు కొంత ఆందోళన చెందుతున్నారు. 
సీఎం జిల్లాల్లో టీచర్ల కరువు

అలాగే కోర్టు కేసుల నేపథ్యంలో డీఎస్సీ –2018 పోస్టుల ఖాళీల భర్తీకి ఆలస్యమైంది. వీటితోపాటు ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల ఖాళీలతో పాటు నెలవారి పదోన్నతులతో జిల్లాలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానంలో విద్యా వలంటీర్లను నియమించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలను పంపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సి ఉంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం జిల్లాలో 476 విద్య వలంటీర్లు అవసరం ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ గుర్తించింది. ఇందుకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి కూడా పంపింది. ఈ పోస్టులో 259 సెకండరీ గ్రేడ్‌ టీచర్స్, 217 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతులు వస్తే ఈ పోస్టుల్లో వలంటీర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నారు. ఇలా ఎంపికైన విద్యా వలంటీర్లను ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే వరకు లేదా డీఎస్సీ– 2018 నియామకాలు చేపట్టే వరకు కొనసాగించే అవకాశం ఉంది. 2018 డీఎస్సీ నియామకాలు ఆలస్యం  గత ప్రభుత్వ నిర్వాకమేనని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత నిరుద్యోగుల కన్నీళ్లు తుడిచేందుకు డీఎస్సీని ప్రకటించి కొద్ది రోజులు గడిపింది. తరువాత ఎన్నికల  సమయంలో నిరుద్యోగులను ప్రలోభపెట్టేందుకు డీఎస్సీ–2018ని నిర్వహించింది. ఇందులో పలు లోపాల కారణంగా పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు 2018 డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షను విడతల వారిగా నిర్వహించారు. ఇందులో నార్మలైజేషన్‌ ప్రకటించకుండా ఫలితాలను విడుదల చేయడంతో అభ్యర్థుల మధ్య విభేదాలకు దారితీసింది. ఫలితంగా నియామకాలు ఆగిపోవడంతో ప్రస్తుతం పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. కనీసం విద్యావలంటీర్ల నియామకాలైనా చేపడితో కొంత ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.