విజయవాడ, డిసెంబర్ 23, (way2newstv.com)
మూడు రాజధానుల ప్రతిపాదనపై తెలుగుదేశం పార్టీ అధినేత వెనక్కు తగ్గక తప్పేట్లు లేదు. జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రకటించిన వెంటనే చంద్రబాబు తుగ్లక్ పాలనగా అభివర్ణించారు. అయితే ఆ తర్వాత సొంత పార్టీ నేతల స్వరాల్లో వస్తున్న మార్పులు, వివిధ జిల్లాల్లో పార్టీ పరిస్థితిని బేరేజు వేసుకున్న చంద్రబాబు దీనిపై కొంత సమయం తీసుకుని స్పందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా నేతలతో మాట్లాడి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.అమరావతిని చంపేస్తున్నారని చంద్రబాబు గత కొంతకాలంగా అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటుతున్నప్పటికీ అమరావతిలో ఒక్క పనినీ చేపట్టకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
మూడు రాజధానులపై టీడీపీ మౌనత్మక వ్యూహం
పైగా అమరావతిలో అసలు అభివృద్ధి ఏమీ జరగలేదని, అన్నీ తాత్కాలికమేనని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతుండటంతో చంద్రబాబు అమరావతి రాజధానిలో పర్యటించి పనులను పరిశీలించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే భవనాలతో పాటు సిబ్బంది నివాస సముదాయాలను కూడా పరిశీలించారు.జగన్ రాజధాని అమరావతిని తరలించే ధైర్యం చేస్తారని చంద్రబాబు సయితం ఊహించలేదు. గుంటూరు, కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లో దెబ్బతిన్న పార్టీని కొంత ముందుకు తీసుకెళ్లడానికే ఆయన అమరావతి అంశాన్ని ఎంచుకున్నారు. అయితే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తేవడంతో తొలుత కొంత ఆగ్రహం వ్యక్తం చేసినా ఆ తర్వాత మెత్తబడ్డారు. అన్ని ప్రాంతాల నుంచి జగన్ ప్రభుత్వానికి వస్తున్న మద్దతును చూసి ఆయన వెనక్కు తగ్గక తప్పడం లేదు. ఇప్పుడు దీనిపై తాను తీసుకోబోయే నిర్ణయమే పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పార్టీ ఇప్పటికే దెబ్బతినింది. ఇప్పుడు తాము కూడా అమరావతికే పరిమితమయితే ఇక ఆ జిల్లాలు వచ్చే ఎన్నికల నాటికి కూడా కోలుకోలేవన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నాలుగేళ్లలో జగన్ సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి చేయలేరని, అందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని కూడా చంద్రబాబు విశ్వసిస్తున్నారు. అందుకోసమే మౌనంగా ఉండటమే బెటరని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాల మేరకే తమ నిర్ణయం ఉంటుందని చంద్రబాబు చెప్పడానికి ఇదే కారణమంటున్నారు.