పోయిన చోటే వెతుక్కునే పనిలో టీటీడీపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోయిన చోటే వెతుక్కునే పనిలో టీటీడీపీ

హైద్రాబాద్, నవంబర్ 6 (way2newstv.com)
తెలంగాణలో ఎన్నికలన్నీ ముగిసిపోయాయి. ఇక మున్సిపల్ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. అయినా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు విషయంలో ఒక నికార్సయిన నిజం చెప్పుకోవాలి. దీనికి అందరూ అంగీకరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు ఎంత భయస్థుడో…? పోయిన చోట వెతుక్కోవడంలో చంద్రబాబు అంత దిట్ట. ఎన్ని ఓటములు ఎదురైనా పార్టీని తిరిగి పట్టాలెక్కించడంలో చంద్రబాబుకు మించిన రాజకీయ నాయకుడు ప్రాంతీయ పార్టీల్లో మనకు కనపడక పోవచ్చు. జగన్ యువకుడు కాబట్టి పార్టీ ఓటమి పాలయినా ఐదేళ్లు నెట్టుకొచ్చారు.కానీ చంద్రబాబు వయసు మీద పడుతున్న సమయంలో ఆయన ఓపికకు, సహనానికి హ్యాటాఫ్ చెప్పాల్సిందే. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బతినింది. 
పోయిన చోటే వెతుక్కునే పనిలో టీటీడీపీ

నాయకులందరూ పార్టీని వీడిపోయారు. రేవంత్ రెడ్డి లాంటి నమ్మకమైన నేతలు కూడా ఇక టీడీపీ తెలంగాణలో ఉండదని భావించి కాంగ్రెస్ వైపునకు వెళ్లారు. మిగిలిన నాయకుల్లో కొందరు టీఆర్ఎస్ మరికొందరు బీజేపీలోకి వెళ్లిపోయారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మహాకూటమిగా వెళ్లినా తెలుగుదేశం పార్టీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. ఎక్కడా ఓట్లు చీల్చి అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుపునకు అడ్డుకట్ట వేయలేకపోయింది. ఒక ఖమ్మం జిల్లాలో రెండు నియోజకవర్గాలను గెలిచి తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది. తాజాగా జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది.అయినా చంద్రబాబు మొక్కవోని ధైర్యంతో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గట్టి ఓటు బ్యాంకు ఉంది. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు అనుసరించిన వైఖరితో ఆ పార్టీ ఓటు బ్యాంక్ చెల్లాచెదురయింది. దీంతో చంద్రబాబు తిరిగి తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి శని, ఆదివారాలు చంద్రబాబు హైదరాబాద్ వస్తున్నారు. శనివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమవుతూ వస్తున్నారు. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీటీడీపీ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. పోటీపై త్వరలో స్పష్టత రానుంది.