జనవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జనవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి డిసెంబర్ 12 (way2newstv.com)
టిటిడి ఆధ్వర్యంలో జనవరి 8 నుండి 10వ తేదీ వరకు ధనుర్మాస పూజాసహిత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి శ్రీ గోవిందరాజస్వామి మూడవ సత్ర ప్రాంగణములో ప్రారంభమవుతాయి.జనవరి 8, 9వ‌ తేదీల్లో ఉదయం 5.00 గంటల నుండి 7.00 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుండి 12.00 గంటల వరకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, త‌మిళ‌నాడు, మహరాష్ట్ర ప్రాంతాల భజన మండళ్లతో సంకీర్తన నిర్వహిస్తారు. 
జనవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ధార్మిక సందేశం, హరిదాసుల ఉపదేశాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.జనవరి 8వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. అలిపిరి పాదాల మండపంలో జనవరి 10వ‌ తేదీ ఉదయం 4.30 గంటలకు అధికార ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.