టీడీపీలో నైరాశ్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీలో నైరాశ్యం

విజయవాడ, జనవరి 6, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని గొప్పలు చెప్పుకుంటారు. పార్టీ కార్యకర్తల నుంచి నేతల వరకూ క్రమశిక్షణ పాటించకుంటే వేటు తప్పదని చంద్రబాబు అప్పుడప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు కూడా. అయితే ఇప్పుడు టీడీపీలో క్రమశిక్షణ లోపించింది. పార్టీలో అంతా ఫ్యామిలీ పాలి”ట్రిక్స్” నడుస్తున్నాయి. ఒక కుటుంబంలో ఒకరు ఒక పార్టీ మరొకరు టీడీపీలో కొనసాగుతూ క్యాడర్ లోనే అయోమయం సృష్టిస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నా అధినేత చంద్రబాబు మాత్రం ఏమీ చేయలేకపోతున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు.2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీలో నైరాశ్యం అలుముకుంది. అయితే ఇది ఏ రాజకీయ పార్టీలోనైనా సర్వ సాధారణమే. అధికారంలోకి రాకుంటే కొద్ది రోజులు నేతలు పార్టీని పట్టించుకోరు. 
టీడీపీలో నైరాశ్యం

అదే టీడీపీలోనూ జరుగుతుందని భావించారు. కానీ అది భ్రమేనని తేలింది. ఎందుకంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిని వేరే పార్టీలోకి పంపడం టీడీపీలో కొత్త, వింత రాజకీయాలకు తెరలేపారు. ఇది క్యాడర్ సయితం జీర్ణించుకోలేకపోతున్నారు.కర్నూలులో పేరున్న నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లిపోయారు. ఆయన బీజేపీ తరుపున పనిచేస్తున్నారు. ఆయన తనయుడు టీజీ భరత్ మాత్రం టీడీపీలో కర్నూలు పట్టణ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. తండ్రీ కొడుకులు చెరో జెండా పట్టుకుని ఊరేగుతున్నారు. ఇక భూమా అఖిలప్రియ టీడీపీలో కొనసాగుతుండగా వారి సోదరులు కిషోర్ రెడ్డి, మహేష్ రెడ్డిలు బీజేపీలో చేరిపోయారు. ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ బీజేపీ జెండా పట్టుకుని తిరుగుతోంది.తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేత బీద మస్తాన్ రావు వైసీపీలో చేరిపోయారు. ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇక మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోగా ఆయన సోదరుడు శివనాధ్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీగా టీడీపీలోనే ఉన్నారు. ఇక విశాఖ జిల్లాలో అయ్యన్న పాత్రుడు టీడీపీలో ఉండగా ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరారు. ఒకే ఇంటిపై రెండు జెండాలు ఎగురుతున్నా, ఒకే వీధిలో కుటుంబ సభ్యులు రెండు పార్టీల బ్యాడ్జీలు పెట్టుకుని తిరుగుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదీ టీడీపీలో జరుగుతున్న వింత, అవకాశ రాజకీయాలకు మచ్చు తునక.