న్యూ డిల్లీ నవంబర్ 18 (way2newstv.com)
రాజ్యసభ ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్ష్యంగా నిలిచి చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత సమాఖ్య వ్యవస్థకు పెద్దల సభ ఆత్మ వంటిదని, జాతి వృద్ధికి చిహ్నమని స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారం 250వ సెషన్‌ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ దేశ గతిని మార్చే పలు బిల్లులను రాజ్యసభ ఆమోదించడంతో అవి చట్టరూపం దాల్చి సుపరిపాలనకు అద్దం పట్టాయని చెప్పారు. మహిళా సాధికారతలో కీలక ముందడుగైన ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదించిందని ప్రస్తుతించారు. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సైతం ఈ సభ రిజర్వేషన్లను కల్పించే బిల్లును ఆమోదించిందని గుర్తుచేశారు. దేశానికి మంచి జరిగే సందర్భాల్లో రాజ్యసభ తనదైన పాత్రను పోషించేందుకు వెనుకాడలేదని, పెద్దల సభలో ఆమోదం పొందిన తర్వాత జీఎస్టీ అమలుకు నోచుకుందని పేర్కొన్నారు.
చారిత్రక ఘటనలకు సాక్ష్యంగా నిలిచినరాజ్యసభ: ప్రధాని మోదీ
ఆర్టికల్ 370, 35(ఏ)లకు సంబంధించిన బిల్లుల ఆమోదంలో రాజ్యసభ పాత్రను తాము విస్మరించలేమని కొనియాడారు. 2003లో రాజ్యసభ 200వ సెషన్ సందర్భంగా అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పెద్దల సభ ప్రాముఖ్యతను కొనియాడారని గుర్తుచేశారు. రాజ్యసభను ఏ ఒక్కరూ సెకండరీ సభగా పరిగణించరాదని, ఇది దేశ అభివృద్ధికి సపోర్టింగ్ హౌస్‌గా పనిచేస్తుందన్నది గుర్తెరగాలని వాజ్‌పేయి ప్రస్తుతించారని చెప్పారు. సభలో బీజేడీ, ఎన్సీపీ సభ్యుల తీరును ప్రధాని మోదీ ప్రశంసించారు. వెల్‌లోకి ఈ పార్టీల సభ్యులు ఎన్నడూ వెళ్లరని, వెల్‌లోకి దూసుకువెళ్లకపోయినా ఎన్సీపీ, బీజేడీలు రాజకీయంగా ఎన్నో విజయాలు సాధించాయని అన్నారు. ఈ పార్టీల నుంచి తనతో సహా మనమందరం క్రమశిక్షణ నేర్చుకోవాలని సూచించారు. రాజ్యసభలో ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలు చోటుచేసుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభ చరిత్ర సృష్టించిందని, ఎన్నో చరిత్రాత్మక సంఘటనలకు సాక్ష్యంగా కూడా నిలిచిందన్నారు. రాజ్యసభకు ఎంతో ముందు చూపు ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న వారు కూడా.. రాజ్యసభ ద్వారా దేశ సేవలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. దేశాభివృద్ధిలో అలాంటి వారి కూడా రాజ్యసభ ద్వారా ఉపయోగపడుతున్నట్లు మోదీ తెలిపారు. భిన్నత్వ లక్షణాల వల్ల రాజ్యసభ వర్థిల్లిందన్నారు. రాజ్యసభ 250వ సమావేశాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌కు వచ్చారన్నారు.