కొండ్రు మురళీ డేట్ ఫిక్స్ చేసేశారు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొండ్రు మురళీ డేట్ ఫిక్స్ చేసేశారు...

శ్రీకాకుళం, డిసెంబర్ 24, (way2newstv.com)
ఉత్తరాంధ్రల్లో టీడీపీ పునాదులు కదిలిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కంచుకోట మంచుకోటగా మారిన తరువాత నుంచి ఇప్పటివరకూ మళ్ళీ కుదురుకోలేదు. విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, కొందరు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు చూస్తున్న సంగతి విదితమే. ఇక విజయనగరంలో బొబ్బిలి రాజులు కూడా గోడ దూకుతారని చాన్నాళ్ళుగా ప్రచారంలో ఉంది. శ్రీకాకుళంలో ఇపుడు మాజీ మంత్రి కొండ్రు మురళి జై జగన్ అంటున్నారు. ఆయన స్వతహాగా కాంగ్రెస్ రాజకీయం వంటబట్టినవారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరినా కూడా ఆయనకు తమ్ముళ్లతో అసలు పడడంలేదు. రాజాంలో పోటీ చేస్తే తన ఓటమికి దగ్గరుండి పసుపు పార్టీ తమ్ముళ్ళు కృషి చేశారని కొండ్రు మురళి చాలా కాలంగా అలిగి ఉన్నారు.
కొండ్రు మురళీ డేట్ ఫిక్స్ చేసేశారు...

ఉత్తరాంధ్రకు ముఖద్వారంగా ఉన్న విశాఖనగరాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకోవడం పట్ల కొండ్రు మురళి ఇప్పటికే సానుకూలంగా స్పందించారు. ఇపుడు ఆయన మరో అడుగు ముందుకేసి ఉత్తరాంధ్ర అభివ్రుధ్ధి కోసం అంటూ జగన్ కి జై కొట్టేందుకు రెడీ అయిపోతున్నారు. వైసీపీ కండువా కప్పుకోవడానికి ఆయన ఉబలాటపడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన ఈ మేరకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో మంతనాలు కూడా జరిపారని టాక్ నడుస్తోంది. ఇక జగన్ సైతం కొండ్రు మురళిని వైసీపీలో చేర్చుకోవడానికి సుముఖంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.దళిత సామాజికవర్గానికి చెందిన కొండ్రు మురళికి ఓ విధంగా రాజకీయంగా వైఎస్సార్ లిఫ్ట్ ఇచ్చారని చెప్పాలి. ఆయన వైఎస్సార్ టైంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా పనిచేశారు. విభజన తరువాత కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఆయన గెలుపు సాధించలేకపోయారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరాలనుకున్నా సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులుకు టికెట్ జగన్ మళ్ళీ ఇస్తానని చెప్పడంతో అక్కడ కుదరక టీడీపీ వైపు వచ్చారు.రాజాం టికెట్ ని మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తెను కాదని కొండ్రు మురళికి ఇచ్చినా అక్కడ బలంగా ఉన్న కళా వెంకటరావు వర్గం సహకరించలేదని మురళి వర్గీయులు ఆరోపిస్తూ వచ్చారు. ఇక సహజంగానే మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కూడా కొండ్రు మురళి గెలుపునకు కృషి చేయలేదన్న బాధ ఉంది. ఇవన్నీ కలసి కొండ్రు మురళి చాలాకాలంగా పార్టీని వీడాలనుకుంటున్నారు. ఇపుడు దానికి తగిన సమయం వచ్చిందని ఆయన భావిస్తున్నారు. మరో వైపు బీజేపీ సైతం కొండ్రు మురళిని ఆహ్వానించినా కూడా ఆయన వైసీపీ వైపే వస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే మాజీ మంత్రి గోడ దూకితే సిక్కోలు జిల్లాలో టీడీపీ బలం మరింత తగ్గిపోవడం ఖాయమని అంటున్నారు.