విజయవాడ, జనవరి 22, (way2newstv.com)
రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నాయకులు చెప్పేది.. వినేవారికి సరైనదిగానే కనిపిస్తోంది. తమ తమ కోణాల్లో వాదనలు సమర్థంగానే వినిపిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు తమదైన సైకాలజీ కూడా వారి నిర్ణయాల్లో ముడిపడి ఉంటోంది. తమ వాదనలు సమంజసమే అనే భావనను ప్రజల్లో కలిగించడంలో జగన్, చంద్రబాబు లు ఇద్దరూ సక్సెస్ అవుతున్నారు. అమరావతి కేంద్రంగా కేంద్రీకృత రాజధానిని చంద్రబాబు తన పాలనకు మోడల్ గా ఎంచుకుంటే మూడు ప్రాంతాల్లో రాజధానులంటూ జగన్ సరికొత్త ఆవిష్కరణకు తెర తీశారు. ఆయా నిర్ణయాలకు అగ్రనాయకుల వ్యక్తిగత వ్యవహార శైలి, సైకాలజీ, ఆలోచన దృక్పథాల్లోని వైరుద్ద్యాలే కారణం. రెండున్నర దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ ల ప్రస్థానం , రాజకీయ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆధునిక దృక్పథం, దీర్ఘకాల దృష్టి చంద్రబాబు విధానాల్లో కనిపించే ముఖ్యాంశాలు.
రాజధానులు సంగతే... ఆదాయం సంగతేంటీ...
సాధారణంగా రాజకీయ నేతలు జనాకర్షక, జనాదరణ విధానాలకు పెద్ద పీట వేస్తుంటారు. కానీ పాలనలో తనను తాను ముఖ్య కార్యనిర్వహణాధికారిగా భావించుకునే చంద్రబాబు నాయుడు ఈవిషయంలో వెనకబాటు తనమే కనబరుస్తారు. అమరావతిని కేంద్రీకృత పవర్ సెంటర్ గా, అన్ని వ్యవస్థలు ఒకే చోట నెలకొల్పాలని ఆయన తీసుకున్న నిర్ణయం దీర్ఘకాల దృష్టితో ముడిపడింది. భవిష్యత్తులో నగరం పెరిగి రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా మారుతుందనేది చంద్రబాబు ఆలోచన. అయితే ఇది చాలా దశాబ్దాలు పట్టే ప్రక్రియ. కొన్ని సంవత్సరాలపాటు నగరం పై పెట్టుబడులు పెడుతూ పోతేనే ఆ కల నిజమవుతుంది. ఈ లోపు నగరాన్ని సకల మౌలిక వసతుల నిలయంగా మార్చాలి. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు తన డెవలప్ మెంట్ విజన్ ను రూపకల్పన చేసుకున్నారు.ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానపరమైన వైఖరిలో చంద్రబాబు నాయుడు కు పూర్తి భిన్నమైన శైలిని కనబరుస్తారు. కొన్ని దశాబ్దాల తర్వాత ప్రధాన ఆదాయ వనరుగా మారే అమరావతి కోసం వేచి చూసేంత సహనం, ఓపిక జగన్ మోహన్ రెడ్డి లో లేదనే చెప్పాలి. ఇప్పటికే మౌలిక వసతుల పరంగా ముందంజలో ఉన్న విశాఖ వంటి ప్రాంతంలో రాజధానిని నెలకొల్పితే రెండు మూడేళ్ల కాలవ్యవధిలోనే రాష్ట్రానికి అతి ప్రధాన ఆదాయవనరుగా మారుతుందనే భావన జగన్ ది. రాజధాని హోదాతో అక్కడికి పెట్టుబడులు, ఇతరత్రా సంస్థలు వాటంతటవే తరలి వస్తాయి. కాబట్టి ఈరకమైన అభివృద్ధి మోడల్ తక్షణ ఫలితాలను ఇచ్చేదిగా ప్రస్తుత ముఖ్యమంత్రి బలంగా విశ్వసిస్తున్నారు.చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఉన్న రాజకీయ వైరం కోణంలోనే రాజధాని తరలింపు సాగుతోందనేది పాక్షిక సత్యంగానే చెప్పుకోవాలి. దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది. ఏపీని అభివృద్ధి చేసే విధానంలో, ఆదాయ పరంగా అగ్రస్థానంలోకి తెచ్చే విషయంలో ఇరువురి నాయకుల విజన్ లో ఉన్న వైరుద్ధ్యాలే ప్రస్తుత పరిస్థితి కి కారణం. ప్రణాళిక బద్దమైన కొత్త నగరాన్ని నిర్మించి కలలు పండించుకోవాలనేది చంద్రబాబు విజన్. పెద్ద నగరంగా ఉన్న విశాఖ ను వినియోగించుకుని ఫలితాన్ని వెంటనే పొందాలనేది జగన్ విజన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు సభ్యునిగా జగన్ మోహన్ రెడ్డి మరికొంతకాలం వేచి ఉంటే అప్పట్లోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించేదని రాజకీయ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి అంతటి ఎదురుచూపునకు సిద్ధపడకపోవడంతోనే సొంతంగా పార్టీని నెలకొల్పుకుని రాజకీయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ వైఖరి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వశైలికి నిదర్శనం.అధికార కేంద్రీకరణ, వికేంద్రీకరణ వంటి విషయాలు పైకెన్ని చెప్పినా ప్రస్తుతం రాష్ట్రానికి ఆదాయం పెద్ద సమస్య. వాస్తవ బడ్జెట్ లో అరవై శాతం పైచిలుకు సంక్షేమ పథకాలకే మళ్లించాల్సిన దుస్థితి. రాజకీయ పార్టీల అధికారానికి జనాకర్షణే ప్రధాన మార్గంగా మారిన స్థితిలో స్కీముల విషయంలో వ్యయానికి కోత విధించే సాహసం ఏ ప్రభుత్వమూ చేయదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు తప్ప భారీ ప్రాజెక్టులు చేపట్టేంత వనరులు సర్కారు వద్ద లేవు. కొత్తగా పెట్టుబడులు పెట్టలేని నిస్పహాయత, తక్షణం ఆదాయం పెంచుకోవాల్సిన అనివార్యత, నాయకుల దృష్టి కోణమే ప్రస్తుత అనిశ్చితికి కారణంగా చెప్పవచ్చు. ప్రజల సెంటిమెంటును సంతృప్తి పరిచే ఆలోచనతోనే అమరావతి లెజిస్లేచర్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అంటూ పేర్కొంటున్నారు. అవి సెంటిమెంటు రాజధానులుగా నామమాత్రంగా మిగిలిపోక తప్పదు. నిజానికి కొత్త ప్రభుత్వ నిర్ణయం అమలైతే పాలన కార్యక్షేత్రంగా విశాఖనే ఉంటుంది. అదే ప్రధాన రాజధాని, వాస్తవ రాజధానిగా గుర్తింపునకు నోచుకుంటుంది. నేతల వ్యక్తిగత వైరం వాస్తవమే అయినప్పటికీ వారి విజన్ లో పూర్తి వైరుద్ధ్యాలే రాజధానిని తిరగదోడటానికి కారణమవుతోందని చెప్పాలి.