ఛండీఘడ్, నవంబర్ 1 (way2newstv.com)
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సామాజిక వర్గం కీలకంగా ఉంటుంది. ఆయా సామాజిక వర్గాల రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంటాయి. రాజకీయాలను ప్రభావితం చేస్తుంటాయి. అంగబలం, అర్థబలం పుష్కలంగా ఉండే ఈ సామాజిక వర్గాలను విస్మరించడం అసాధ్యం. అలా కాదని ముందుకు వెళ్లినట్లయితే ఇబ్బందులు తప్పవు. కర్ణాటకలో ఒక్కలిగ, లింగాయత్, ఆంద్రప్రదేశ్ లో కమ్మ, రెడ్డి, తెలంగాణలో వెలమ, రెడ్డి, గౌడ, యాదవ, మున్నూరుకాపు, తమిళనాడులో గౌండర్, దేవర, నాడార్, యూపీలో బ్రాహ్మణ, ఠాకూర్, క్షత్రియ సామాజిక వర్గాలు కీలకమైనవి. ఇలా దాదాపు వివిధ రాష్ష్రాల్లోనూ కీలకమైన సామాజిక వర్గాలుంటాయి. దాదాపు అన్ని పార్టీలు ఈ సామాజిక వర్గాల సమతుల్యతను పరిగణనలోకి తీసుకుంటాయి. ఒక్కోసారి సోషల్ ఇంజినీరింగ్ లోభాగంగా పార్టీలు ప్రయోగాలు చేస్తుంటాయి.
సోషల్ ఇంజనీరింగ్ ను పట్టించుకోని కమలం
ఇవి కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలను ఇస్తాయి. మరికొన్ని సందర్భాల్లో వికటిస్తాయి. అన్ని సందర్భాల్లో సామాజిక ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తాయన్న గ్యారెంటీ ఉండదు. ఇందుకు నిదర్శనం ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.రాష్ట్రంలో వేర్పాటు సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ జాట్ సామాజిక వర్గం అత్యంత కీలకమైనది. రాష్ట్ర రాజకీయాలపై గణనీయ ప్రభావం చూపగల సత్తా ఈ వర్గానికి ఉంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ రాష్ట్రంలో చక్రం తిప్పాయి. ఈ రెండు పార్టీల అధినేతలు ఈ సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత భూపేందర్ సింగ్ హుడా, జన నాయక జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతలా కూడా ఈ సామాజిక వర్గం వారే కావడం విశేషం. ఇంకా మూలాల్లోకి వెళితే బన్సీలాల్ , భజన్ లాల్ (కాంగ్రెస్) దేవీలాల్ ముఖ్యమంత్రులుగా రాష్ట్ర రాజకీయాలు దశాబ్ధాలపాటు శాసించారు. వీరూ జాట్ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఆరంభంలో కాంగ్రెస్ తో ప్రస్థానం ప్రారంభించిన బన్సీలాల్ కేంద్రంలో రోడ్డు, రైల్వే శాఖలను నిర్వహించారు. తరువాత ఆ పార్టీలో విభేధించి బయటకు వచ్చిన ఆయన హర్యానా వికాస్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురు నేతల వారసులు కాంగ్రెస్, ఐఎన్ఎల్డీలో కీలకం.ఇక అసలు విషయానికివస్తే 2014లో 47స్థానాలు సాధించి భారతీయ జనతా పార్టీ అధికారాన్ని అందుకుంది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 15, ఐఎన్ఎల్డీ 19 స్థానాలు గెలుచుకున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ వ్యూహం తో ఎన్నికలను ఎదుర్కొని దెబ్బతింది. కేవలం 40 స్థానాలు సాధించి అధికారానికి దగ్గర నిలిచింది. చివరకు ఏ జాట్ వర్గాన్ని విస్మరించిందో అదే సామాజిక వర్గం మూలాలు గల జాన నాయక్ జనతా పార్టీ మద్దతు కోరవలిసి వచ్చింది. పది స్థానాలు గల ఆ పార్టీ అధినేత మాజీ ఉపప్రదాని దేవీలాల్ మునిమనవడు దుష్యంత్ చౌతలాకు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. ఆయన మద్దతు అనివార్యమైంది. 90 స్థానాలు గల రాష్ట్ర అసెంబ్లీలో దాదాపు 29స్థానాల్లో జాట్ సామాజిక వర్గాల ఫలితాలను నిర్ధేశించగలరు. మరో 8 స్థానాలపై ఫలితాలపై ప్రభావం చూపగలదు. అంటే దాదాపు సగం స్థానాల్లో వీరి ప్రభావం పట్టున్నట్లు లెక్క.జాట్ ప్రాభల్యంగల రాష్ట్రం హర్యానాలోనే ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించింది. ఆ పార్టీ అధినేత అదే సామాజిక వర్గానికి చెందిన భూపేందర్ హూడాకు రోహతక్, సోనిపట్ లలో పట్టుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రి వర్గంలోని నలుగురు మంత్రులు ఈ ప్రాంతంలో ఓడిపోవడం గమనార్హం. 2016లో జరిగిన జాట్ ల ఆందోళనకు ఈ రెండు జిల్లాలు కేంద్రంగా నిలిచాయి. అప్పటి ఆందోళనల వల్ల 18మంది జాట్ల తో సహా మొత్తం 31 మంది మరణించారు. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ కంచుకోటలయిన హిస్సార్, జాట్, భెవానీ లో ఆయన మునిమనవడు దుష్యంత్ చౌతలా పార్టీ జేజేపీ ఉత్తమ ఫలితాలు సాధించింది. ఇక్కడ బీజేపీ దాదాపుగా సున్నా. కాంగ్రెస్ , జేజేపీ మధ్యే పోటీ నడిచింది. ఇక్కడ బీజేపీ మూడో స్థానంలోకి పరిమితమైంది. జింద్ లోని నాలుగు స్థానాల్లో జేజేపీ ఆధిక్యం సాధించింది. అధికారాలు ఉన్న సమయంలో బీజేపీ సర్కార్ తమ పట్ల అనుసరించిన వైఖరిపై జాట్ లు అసంతృప్తిలో ఉన్నారు. తమకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వీరు సాగించిన ఉద్యమాన్ని బీజేపీ సర్కార్ విస్మరించింది. తమదే వ్యవసాయ ప్రధాన వృత్తి అని, అయితే ఈ వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సర్కార్ శీతకన్ను వేసిందని వీరు విమర్శించే వారు. పంటల మద్దతు ధరపై ఆగ్రహంతో ఉన్నారు. పంట సేకరణకు కోటా విధానంపై వ్యతిరేకత వక్య్తం చేశారు. అంతిమంగా జాట్ల ఆగ్రహం కమలానికి కషాయం తాగించింది.