తిరుమల జనవరి 6 (way2newstv.com)
ముక్కోటి ఏకాదశి సందర్బంగా తిరుమల భక్తకోటితో కళకళలాడింది. ఆదివారం మధ్యాహ్నానికే వేలాదిగా వచ్చిన భక్తులతో ఏడుకొండలు భక్తసంద్రాన్ని తలపించాయి. తితిదే నిర్మించిన తాత్కాలిక జర్మన్ షెడ్లు, కంపార్ట్మెంట్లు, గ్యాలరీల్లోకి చేరుకున్న యాత్రికులు.. గోవిందనామస్మరణతో వేచిచూస్తున్నారు. సాయంత్రం తర్వాత వచ్చిన భక్తులను అధికారులు కల్యాణవేదిక వద్దకు మళ్లిస్తున్నారు. ముందుగానే వచ్చిన వేలాది మంది కూడా శ్రీవారి దర్శనానికి వెళ్లకుండా.. వైకుంఠ ఏకాదశి ఘడియల కోసం వేచి చూసారు. మరోపక్క ధర్మదర్శనానికి వెళ్లేవారికి ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయగా.. సాధారణ క్యూలైన్లలో వెళ్లిన వారికి గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది.
అంతటా గోవిందనామస్మరణే
మొదటగా వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోకి 15 వేల మంది, మాడ వీధుల్లో ఏర్పాటుచేసిన జర్మన్ షెడ్లలో 40 వేల మంది, నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లలో 30 వేల మందితోపాటు, కల్యాణవేదిక వద్ద భక్తులు నిండిపోయారు.ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లువీఐపీలకు తితిదే ప్రత్యేకంగా పాసులను అందించింది. గదుల కేటాయింపునకు పద్మావతి విచారణ కార్యాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో కాటేజీలను ఖాళీగా ఉంచింది. ప్రత్యేకంగా కౌంటర్లు కేటాయించింది. సామాన్య భక్తులకు సీఆర్వో నుంచి గదులను కేటాయించారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన మంజూరు చేశారు. గ్యాలరీలు, షెడ్లలో భక్తులకు అన్నప్రసాదాలను వారివద్దకే చేర్చారు. దాదాపు 3లక్షల వాటర్ బాటిళ్లు, ఒకటిన్నర లక్ష మజ్జిగ ప్యాకెట్లను తెప్పించగా.. సాయంత్రం నుంచి పంపిణీ ప్రారంభించారు. చలికి ఇబ్బంది పడకుండా తితిదే దుప్పట్లను పంపిణీ చేసింది.