విజయనగరం, నవంబర్ 13,(way2newstv.com)
విజయనగరం జిల్లాలో విజయనగరం, నెల్లమర్ల, చీపురుపల్లి, తెర్లాం, పార్వతీపురం, కురుపాం, సాలూరు, బొబ్బిలి, గజపతినగరం, ఎస్‌కోట, కొత్తవలస కేంద్రాలుగా 13 సబ్ ట్రెజరీలున్నాయి. ఇవన్నీ విజయనగరంలోని జిల్లా ట్రెజరీ ఆధీనంలో ఉంటాయి. ఇక్కడ ఓ అధికారి కనుసన్నల్లోనే మొత్తం జిల్లా ట్రెజరీ వ్యవస్థంతా నడుస్తోంది. ఆయనపై గత జూలైలో సీఎం కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లింది. కానీ తూతూ మంత్రంగా కొన్ని విభాగాల నుంచి లెటర్లు తీసుకుని ఎలాంటి విచారణ లేకుండానే ఆ అధికారికి అనుకూలంగా సీఎం కార్యాలయానికి నివేదిక పంపించారు. విజయనగరం జిల్లాలోనే పుట్టి, పెరిగిన ఆ అధికారి 20 ఏళ్లకుపైగా విజయనగరంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యలో కేవలం కొన్ని నెలలు మాత్రమే విశాఖ వెళ్లి వచ్చేశారు.
ట్రెజరీలో ఇంటిదొంగలు
పార్వతీపురం ఎయిడెడ్ స్కూళ్ల కుంభకోణం జరిగిన 2017లో ఆయనతో పాటు ఒక ఎస్‌టీఓ, ఒక అకౌంటెంట్ ద్వారా ఈ పదమూడు మంది టీచర్లు సమర్పించిన తప్పుడు బిల్లులకు చెల్లింపులు చేశారు. ఇప్పుడు ఆ ఎస్‌టీఓ, అకౌంటెంట్ బదిలీ అయి ఒకరు వేరే విభాగానికి, మరొకరు వేరే ప్రాంతానికి వెళ్లి పోయారు. ఇయన మాత్రం ఇంకా అదే కార్యాలయంలో కొనసాగుతున్నారు. ఉన్నత ఉద్యోగం.. దానికి తగ్గ జీతం, అంతకు మించి భత్యం, వసతులు..అన్నిటినీ మించి ఇంటా, బయటా గౌరవం. ఇవేవీ వారికి సంతృప్తినివ్వలేకపోయాయి. ఇంకా ఏదో లోటు వారిని వేధించింది. అత్యాశకు పోయి ప్రజా ధనాన్ని దోచేందుకు కుట్ర పన్నారు. అనుకున్నదే తడవుగా పథక రచన చేశారు. పోయేది జనం డబ్బే గనుక ప్రజాప్రతినిధులుగా చలామణీ అవుతున్నవారినీ కలుపుకున్నారు. కొందరు మధ్య వర్తులుగా మారారు. మరికొందరు అవసరమైన అస్త్రాలను, దస్త్రాలను తయారు చేశారు. వెనకాముందు చూడకుండా మరికొందరు సంతకాలు చేశారు. ఫింగర్‌ప్రింట్‌ను సైతం తెలియకుండానే వేసేశామంటూ ఇప్పుడు తప్పించుకునేందుకు దారులు వెదుకుతున్నారు. ఇక పార్వతీపురం సబ్ ట్రెజరీలో ఒక అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, సబ్ ట్రెజరీ ఆఫీసర్, నలుగురు సీనియర్ అకౌంటెంట్స్, ఒక జూనియర్ అకౌంటెంట్ ఉన్నారు. ఒక్కో అకౌంటెంట్‌కు కొన్ని ప్రభుత్వ శాఖల బిల్లులను పరిశీలించి, మంజూరు చేసే బాధ్యతలను అప్పగిస్తారు. గత ఆగస్టులోనే ఈ కార్యాలయ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో డిప్యూటీ డైరెక్టర్ స్వయంగా వెళ్లి సిబ్బందిని హెచ్చరించారు. ఇద్దరు అకౌంటెంట్ల వద్దనే 60 శాతం విభాగాలుండగా మరో అకౌంటెంట్ వద్ద 30 శాతం, ఇంకొకరి వద్ద 10 శాతం విభాగాలున్నాయి. ఆయా విభాగాల నుంచి వచ్చే రాబడిని ఉన్నతాధికారులకు పంచిపెట్టే వారికి ఈ విధంగా ఎక్కువ విభాగాలను అప్పగించారట. ఈ విషయాన్ని గుర్తించిన డీడీ ఇలా ఎందుకు చేశారంటూ అధికారులను నిలదీశారు. ఈ కార్యాలయంలో బయోమెట్రిక్ మెషిన్ రెండు నెలలుగా పనిచేయడం లేదు. ఇదే అదనుగా కార్యాలయ సిబ్బంది ఇష్టానుసారం విధులకు వచ్చిపోతున్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరిపైనా చర్యలు లేవు. విద్యాశాఖ విషయానికి వస్తే.. విజయనగరం, బొబ్బిలిలో ఒక్కొక్కరు చొప్పున డిప్యూటీ డీఈఓలు ఉన్నారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక విద్యాశాఖాధికారి చొప్పున(ఎంఈఓ) ఉన్నారు. పాఠశాలలు పనిచేస్తున్నాయా లేదా, ఉపాధ్యాయులెవరెవరు విధులకు హాజరవుతున్నారనే విషయాలపై వీరికి పర్యవేక్షణ ఉంటుంది. కానీ ఈ పదమూడు మంది విషయంలో వీరి పర్యవేక్షణ ఏమైందనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఎంఈఓ నుంచి డిప్యూటీ డీఈఓకి, అక్కడి నుంచి డీఈఓకి చేరిన నివేదికలను ఆయా అధికారులు పరిశీలించాలి. కానీ అదెక్కడా జరిగినట్టు లేదు. నిజానికి ఎయిడెడ్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు జీతా లు చెల్లించాలంటే జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి ఫింగర్‌ప్రింట్ అవసరం. అది కూడా ఇక్కడ చాలా తేలికగా వేసేశారు. ఉద్యోగుల జీతభత్యాల వివరాలు నమోదు చేసే పుస్తకం (ఫ్‌లై లీఫ్)ను తనిఖీ చేసుంటే జరుగుతున్న మోసం ఆదిలోనే బయటపడి ఉండేది. కానీ ఆ పని ట్రెజరీ విభాగం చేయలేదు. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం (సీఎఫ్‌ఎం ఎస్) ద్వారా ఈ పదమూడు మంది ఉపాధ్యాయులు తప్పుడు బిల్లులను ట్రెజరీలో అందజేశారు. అయితే అంత పకడ్బందీగా బిల్లులు తయారు చేసేంత నైపుణ్యం ఆ ఉపాధ్యాయులకు ఉండదు. ఆ బిల్లులను కూడా ట్రెజరీ సిబ్బందే తయారు చేయాలి. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కుంభకోణాన్ని ట్రెజరీ, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది కలిసి మూకుమ్మడిగా నడిపించారు.