కన్నడ కాంగ్రెస్ లో కలవని నేతలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కన్నడ కాంగ్రెస్ లో కలవని నేతలు

బెంగళూర్, నవంబర్ 29 (way2newstv.com)
కర్ణాటకలో ఉప ఎన్నికల గడువు సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ నేతల్లో మాత్రం చలనం లేదనే చెప్పాలి. ఉప ఎన్నికల్లో గెలిస్తే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమున్నా, పరిస్థితులన్నీ సానుకూలంగా కన్పిస్తున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రూపు తగాదాలతో ఇంకా సతమతమవుతూనే ఉన్నారు. తిరిగి కర్ణాటకలో కాంగ్రెస్ కు జీవం పోయాలన్న ప్రయత్నం కాంగ్రెస్ నేతల్లో లోపించిందనే చెప్పాలి.కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఖాళీ అయిన స్థానాలన్నీ దాదాపుగా అన్నీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే. కాంగ్రెస్ లో అసంతృప్తి నేతలు రాజీనామా చేయడంతోనే కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ సర్కార్ కూలిపోయింది. వారంతా తిరిగి బీజేపీ టిక్కెట్ తో ఇదే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 
కన్నడ కాంగ్రెస్ లో కలవని  నేతలు

ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాల్సిన కాంగ్రెస్ మాత్రం చేష్టలుడిగి చూస్తుందనే చెప్పాలి.నిజానికి పదిహేను నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత సానుభూతి ఉంది. తాము గెలిపించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్లిపోయారన్న అక్కసు ఓటర్లలో ఉంది. వీటిని క్యాష్ చేసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలుపు తమదేనన్న ధీమాతో నిర్లక్ష్యం చేస్తోంది. సిద్ధరామయ్య ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. స్థానిక నేతలను కలుపుకుంటూ ఆయన కొంత క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర సిద్దరామయ్యపై అసంతృప్తితో పెద్దగా ప్రచారంలో పాల్గొనడం లేదు.ఇక మరో కీలక నేత డీకే శివకుమార్ సయితం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ ఇటీవల ఈడీ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన నాటి నుంచి కొంత మెత్తపడినట్లే కన్పిస్తుంది. మరోవైపు బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ నేతలు కాడి వదిలిశాన్న వ్యాఖ్యలు ఆ పార్టీలోనే విన్పిస్తున్నాయి. అందరికన్నా అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన కాంగ్రెస్ ప్రచారంలో మాత్రం వెనుకంజలో ఉందని చెప్పక తప్పదు.