గుంటూరు, నవంబర్ 21, (way2newstv.com)
అధికారంలో ఉండగా.. ఆయన మాటకు తిరుగులేదు. ముఖ్యంగా రాజధాని జిల్లా గుంటూరులో ఆయన హవా చలాయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనకు తిరుగేలేకుండా పోయింది. ఆయనే చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 1999, 2009, 2014లో ఇక్కడ నుంచి విజయం సాధించిన ప్రత్తిపాటి పుల్లారావు తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. నిశిత విమర్శలు చేయడంలోనూ ప్రత్తిపాటి పుల్లారావు పేరు తెచ్చుకున్నారు. టీడీపీ విపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు.పార్టీ అధినేత నిర్వహించిన వస్తున్న మీ కోసం.. యాత్రను సక్సెస్ చేయడంలోనూ ప్రత్తిపాటి పుల్లారావు దూకుడు ప్రదర్శించారు.
పత్తిపాటి పుల్లరావు మౌనం వెనుక
దీంతోరాష్ట్రంలో 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్తిపాటి పుల్లారావుకి మంత్రి పదవి దక్కింది. ఈ పదవి ఏకంగా ఐదేళ్ల పాటు ఉండడం గమనార్హం. వాస్తవానికి గుంటూరుకు చెందిన సీనియర్లు, మాకినేని పెదరత్తయ్య, కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు వంటి వారికి అటు ఎన్టీఆర్ కేబినెట్‌లోనూ, ఇటు చంద్రబాబు కేబినెట్‌లోనూ మంత్రి పదవులు దక్కినా.. ఇలా పూర్తికాలం వారు కొనసాగిన పరిస్థితి లేకుండా పోయింది. అలాంటిది ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం బాబు కేబినెట్‌లో ఐదేళ్లు కొనసాగారు.చిత్రం ఏంటంటే.. పక్కనే ఉన్న ప్రత్తిపాడు నుంచి ప్రాతినిధ్యం వహించిన రావెల కిశోర్ బాబును కూడా చంద్రబాబు కేవలం మూడు సంవత్సరాలే మంత్రి వర్గంలో కొనసాగించారు. అయితే, చంద్రబాబు మాత్రం ప్రత్తిపాటి పుల్లారావుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు ఓడిపో యారు. కానీ, ఆయన ప్రభుత్వంపైనా, మంత్రులపైనా ఎక్కడా స్పందించడం లేదు. వారికి పన్నెత్తు మాట కూడా అనడం లేదు. దీనికి రీజన్ ఏంటి? అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకురాలు విడదల రజనీ మాత్రం దూకుడు ప్రదర్శిస్తుండగా.. ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం మౌనం వహిస్తున్నారు. దీంతో ఆయన ఎందుకిలా చేస్తున్నారు? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. అయితే, కొంచెం లోతుగా పరిశీలిస్తే.. ఆయన వైసీపీ ప్రభుత్వానికి భయపడుతున్నారట.ఈ విషయం వైసీపీ వాళ్లు చెప్పడం లేదు… అటు టీడీపీ నాయకులు కూడా చెపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బినామీగా ఆయనపై విమర్శలు ఉన్నాయి. అత్యంత వివాస్పదమైన అగ్రిగోల్డ్ భూములు కొన్నట్టుగా కూడా ఆరోపణలు వినిపించాయి. రాజధాని భూముల్లోనూ బాబుకు బినామీగా ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అందుకే బాబు ప్రత్తిపాటి పుల్లారావుకు ఏకంగా పదేళ్ల పాటు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడంతో పాటు అగ్రిగోల్డ్ విషయంలో ఆరోపణలు వచ్చినా ఏకంగా ఐదేళ్ల పాటు కేబినెట్‌లో కొనసాగేలా చేశారు. అదేవిధంగా ప్రస్తుత బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచే ఆయనతో కలిసి వ్యాపారాలు నిర్వహించినట్టు సమాచారం.ఇప్పుడు కన్నా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నా వారిద్దరు ఎంత మాత్రం విమర్శలు చేసుకోరు. ఇలా ప్రత్తిపాటి పుల్లారావుకి అటు వైసీపీ నేతలతోనూ ఇటు బీజేపీ నేతలతోనూ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆయనపై ఉన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జగన్‌పైనో, వైసీపీ ప్రభుత్వంపైనో విమర్శలు చేస్తే తాను బాగా టార్గెట్ అవుతానన్న సందేహాలు, ఆందోళన ఆయనకు ఉన్నాయట. వీటి నేపథ్యంలోనే ప్రత్తిపాటి పుల్లారావు మౌనం వహిస్తున్నారని, భయపడుతున్నారని అంటున్నారు. జిల్లాలో మైనింగ్ ఆరోపణలు ఉన్న యరపతినేని, జీవీ లాంటి వాళ్లు వైసీపీని టార్గెట్ చేస్తున్నా ప్రత్తిపాటి పుల్లారావు చివరకు నియోజకవర్గంలో రజనీ విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చేందుకు సందేహించే పరిస్థితి. మొత్తానికి టీడీపీ ఫైర్ బ్రాండ్ మౌనం వహించడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.