శ్రీకాకుళం, నవంబర్ 22, (way2newstv.com)
నిజానికి ఆరు నెలల క్రితం వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినపుడు ఫిరాయింపులు గత ప్రభుత్వం మాదిరిగా ఉండవు అని జగన్ నిండు సభలో గట్టిగా చెప్పారు. దాని వల్ల కండువాల కల్చర్ కి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు. తమ్మినేని సీతారాం సైతం తనకు పెద్ద పని ఉండదని అనుకున్నారు. కానీ రాజకీయాలు ఎపుడూ ఒక్కలా ఉండవు కదా. ఏపీలో జంపింగ్ జపాంగులు ఇపుడే నిద్ర లేస్తున్నారు. నిజానికి 2014 ఎన్నికల్లో గెలిచాక మూడేళ్ళ పాటు ఫిరాయింపుల ఊసు లేకుండా పోయింది. అయితే ఇపుడు మాత్రం అసలు తాళలేకపోతున్నారు.ఎవరైనా తోక జాడిస్తే జగన్ అనర్హత వేటు వేయమని స్పీకర్ తమ్మినేని సీతారాంని కోరబట్టి ఇప్పటివరకైనా ఆగారు అనుకోవాలి. ఇపుడు టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు బయటకు వచ్చారు.
వ్యూహ రచనలో తమ్మినేని సీతారాం
మరో వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన్ బ్యాచ్ ఎపుడు గోడ దూకెద్దామా అని రెడీగా ఉన్నారు. అవసరం లేకపోయినా టీడీపీని కంట్రోల్ చేయాలని వైసీపీలో కొంతమంది ఫిరాయింపులను ప్రోత్సహించమంటున్నారు. మరో వైపు ఏపీ అసెంబ్లీలో తన ఉనికి ఇప్పటి నుంచే గట్టిగా చాటుకుంటే 2024 నాటికి బలపడవచ్చునని బీజేపీ చూస్తోంది.తమ్మినేని సీతారాం చాలా క్లారిటీగా మరో మారు చెప్పారు. ఎవరైనా పార్టీ కండువా మార్చి వేరే పార్టీలోకి దూకితే మాత్రం తన కత్తి పదునుగా పనిచేస్తుందని ఆయన చెప్పేశారు. ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలను కూడా ఆయన ఉదహరిస్తూ మరీ వేటు వేస్తానని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అయితే కీలకమైన ఈ గోడ దూకుళ్ల వ్యవహారం స్పీకర్ స్థానంలో ఉన్న వారి విచక్షణకే మన రాజ్యాంగం వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. ఇక గోడ దూకుళ్ళలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏకంగా కండువా కప్పుకుంటేనే వేటు వేయడం కాదు, నిబంధలన ప్రకారం ఒక సభ్యుడు తాను ఉంటున్న పార్టీని ధిక్కరించినపుడు ఆయన సభ్యత్వం కూడా సంశయంలో పడుతుంది. అయితే ఇక్కడే స్పీకర్లు తమదైన ఆలోచనలతో వారిని కాపాడాలా, పక్కన ఉంచాలా అన్నది కూడా చూస్తారు. ఆ విధంగా చూసుకుంటే వల్లభనేని వంశీని ఇండిపెండెంట్ సభ్యునిగా స్పీకర్ గుర్తిస్తామని అంటున్నారు. ఇది వివాదం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే టీడీపీ ఎంతవరకూ తెగేదాకా లాగుతుందన్నది ఇక్కడ పెద్ద ప్రశ్నఉప ఎన్నికలు ఏపీలో వస్తాయన్న మాట ఇపుడున్న వాతావరణం చూస్తూంటే గట్టిగా వినిపిస్తోంది. అయితే అంతవరకూ కధ సాగకుండా అటు బీజేపీ సైతం వైసీపీకి కన్ను గీటుతోందేదన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభలో ఆరుగురు టీడీపీ ఎంపీలు ఉంటే నలుగురుని తీసుకుని ఒక గ్రూప్ గా మార్చి ఆ తరువాత బీజేపీలో విలీనంగా చూపించుకున్నారు. దాంతో వారి సభ్యత్వాలు బతికాయి, అలాగే అనుకున్న పని కూడా పూర్తి అయింది. అయితే అక్కడ వెంకయ్యనాయుడు పూర్వాశ్రమంలో బీజేపీ నేత కాబట్టి వ్యవహారం సాఫీగా సాగిపోయింది.కానీ ఇక్కడ ఉన్నది జగన్, పైగా స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా కచ్చితంగా అనర్హత వేటు వేస్తానని చెబుతున్నారు. మరి అదే నిజమైతే ఉప ఎన్నికలు వస్తాయి. అయితే మెజారిటీ సభ్యులు కనుక టీడీపీని చీల్చితే వారిని ప్రత్యేక గ్రూపుగా గుర్తించేందుకు నిబంధనల ప్రకారం తమ్మినేని సీతారాం పరిశీలించే అవకాశం ఉంది. కానీ ముగ్గురు నలుగురిని తన వైపునకు తిప్పుకుని వారి సభ్యత్వాలని కాపాడమని బీజేపీ పెద్దలు ఏపీ సర్కార్ ని కోరితే అపుడు పరిస్థితి ఏంటన్న చర్చ కూడా వస్తోంది. అంతా రాజకీయమే, ఎవరు ప్రయోజనాలు వారికి ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో బలమైన ప్రభుత్వంగా ఉంది. మరి ఇక్కడ కాదనే అవకాశం ఉంటుందా. అదే జరిగితే తమ్మినేని సీతారాం ఏం చేస్తారు అన్నది కూడా చూడాలి. మొత్తానికి తమ్మినేని సీతారాం గారికి ఆరు నెలల కాలంలోనే పెద్ద పని పడుతున్న సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.