నల్లొండ, డిసెంబర్ 28, (way2newstv.com)
రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 128 కోట్లు ఖర్చు పెట్టి 32 మంది జడ్పీ చైర్పర్సన్లకు ఇటీవల టయోటా ఫార్చునర్ కార్లను అందజేసింది. ఓ వైపు ఆర్థిక మాంద్యం, నిధుల కొరత వల్ల సంక్షేమ పథకాల అమలు నిదానంగా సాగుతుంటే జడ్పీ చైర్పర్సన్లకు మాత్రం కొత్త వాహనాల కోసం ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఒక్కో కారు విలువ రూ. 40 లక్షలకు పైగానే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో జడ్పీ చైర్పర్సన్ల గౌరవ వేతనం రూ. 10 వేలు ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దానిని రూ. లక్షకు సీఎం కేసీఆర్ పెంచారు.గతంలో జిల్లా పరిషత్ అంటే 40 పైనే జడ్పీటీసీలతో ఉండేవి. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా పరిషత్ ల సంఖ్య 9 నుంచి 32 కు చేరింది. ప్రస్తుత జిల్లా పరిషత్ లలో 20 లోపు జడ్పీటీసీలు ఉన్న జడ్పీలు 15కు పైగా ఉన్నాయి. ఈ ఏడాది మేలో జరిగిన జడ్పీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వారి బంధువులకే ఎక్కువగా జడ్పీ చైర్పర్సన్లుగా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు.
జెడ్పీ ఛైర్మన్ లకు 40 లక్షలతో కార్లు...
వీరంతా ఆర్థికంగా బలంగా ఉన్నవారు.జడ్పీ చైర్పర్సన్లకు రాష్ట్ర ప్రభుత్వం టయోటా ఇన్నోవా కార్లను ఇవ్వాలని నిర్ణయించగా కొందరు జడ్పీ చైర్పర్సన్లు తిరస్కరించారు. ఎక్కువ రేటు పలికే ఫార్చునర్ కార్ల కోసం పట్టుబట్టారు. ఆరునెలల క్రితం జరిగిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో ఓ జడ్పీ చైర్పర్సన్.. ‘‘కొత్తగా ఎన్నికైన జడ్పీ చైర్పర్సన్లకు వాహనాలు ఇవ్వాలని కోరుతున్నాం. వివిధ పనులు, అధికారిక పర్యటనల నిమిత్తం జిల్లా మొత్తం తిరగాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరలో వాహనాలు ఇవ్వాలి. టయోట ఇన్నోవా కార్లను ప్రభుత్వం ఇస్తానంటోంది. వాటి స్థానంలో ఫార్చునర్ కార్లను ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. ఇట్ల జడ్పీ చైర్పర్సన్లు ఫార్చునర్ కార్ల కోసం పట్టుబట్టడంపై ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక్కో ఇన్నోవా కారు రూ. 28లక్షల వరకు ఉండగా.. ఫార్చునర్ కారు మాత్రం రూ. 40లక్షలకు పైగానే ఉంటుంది. సాధారణంగా.. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ లకు రాష్ట్ర ప్రభుత్వం ఫార్చునర్ కార్లను సమకూరుస్తుంటుంది. తాజాగా జడ్పీ చైర్పర్సన్లకు కూడా అవే వాహనాలను అందజేసింది.ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా, మండల పరిషత్ ల అభివృద్ధికి నిధులిచ్చే ఆనవాయితీ ఉండేది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర ఆర్థిక సంఘం నిధులను గతంలో మాదిరి జిల్లా, మండల పరిషత్ లకు కాకా నేరుగా పంచాయతీలకే ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి జిల్లా, మండల పరిషత్ లకు సరిగా నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా నిధులు లేవంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే చిన్న చిన్న పనులు, వాటి నిధులపైనే పరిషత్ లు ఆధారపడాల్సి వస్తోంది. వీటిలో ఎక్కువగా సీసీ రోడ్లతోపాటు ఇతర పనులు ఉంటాయి. జడ్పీ చైర్పర్సన్లు బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి జడ్పీలకు నిధులు కేటాయించలేదు.