హైద్రాబాద్, జనవరి 22, (way2newstv.com)
రాజకీయాల్లో ఎత్తులు వేసేవారికి పై ఎత్తులు వేసే వారు కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి చర్యలే తెలంగాణలోనూ జరుగుతున్నాయి. అధికారపార్టీ అధినేత కేసీఆర్ నాయకులను లైన్‌లో పెట్టుకునేందుకు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. సొంత పార్టీ నేతలే అయినా తోక ఝాడిస్తే లైన్లో కి ఎలా తేవాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అంటున్నారు విశ్లేషకులు. గతంలో డీఎస్, నాయిని నరసింహారెడ్డి వంటి వారు కొంత మేరకు దురుసుగా వ్యవహరిస్తున్నప్పుడు పార్టీలైనుకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా సీనియర్లు అని కూడా చూడకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులువేసి వారిని లైన్‌లోకి తెచ్చారు. లేదా వారికి రాజకీయంగా వేదిక లేకుండా చేశారు.ఇప్పుడు కూడా ఓ కీలక నాయకుడికి కేసీఆర్ ఇలాంటి పనిష్మెంటే ఇస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
మంత్రికి చెక్ పడింది
తెలంగాణలో కీలకనాయకుడిగా ఎదిగిన మల్లారెడ్డి తన ఇష్టాను సారం వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన పై విపక్ష నేతలు తీవ్రస్తాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మల్లారెడ్డికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే టీడీపీ నాయకుడైన మల్లారెడ్డికి రాజకీయంగా చతురత ఎక్కువ. ఎక్కడ ఎలా ఉంటే తనకు ఉపయోగపడుతుందో తెలిసిన నేతగా కూడా పేరుంది.2014లో టీడీపీ తపున ఆయన మల్కాజిగిరి ఎంపీగాపోటీ చేసి విజయం సాధించారు. అయితే, వాస్తవానికి ఆ టికెట్‌ను వేరేవారికి ఇవ్వాల్సి ఉంది. కానీ, తనదైన చతురతతో చంద్రబాబును మెప్పించిన మల్లారెడ్డి ఈ టికెట్‌ను దక్కించుకున్నారు. ఇక, 2018 నాటికి ఆయన కేసీఆర్ పంచకు చేరిపోయారు. ఈ క్రమంలోనే ఆయన అప్పటి ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఉండి కూడా కేసీఆర్ దగ్గర మళ్లీ రాజకీయ చాతుర్యం ప్రదర్శించి టీఆర్ఎస్ తరఫున మేడ్చల్ టికెట్‌ను సంపాయించుకుని విజయం సాధించారు. అంతేకాదు, మరింతగా కేసీఆర్‌ను మచ్చిక చేసుకుని మంత్రి వర్గంలోనూ బెర్త్ సంపాయించుకున్నారు.మల్లారెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్, ఆ వెంటే మంత్రి పదవి రావడం వెనక పార్టీకి భారీ ఫండింగ్ చేయడం కారణం అన్న టాక్ కూడా వినిపించింది. ఇంత వరకు బాగానే ఉంది. మల్లారెడ్డి గెలిచి మంత్రి అయిన వెంటనే ఆయనలో మార్పు వచ్చిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మంత్రిగా మల్లారెడ్డి తన హవాను పెంచేశారు. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రిగా తన పవర్ చూపిస్తూ భారీ ఎత్తున అవినీతికి తెగబడుతున్నారనే వారోపణలు వినిపిస్తున్నాయి. అసలే దున్న ఈనిందంటే దూడను కట్టేయమే ప్రతిపక్షాలు ఉన్న తెలంగాణలో ఇలాంటి వారి వల్ల మరింతగా ప్రభుత్వంపై విమర్శలు అస్త్రాలు పడ్డాయి. సీఎం కేసీఆర్ మల్లారెడ్డికి చెక్ పెట్టాలని నిర్ణయించారని టాక్. అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మల్లారెడ్డి విషయంలో అసహనంతోనే ఉన్నారట. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయన తీరుపై అధిష్టానానికి పదే పదే ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారని పార్టీ వర్గాల టాక్. ఇక గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్లారెడ్డి పట్టుబట్టి మరీ మల్కాజ్‌గిరిలో రేవంత్‌రెడ్డిని ఓడిస్తానని సవాల్ చేసి ఆయన అల్లుడికి ఎంపీ సీటు ఇప్పించుకున్నారు.ఆ ఎన్నికను కేసీఆర్ ఛాలెజింగ్‌గా తీసుకున్నారు. రేవంత్‌ను ఎలాగైనా ఓడించాలని చెప్పారు. అయినా ఆ ఎన్నికల్లో రేవంత్ గెలవడంతో మల్లారెడ్డి పరువు కాస్తా కేసీఆర్ దగ్గర ఖల్లాస్ అయినట్లయ్యింది. ఇక అప్పటి నుంచి మల్లారెడ్డి హవాకు చెక్ పెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అదే రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఆ వెంటనే జిల్లా బాధ్యతలను కూడా ఆమెకే పరోక్షంగా అప్పగించారు. ఇప్పుడు జిల్లా పెత్తనం అంతా ఆమె చేతుల్లోనే ఉంది. మరోపక్క స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే మునిసిపాల్టీలు, కార్పొరేషన్లు ఏడు వరకు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఆయన టిక్కెట్లు అమ్ముకున్నారని వచ్చిన ఆరోపణలు, లీక్ అయిన ఆడియో టేప్‌లు కూడా పార్టీకి తలనొప్పిగా మారాయి. ఈ ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోతే ఆ సాకుతోనే ఆయనకు కేసీఆర్ అదిరే షాక్ ఇస్తారన్నదే ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో వినిపించే టాక్.