అమరావతి డిసెంబర్ 7 (way2newstv.com)
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలపై శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శల వర్షం గుప్పించారు. కేసుల కోసం వెళ్లారు కాబట్టే కేంద్ర హోంమంత్రి అపాయింట్ మెంట్ లేదు. ఢిల్లీలో వైఎస్ జగన్ కు రెండో పరాభవమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత కేసులు, డిశ్చార్జ్ పిటిషన్లు, కోర్టు హాజరీ మినహాయింపుల గురించే అడుగుతున్నారు. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమో, విభజన చట్టం అంశాల అమలుపైన కాదు. అందుకే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలకు కేంద్రం ప్రాధాన్యం లేదు. ఫెమా, మనీలాండరింగ్ పై సిబిఐ, ఈడి కేసులలో మెడలోతు జగన్ కూరుకుపోయారని ఆరోపించారు.
సొంతపనులకోసమే జగన్ ఢిల్లీ పర్యటన
శిక్షపడే సమయం దగ్గర పడిందనే జగన్ కు భయం. ప్రజా ప్రయోజనాల కోసమే వస్తే అపాయింట్ మెంట్ ఇస్తారు. తన కేసుల గురించి అడుగుతున్నారు కాబట్టే అపాయింట్ మెంట్లు ఇవ్వడం లేదు. ఒకవైపు ట్రయల్స్ వేగవంతం కావడంతో జగన్ కు భయం పట్టుకుంది. ప్రతి శుక్రవారం ఏదో పర్యటన పెట్టుకునేది కోర్టు వాయిదా ఎగ్గొట్టేందుకే. 3 శుక్రవారాలు ఏదో వంకతో కోర్టు హాజరీకి డుమ్మా కొట్టారని అన్నారు. ట్రయల్ ప్రారంభమైతే తన నేరాలు రుజువు అవుతాయనే భయం. ఒకవైపు డిశ్చార్జి పిటిషన్లు వేస్తారు. ఇంకోవైపు శుక్రవారమే పర్యటనలు పెడ్తారని యనమల అన్నారు. ఈ కిరికిరి అంతా కోర్టు ట్రయల్స్ లో జాప్యం చేయడానికే. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర అందడం లేదు. భారీ వర్షాలతో పంట ఉత్పత్తులు తగ్గాయి. వేరుశనగ, శనగ, పత్తి, ధాన్యం దేనికీ సరైన ధర లేదు. వేరుశనగ ధర సగానికి పడిపోయింది. క్వింటాల్ రేటు రూ 8,200నుంచి రూ. 4వేలకు పడిపోయింది. శనగ ధర క్వింటాల్ కు రూ.600పడిపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై శ్రద్ద పెట్టలేదని విమర్శించారు. ‘అమ్మాలంటే అడవి-కొనాలంటే కొరివి’’గా మారింది. అటు రైతులను,ఇటు వినియోగదారులను దోచుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళారులే స్వైర విహారం. టిడిపి హయాంలో ఈ పరిస్ధితి లేదు. సకాలంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. అటు రైతులను,ఇటు వినియోగదారులను ఆదుకున్నామని అన్నారు. రైతు బజార్లను మినీ పోలీస్ స్టేషన్లుగా మార్చారు. పోలీసు పర్యవేక్షణలో ఉల్లి పంపిణీనా..? ఉల్లికోసం రైతుబజార్లకు వచ్చిన మహిళలపై దాడులా..? ఉమ్మడి ఏపిలో గతంలో ఇలాగే పోలీసుల ద్వారా విత్తనాలు ఎరువులు పంపిణీ అయింది. మళ్లీ ఆ దుస్థితిని 13జిల్లాల ఏపిలో ఇప్పుడు తెచ్చిన ఘనత వైసిపిదే.టిడిపి సింగపూర్ తరహా నిర్మాణాలు చేపడితే, వైసిపి స్మశాన వాటికలపై దృష్టి పెట్టింది. అమరావతిపై మంత్రి బొత్స స్మశానం కామెంట్స్ అందులో భాగమే అనుకుంటానని అయన అన్నారు.
Tags:
Andrapradeshnews