హైద్రాబాద్, డిసెంబర్ 9, (way2newstv.com)
ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను రాష్ర్టంలో అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పథకాన్ని తెలంగాణలో అమలు చేయించేందుకు కేంద్ర ప్రభుత్వం తొలి నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. పేదలకు ఉపయోగపడే ఈ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని సీఎం కేసీఆర్‌కు గవర్నర్ తమిళిసై సూచించడం, ఆయన హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులను గవర్నర్‌తో సమీక్షకు పంపించడం చకచకా జరిగిపోయాయి. గవర్నర్‌తో భేటీ అయిన మరునాడే, హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ కూడా ఆయుష్మాన్ పథకం అమలు చేస్తే ఉండే ప్రయోజనాలపై ఆఫీసర్లతో చర్చించారు. ఓ నివేదిక తయారు చేయాలని సూచించారు.
తెలంగాణలోనూ... ఆయుష్మాన్ భారత్
కేవలం రాజకీయ కారణాలతోనే కొన్ని రాష్ర్టాల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు పక్కనబెట్టాయి. ఆయుష్మాన్ కంటే, ఆరోగ్యశ్రీనే బెటర్ అని చెప్పి రాష్ర్ట ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో నిరుపేదలకు ఉపయోగపడే పథకాల అమలులో రాజకీయ విభేదాలు పక్కనబెట్టాలని హెల్త్ ఆఫీసర్లతో జరిగిన సమావేశంలో గవర్నర్ సూచించారు. ఆయుష్మాన్ భారత్‌లో లేనివి ఆరోగ్యశ్రీలో ఉంటే, వాటిని ప్రత్యేక పథకంగా ప్రజలకు చెప్పుకోవాలని సలహా ఇచ్చారు. ఢిల్లీ నుంచి ఆఫీసర్లను పిలిపించి ఆయుష్మాన్‌తో ఉన్న లాభాలు ఏంటో ఇక్కడి అధికారులకు చెప్పించారు.ఆరోగ్యశ్రీకి, ఆయుష్మాన్ భారత్‌కు తేడాలు ఉన్నప్పటికీ, ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో పేదలకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందించడమే రెండింటి ప్రధాన ఉద్దేశం. దీంతో రెండు స్కీమ్‌లను కలిపి అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రభుత్వం కూడా ఈ దిశగానే ఆలోచన చేస్తోంది. ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తే, ఆయుష్మాన్‌లో రూ.5 లక్షల వరకు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీలో 972 రకాల ట్రీట్‌మెంట్ ప్రొసీజర్స్ కవర్ అవుతుండగా, ఆయుష్మాన్‌లో 1,350 ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్‌లో లేని 540 ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆరోగ్యశ్రీలో లేని 685 ప్రొసీజర్స్ ఆయుష్మాన్‌లో ఉన్నాయి. ఉదాహరణకు డెంగీ, మలేరియా వంటి వాటికి ఆరోగ్యశ్రీ వర్తించదు.. కానీ ఆయుష్మాన్ వర్తిస్తుంది. కిడ్నీ, లివర్ మార్పిడులు ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆయుష్మాన్‌లో లేవు. రెండిట్లో కామన్‌గా 430 ప్రొసీజర్లు ఉన్నాయి. రెండింటినీ కలిపి అమలు చేస్తే రాష్ర్ట ప్రజలకు 1,887 రకాల చికిత్సలకు ఉచిత వైద్యం లభిస్తుంది.తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుండగా, సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఆధారంగా ఆయుష్మాన్ లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో రాష్ర్టంలోని 26.11 లక్షల కుటుంబాలు కవర్ అవుతున్నాయి. కానీ ఇది ఆరోగ్యశ్రీ కంటే చాలా తక్కువ. ఆరోగ్యశ్రీలో 77.19 లక్షల కుటుంబాలు కవర్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా సగటున రూ.700 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆయుష్మాన్ అమలు చేస్తే 26.11 లక్షల కుటుంబాల కోసం సుమారు రూ.200 కోట్ల వరకూ కేంద్రమే భరిస్తుంది. దీంతో రాష్ర్ట ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ 26.11 లక్షల కుటుంబాలు దేశంలో ఎక్కడైనా ట్రీట్‌మెంట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇతర రాష్ర్టాల్లో ఉంటున్న తెలంగాణ వాళ్లకు, తెలంగాణలో ఉంటున్న ఇతర రాష్ర్టాల వాళ్లకూ మేలు జరుగుతుంది.ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే.. లబ్ధిదారులకు ఇచ్చే కార్డులపై కేంద్ర ప్రభుత్వ పెద్దల బొమ్మలు కూడా ముద్రించాల్సి ఉంటుంది. సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేస్తూ, కేవలం రూ.200 కోట్ల కోసం కేంద్రానికి క్రెడిట్ ఎందుకివ్వాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఆయుష్మాన్‌లో లేని, అవయవమార్పిడి, కాస్మోటిక్ సర్జరీ వంటి పెద్ద చికిత్సలు ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. వీటికోసం అవసరమైన పేషెంట్లకు రూ.13 లక్షల వరకూ రాష్ర్ట ప్రభుత్వం కేటాయిస్తోంది. ఆయుష్మాన్ అమలు చేస్తే, ఇందులో కూడా కేంద్రానికి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందన్న అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో ఉంది. ఇది గమనించే ఇలాంటి ప్రత్యేక ట్రీట్‌మెంట్లను రాష్ర్ట ప్రభుత్వ ఘనతగా ప్రజలకు చెప్పుకోవాలని గవర్నర్ సలహా ఇచ్చినట్టు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఆచరణలో ఎదురయ్యే సమస్యలపై అధికారులు చర్చిస్తున్నారు.ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో.. రాష్ర్ట ప్రభుత్వ క్రెడిట్ దెబ్బ తినకుండా, కేంద్రానికి అదనపు క్రెడిట్ రాకుండా ఆయుష్మాన్ అమలు చేసే అవకాశముందని చెబుతున్నారు. ఆ దిశగానే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా దేశవ్యాప్తంగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ర్టంలోనూ ఈ సెంటర్ల ఏర్పాటును ప్రారంభించారు. ఈ సెంటర్ల ద్వారా రోగాలు రాకుండా ప్రివెంటివ్ చర్యలు తీసుకోవడంతోపాటు, డయబెటిస్, కేన్సర్ తదితర దీర్ఘకాలిక రోగాల పేషెంట్లకు మందులు పంపిణీ చేయనున్నారు.