కర్ణాటక కాంగ్రెస్ లో మార్పులు.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కర్ణాటక కాంగ్రెస్ లో మార్పులు..

బెంగళూర్, డిసెంబర్ 18 (way2newstv.com)
కర్ణాటక కాంగ్రెస్ లో గందరగోళం ఇంకా నెలకొనే ఉంది. ఇద్దరు ముఖ్యమైన పదవులకు రాజీనామా చేసినా ఎవరిని ఆ పదవుల్లో నియమించాలన్న దానిపై ఇంకా అధిష్టానం నిర్ణయం తీసుకోలేదు. దీనికి కారణం ఎవరికి పదవులిచ్చినా మరో వర్గం అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. సీఎల్పీ నేతగా సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా దినేష్ గుండూరావులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఎన్నికల ఫలితాలు వెలువడగానే నైతిక బాధ్యత వహిస్తూ ఇద్దరూ రాజీనామాలు చేశారు. అయితే ఈ రెండు ముఖ్యమైన పదవులు కావడం, రాజీనామా చేసిన ఇద్దరు నేతలు ముఖ్యమైన వారు కావడంతో వీరి స్థానంలో ఎవరిని నియమించాలన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. 
కర్ణాటక కాంగ్రెస్ లో మార్పులు.....

సిద్ధరామయ్య ప్లేస్ లో పరమేశ్వరకు అప్పగించాలని తొలుత భావించింది. దళిత నేతకు పట్టం కట్టినట్లు అవుతుందని కూడా ఒక దశలో అధిష్టానం ఆలోచనగా ఉంది.అయితే సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదిస్తే కర్ణాటక కాంగ్రెస్ లో మరో ముసలం పుట్టే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్ శాసనసభ్యుల్లో సిద్ధరామయ్య అనుచరులే ఎక్కువగా ఉన్నారు. అంతకు ముందు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి జరిపిన అభిప్రాయ సేకరణలోనూ సిద్ధరామయ్యకే ఎక్కువ మంది మొగ్గు చూపారు. అందుకే అప్పట్లో సిద్ధరామయ్యను ఆ పదవిలో కొనసాగించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే తనంతట తానుగానే సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవిలో పరమేశ్వరను నియమించాలా? వద్దా? అన్న దానిపై సీనియర్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది.ఇక కేపీసీసీ అధ్యక్షుడిగా దినేష్ గుండూరావు స్థానంలో డీకే శివకుమార్ ను నియమించాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ను నియమిస్తే కొంత పార్టీకి మైలేజీ వస్తుందని అనుకుంటోంది. కానీ డీకే శివకుమార్ పై ఈడీ కేసులు నమోదు కావడంతో కొంత ఆలోచనలోకి కాంగ్రెస్ అధిష్టానం వెళ్లిందంటున్నారు. మొత్తం మీద సిద్ధరామయ్యను తిరిగి ఆ పదవిలో కొనసాగించాలనుకుంటున్న కాంగ్రెస్ హైకమాండ్ డీకే శివకుమార్ కు మాత్రం కేపీసీసీ పగ్గాలు అప్పగించి తిరిగి కర్ణాటకలో బలోపేతం కావాలని చూస్తుంది. మొత్తం మీద మరికొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది.