రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

రైతుల పాలిట శాపం
హైద్రాబాద్, డిసెంబర్ 27, (way2newstv.com)
రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాగా రైతుల పంట బీమాకు సంబంధించిన ప్రీమియం చెల్లించనందున రైతులు నష్టపోయారు. 2017 నుంచి ఇప్పటివరకూ నిజామాబాద్‌ జిల్లా రైతాంగానికి ఒక్కరూపాయి పరిహారం అందలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రిలయన్స్‌, బజాజ్‌ వంటి ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలు ముందుకొచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో లాభాల్లేవని వెనక్కితగ్గాయి. ఇప్పుడు ఆ భారం ప్రభుత్వరంగసంస్థ నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీపై పడుతోంది. అయినా ప్రభుత్వాలు తమ వాటా ప్రీమియం చెల్లించడం లేదు. ఈ విషయాలేవీ తెలియని అన్నదాత అతివృష్టి, అనావృష్టి పరిహారం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

నిజామాబాద్‌ జిల్లాలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం అధికారికంగా 2016 నుంచి ఇప్పటి వరకు 81వేల661.27 ఎకరాల్లో సుమారు 53వేల854 మంది రైతులు పంట నష్టపోయారు. వీరికి బీమా పరిహారంగా రూ.24 కోట్లా 71 లక్షల 81 వేల 947 రావాలి. ఒక్క 2016లోనే రూ.21 కోట్లు పరిహారం అందాలి. అధిక వర్షం, నీటి ఎద్దడి, అకాల వాన, వడగండ్ల కారణంగా రైతాంగం పంట నష్టపోయిందని వ్యవసాయ శాఖ అధికారికంగా గుర్తించింది. అనధికారికంగా ఇంకా ఎక్కువనే ఉంటుందని రైతు సంఘాల నాయకుల మాట. పంట నష్టం మదింపుచేయడంలో వరి తప్ప మిగిలిన పంటలకు మండలం యూనిట్‌గా పరిగణించడం వల్ల కొంతమంది రైతుల పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. అందుకే ఈ బీమాలో రైతును యూనిట్‌గా తీసుకోవాలన్న డిమాండ్‌ కొన్నేండ్లుగా ఉంది.గతంలో పంటల బీమా నిర్వహణకు 'వ్యవసాయ బీమా కంపెనీ లిమిటెడ్‌'ను ఎంపిక చేయగా.. 2016 నుంచి ప్రభుత్వరంగ బీమా కంపెనీని తప్పించి రిలయన్స్‌ను రంగంలోకి దించింది. 2016 ఖరీఫ్‌ వాతావరణ ఆధారిత బీమా పథకంలో రిలయన్స్‌కు అవకాశం కల్పించారు. అదే ఏడాది యాసంగిలో బజాజ్‌ అలియాంజ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి అవకాశమిచ్చారు. రైతుల నుంచి ఏటా ప్రీమియం కట్టించుకుంటున్నప్పటికీ.. పరిహారం మాత్రం ఇవ్వడం లేదు. పంట రుణం తీసుకున్న సమయంలో రైతుకు ఇష్టమున్నా.. లేకపోయినా బలవంతంగా బీమా ప్రీమియం పేరుతో బ్యాంకులు కోత విధిస్తున్నాయి. ఉదాహరణకు 2018 ఖరీఫ్‌లో లోన్‌ తీసుకున్న 13వేల396 మంది రైతుల నుంచి పంట బీమా చేయించగా.. రుణాలు తీసుకోని రైతులు కేవలం 36 మంది మాత్రమే పంట బీమా చేయించుకున్నారు.వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్‌, పసుపు, పత్తి పంటలకు ప్రధానమంత్రి పంటల బీమా పథకంతో పాటు పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఖరీఫ్‌ సీజన్‌లో ఆహార, నూనెగింజల పంటలకు 2 శాతం, యాసంగి పంటలకు 1.5 శాతం రైతులు ప్రీమియం చెల్లించాలి. వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం కట్టాలి. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికమంది పసుపు రైతులే 5 శాతం ప్రీమియం చెల్లిస్తున్నారు. ఉదాహరణకు యాసంగిలో మొక్కజొన్న పంటనష్టానికి ఎకరాకు మొత్తం బీమా రూ.25వేలుగా నిర్ధారించారు. ఇందుకు 2.5శాతం ప్రీమియం పంట బీమాకింద చెల్లించాలి. ఈ ప్రీమియంలో రైతువాటా 1.5 శాతం అంటే రూ.375 చెల్లించాలి. మిగిలిన 1శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50 చొప్పున భరించాల్సి ఉంది. ఆయా జిల్లాల్లో సాగవుతున్న పంటలను బట్టి ఒక పంటను ప్రధాన పంటగా చేసి గ్రామం యూనిట్‌గా అమలు చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో వరి ప్రధాన పంటను గ్రామం యూనిట్‌గా, ఇతర పంటలను మండలం యూనిట్‌గా అమల్జేస్తున్నారు. ఈ పథకం అమలులో వ్యవసాయ శాఖకు అధికారం కల్పించలేదు. బ్యాంకులు, బీమా కంపెనీలే నిర్వహిస్తున్నాయి. అయితే, 2017 నుంచి పంట బీమా ప్రీమియం రాష్ట్రప్రభుత్వం చెల్లించలేదు. రాష్ట్రం ప్రీమియం కట్టిన తరువాత ఆ దస్త్రం కేంద్రానికి వెళ్తుంది. మిగిలిన సగం కేంద్రం చెల్లించిన తరువాత చివరకు రైతుకు పరిహారం అందుతుంది.