విజయనగరం, డిసెంబర్ 7, (way2newstv.com)
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహాలు మంజూరు చేసింది. విజయనగరం జిల్లాలో వీఎంఆర్‌డీఏ, బుడా పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు, మున్సిపాలిటీలకు 30,760 ఇళ్లు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వీఎంఆర్‌డీఏ పరిధిలో 13,950, బుడా పరిధిలో 12384 ఇళ్లతో పాటు బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలకు 4426 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో వీఎంఆర్‌డీఏ పరిధిలో ఉన్న నెల్లిమర్ల మండలానికి 7101 గృహాలు, చీపురుపల్లి మండలానికి 3415 గృహాలు, ఎస్‌కోట మండలానికి 3434 గృహాలు మంజూరయ్యాయి. అదేవిధంగా స్థానిక సంస్థలైన బొబ్బిలి మున్సిపాలిటీకి 453, సాలూరు మున్సిపాలిటీకి 267, పార్వతీపురం మున్సిపాలిటీకి 3706 గృహాలు మంజూరు చేశారు.
విజయనగరానికి 30వేల కేంద్రం ఇళ్లు
బుడా పరిధిలోని కురుపాం మండలానికి 431, సాలూరు మండలానికి 4095, పార్వతీపురం మండలానికి 1071, సీతానగరం మండలానికి 1271, బొబ్బిలి మండలానికి 4191, దత్తిరాజేరు మండలానికి 1325 గృహాలకు కేంద్రం ఆమోదం తెలిపింది.సొంత ఇల్లు నిర్మించుకోవటానికి పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. చాలీచాలనీ అద్దె గదుల్లో జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గృహాలు మంజూరు చేయడంతో పేదల సొంతింటి కల నెరవేరనుంది. నిర్మాణ వ్యయం పెరిగింది. దీన్ని దష్టిలో ఉంచుకుని యూనిట్ విలువలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు గృహాలకు రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలు రాయితీ ఇస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రానున్నారు. స్థలం ఉన్న వారికి తొలుత ఇళ్లు మంజూరు చేస్తారు. ప్రభుత్వం ఉగాది నాటికి పేదలకు ఖాళీ స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. స్థలాలు అందితే మరింత మందికి గృహయోగం కలుగుతుంది.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, వైఎస్సార్ అర్బన్ గృహ నిర్మాణ పథకంలో కేటాయించిన గృహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించనున్నాయి. పట్టణాల్లో ఇంటికి రూ.3.5లక్షలుగా నిర్ణయించారు. దీనిలో కేంద్రం రూ.1.5లక్షలు, రాష్ట్రం రూ.లక్ష రాయితీ ఇస్తారు. బ్యాంకు రుణం రూ.75వేలు వస్తోంది. లబ్ధిదారు తన వాటాగా రూ.25వేలు భరించాల్సి ఉంటుంది. పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో కేటాయించిన గృహాలకు ఒక్కో దానికి రూ.2లక్షలు యూనిట్ ధర నిర్ణయించారు. దీనిలో కేంద్రం రూ.1.5లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేలు ఇస్తుంది.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్, వైఎస్సార్ అర్బన్ పథకంలో మంజూరైన గృహాలకు అర్హులైనవారిని వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఎంపిక చేస్తారు. వారు నిర్వహించిన సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరించారు. వీరిలో పేదలకు ఇళ్లు మంజూరు చేస్తారని సమాచారం.