ఇక మున్సిపల్ ఎన్నికలే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇక మున్సిపల్ ఎన్నికలే

హైద్రాబాద్, డిసెంబర్ 3, (way2newstv.com)
మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అవడంతో మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది బిజీబిజీ అయిపోయారు. సర్కారు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వార్డుల డీలిమిటేషన్, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. సోమవారం నుంచి ఆ పనులను ప్రారంభించే అవకాశమున్నట్టు అధికారులు చెబుతున్నారు. కోర్టు తీర్పు కాపీ శనివారమే అందుతుందని భావించిన అధికారులు ప్రభుత్వం నుంచి ఆదే శాలు వస్తాయని ఎదురుచూశారు. అయితే, కోర్టు తీర్పు కాపీ సర్కారుకు అందకపోవడంతో డీలిమిటేషన్పై సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే, కోర్టు ఆదేశాలతో డీలిమిటేషన్కు తీసుకోవాల్సిన చర్య లపై అధికారులు ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. శనివారం వార్డుల వారీగా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు, మళ్లీ లీగల్ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై చర్చించారు.
ఇక మున్సిపల్ ఎన్నికలే

వార్డుల పునర్విభజన ప్రక్రియను 14 రోజుల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైనే మున్సిపల్ అధికారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీర్పేట కార్పొరేషన్కూ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే లీగల్ సమస్యలు లేని మున్సిపాలిటీల్లోనూ మళ్లీ డీ లిమిటేషన్ చేయాలని సర్కారు ఆదేశిస్తే, అందుకు సిద్ధంగా ఉండాలంటూ కమిషనర్లకు సమాచారం వెల్లినట్టు తెలుస్తోంది. స్టేలు ఎత్తేసిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకే డీలిమిటేషన్ను పరిమితం చేస్తే, న్యాయ వివాదాలు లేని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఇతర పనులు పూర్తి చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. పోలింగ్ స్టేషన్లపై అధికారికంగా సమాచారం ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది.జులైలో చేసిన వార్డుల విభజన ప్రక్రియలో మున్సిపల్ అధికారులపై ఒత్తిడి ఎక్కువగా ఉండటంతోనే తప్పులు జరిగినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీలైనంత వరకు అందరినీ మెప్పించేలా డీలిమిటేషన్ చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు 14 రోజుల గడువు ఇచ్చినా మొదటి వారంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు. మిగతా వారం రోజుల్లో వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ తర్వాతే సీడీఎంఏకు డీలిమిటేషన్ వివరాలను అందించాలని భావిస్తున్నారు.