తేమ పేరుతో మాయ (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తేమ పేరుతో మాయ (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, నవంబర్ 11 (way2newstv.com): 
పత్తిరైతుకు  కష్టాలు మొదలయ్యాయి.. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు నిండా ముంచేయగా, పత్తి అమ్మకాల్లో తేమ శాతం ఎక్కువగా ఉందని వ్యాపారులు ధరలో కోత పెడ్తున్నారు. మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సిన సీసీఐ తేమ ఎక్కువగా ఉందని కొనుగోలుకు  నిరాకరిస్తోంది. మార్కెట్‌లో తేమ పరిశీలించిన తరువాత మళ్లీ జిన్నింగ్‌లో తేమ చూసే అవసరం లేదు. అలాంటిది ఈ ఏడాది కొత్త పద్దతికి తెర లేపారు. మార్కెట్‌ నిబంధనలు పక్కనబెట్టి జిన్నింగ్‌ మిల్లుల్లోనే తూకం, ధరను నిర్ణయిస్తున్నారు. వాస్తవంగా మార్కెట్‌లోనే పత్తిలో తేమ శాతం పరిశీలించి, ధర తదితర వాటిని నిర్ణయించి, తక్‌పట్టీ ఇస్తారు. కాని దీనికి భిన్నంగా మార్కెట్‌లో అధికారులు పరిశీలించి నిర్ధరించిన తేమను వ్యాపారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. 
తేమ పేరుతో మాయ (ఆదిలాబాద్)

పత్తిని జిన్నింగ్‌మిల్లులోకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ తేమను పరిశీలించి, ధరను ఖరారు చేసి మార్కెట్‌ చీటిపై తేమను, ధరను మార్చేస్తున్నారు. రైతులు తిరిగి మార్కెట్‌కు వచ్చి కొత్త తక్‌పట్టీ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంలో అటు మార్కెట్‌ అధికారులు, ఇటు రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం పట్ల రైతులు మండిపడ్తున్నారు. రైతులు తీసుకొచ్చిన పత్తిలో మార్కెట్‌ సిబ్బంది నాలుగు చోట్ల తూకాన్ని పరిశీలించి సగటు తేమను కాగితం వేసి రైతులకు ఇస్తున్నారు. ఈ సమయంలో వ్యాపారులకు చెందిన ఒక వ్యక్తి కూడా అక్కడే ఉంటున్నాడు. నిర్ధ.రణ తేమను, దాని ప్రకారంగా రైతుకు వచ్చే ధరను సంగణకంలో నమోదు చేసి తక్‌పట్టీ ఇస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా జిన్నింగ్‌లో పత్తిని ఖాళీ చేసిన సందర్భంలో మళ్లీ తేమను పరిశీలించి నమోదు చేస్తున్నారు..తక్కువ వస్తే పర్వాలేదు.. అక్కడ ఎక్కువ వచ్చిన సందర్భంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌ సిబ్బంది కేవలం తూకం, తేమ శాతం, ధర వేసి తక్‌పట్టీ ఇస్తున్నారు. తూకం అయిన వాహనాన్ని జిన్నింగ్‌ మిల్లులోకి తీసుకెళ్లి ఖాళీ చేసిన తర్వాత వ్యాపారులు తిరిగి పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించి, అదే చీటిపై తేమ శాతం, ధరను మార్చి ఇస్తున్నారు. అది తీసుకోని రైతులు తిరిగి మార్కెట్‌కు వస్తే, అంతకు ముందు మార్కెట్‌ సిబ్బంది రాసిన తేమ శాతాన్ని తొలిగించి, వ్యాపారులు రాసి ఇచ్చిన తేమ శాతాన్ని సంగణకంలో నమోదు చేసి దాని ప్రకారంగా ధరను లెక్కించి, తక్‌పట్టీ ఇస్తున్నారు. గతేడాది పత్తిలో 12శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే ధర తగ్గించారు. అలాంటిది ఈ ఏడాది సీసీఐ నిబంధనలను వ్యాపారులుకూడా పాటిస్తున్నారు. 8శాతంను పరిగణలోకి తీసుకొని వ్యాపారులు నిర్ణయించిన ధరనే అమలు చేస్తున్నారు. తేమ శాతమనేది కేవలం మద్దతు ధరకు మాత్రమే.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.5,550 ఉన్నప్పుడు తేమ నిబంధనలు పాటిస్తే పర్వాలేదు.. కాని వ్యాపారులు మద్దతు ధరతో సంబంధం లేకుండా తాము నిర్ణయించిన ధరకు కూడా తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోలులో ఉన్న నిబంధనల ప్రకారంగా తేమ శాతం ఎనిమిది ఉంటే మార్కెట్‌లో నిర్ణయించిన ధర వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తేమ శాతం ఎక్కువగా ఉండటంతో రైతులు తీసుకొచ్చే పత్తిలో 15-40 శాతం తేమ ఉంటుంది. తేమ ఎంత ఉన్నా పర్వాలేదు. అదేదో మార్కెట్‌లోనే నిర్ధరించి, ధరను ఖరారు చేయాలే తప్ప, జిన్నింగ్‌లమిల్లులలో ధర, తేమను నిర్ధరించడం ఎంత వరకు సమంజసమని రైతులు అంటున్నారు.