ఫాస్ట్ ట్యాగ్ విధానంతో నానా పాట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫాస్ట్ ట్యాగ్ విధానంతో నానా పాట్లు

నల్లగొండ, డిసెంబర్ 18, (way2newstv.com)
వాహనదారులు టోల్‌గేట్ల వద్ద ఆగకుండా నేరుగా వెళ్లేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఫాస్ట్ ట్యాగ్ విధానం ఆదివారం నుంచి అమల్లోకి రావడంతో ఫాస్టాగ్ లేని వాహనదారులు నానాపాట్లు పడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా విజయవాడ-హైద్రాబాద్ రహదారిపై పంతంగి, కొర్లపహడ్ టోల్‌గేట్లు, వరంగల్-హైద్రాబాద్ జాతీయ రహదారి మీదుగా గూడూరు టోల్‌గేట్‌ల వద్ద నిర్వాహకులు ఫాస్ట్ టాగ్‌ను అమలు చేశారు. ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్న వాహనాదారులు టోల్‌గేట్ వద్ద నిమిషం కూడా ఆగకుండా నేరుగా ముందుకు దూసుకెళ్లిపోయారు. ఇదే సమయంలో ఇప్పటిదాకా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోని వాహనదారులు. టోల్‌గేట్ వద్ద బారులు తీరి ట్రాఫిక్ జామ్‌తో ఇక్కట్లు ఎదుర్కోన్నారు. 
ఫాస్ట్ ట్యాగ్ విధానంతో నానా పాట్లు

పంతంగి టోల్‌గేట్ వద్ద 16 గేట్లకు గాను రెండు వైపులా కలిపి ఫాస్ట్ ట్యాగ్ వాహనాలకు పది, ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు ఆరు గేట్లు కేటాయించడంతో ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారులే మెజార్టీగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు అర కిలోమీటర్ వరకు బారులు తీరడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు. ఇప్పటివరకు వాహనదారుల్లో కేవలం 40 శాతం మంది మాత్రమే ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నారని, మరో నెల రోజుల పాటు ఫాస్ట్ ట్యాగ్ తీసుకునేందుకు గడువు ఇవ్వాలని వాదించడం కనిపించింది. మరోవైపు ఫాస్ట్ ట్యాగ్ గేట్ల మీదుగా వెళ్లేందుకు ఫాస్ట్ ట్యాగ్ లేని నగదు చెల్లింపు వాహనదారుల నుండి అదనపు టోల్ చార్జీలు వసూలు చేశారు. అదనపు చార్జీలు చెల్లించలేని వారు ఫాస్ట్ ట్యాగ్ టోల్‌గేట్ నుండి బారులు తీరాల్సివచ్చింది. కొర్లపహడ్ టోల్‌గేట్ వద్ద సూర్యాపేట, హైద్రాబాద్‌ల వైపు పనె్నండు గేట్లకు గాను రెండువైపులా కలిపి ఎనిమిది గేట్లు ఫాస్ట్ ట్యాగ్ వాహనాలకు, నాలుగు గేట్లు నగదు చెల్లింపు వాహనాదారులకు కేటాయించారు. ఫాస్ట్ ట్యాగ్ తీసుకోని వాహనదారులే అధికంగా రావడంతో టోల్‌గేట్ వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. రెండు గేట్లలో వాహనాలపై ఉన్న ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ల బార్‌కోడింగ్ స్కాన్ చేయడంలో స్కానర్లు మొరాయించడంతో నిర్వాహకులు, వాహనాదారులు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో కొన్ని వాహనాలకు నిర్వాహకులు పాత పద్ధతిలోనే టోల్ చార్జ్ తీసుకుని పంపించారు. సాయంత్రంకల్లా స్కానర్ల సమస్య పరిష్కారమవ్వడంతో ఇబ్బంది తొలగిపోయింది. ఇక వరంగల్-హైద్రాబాద్ మార్గంలో గూడూరు టోల్‌గేట్ వద్ద పనె్నండు గేట్లకు గాను రెండువైపులా కలిపి ఫాస్ట్ ట్యాగ్‌కు ఎనిమిది గేట్లు, ఫాస్టాగ్ లేని వాహనాలకు నాలుగు గేట్లు కేటాయించారు. అంతటా కూడా టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్ లేని వాహనదారులు తమవాహనాలు టోల్‌గేట్ దాటడంలో ఆలస్యమవుతుండటం పట్ల అసంతృప్తి వెళ్లగక్కారు. కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ విధానంపై మరింత ప్రచారం నిర్వహించి మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలన్న డిమాండ్ వారి నుండి గట్టిగా వినిపించింది. అయితే, హైవే అథారిటీ అధికారులు మాత్రం కేంద్రం ఇప్పటికే ఒకసారి ఫాస్ట్ ట్యాగ్ గడువు పొడిగించి ఆదివారం నుండి ఆ విధానం అమల్లోకి తెచ్చిందన్నారు. ఫాస్టాగ్ వాహనదారులకు 2.5 శాతం క్యాష్ బాక్ ఆఫర్ కూడా ఇచ్చిందన్నారు. ఇకనైనా ఫాస్టాగ్ తీసుకోని వాహనదారులు వెంటనే ఫాస్టాగ్ తీసుకుని సహకరించాలని కోరారు. నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారిపై మరో నెల రోజుల పిదప ఫాస్టాగ్ అమల్లోకి వస్తుందని నిర్వాహకులు తెలిపారు.