కాకినాడ, జనవరి 22, (way2newstv.com)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం చేయలేకపోతున్నారు. తాను జారీ చేసిన ఆదేశాలను థిక్కరించినా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై ఎటువంటి చర్యలకు దిగలేకపోతున్నారు. గత కొంతకాలంగా పార్టీ లైన్ ను థిక్కరిస్తున్న రాపాక వరప్రసాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మనసులో ఉన్నా ఆ పని చేయలేెకపోతున్నారు. అదే చేస్తే రాపాక వరప్రసాద్ కు మరింత వెసులు బాటు ఇచ్చినట్లవుతుందన్న సూచనల మేరకు రాపాక విషయంలో చూసీ చూడనట్లే వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. పార్టీ అధినేత రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయినా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. అయితే కొన్నాళ్లు జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్న రాపాక వరప్రసాద్ క్రమంగా అధికారపార్టీకి దగ్గరయ్యారు.
రాపాక విషయంలో ఆచితూచి అడుగులు
మంత్రి విశ్వరూప్ తో సఖ్యత కారణంగా ఆయన జనసేనకు దూరమయ్యారనే చెప్పాలి. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేశారు.మరోవైపు జనసేన అధినేత నిర్వహించే కార్యక్రమాలకు కూడా హాజరు కావడంలేదు. దీనికి రాపాక వరప్రసాద్ సమాధానం ఒక్కటే. తనకు పార్టీలో గౌరవం లేదని. ఒక్కగా ఉన్న ఎమ్మెల్యేను కనీసం జనసేన ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. దీంతో వరసగా పవన్ కల్యాణ్ నిర్ణయాలను థిక్కరిస్తూ వస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంను పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించినా రాపాక వరప్రసాద్ జగన్ నిర్ణయాన్ని సమర్థించారు.నిన్న అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదనను కూడా రాపాక వరప్రసాద్ స్వాగతించారు. జగన్ నిర్ణయాన్ని రాష్ట్రమంతటా సమర్థిస్తున్నారని తెలిపారు. తమ అధినేత కూడా మనసులో సమర్థించాలని ఉన్నా ప్రతిపక్షంలో ఉండటంతో స్వాగతించడం లేదన్నారు. అయితే తన ఆదేశాలను ధిక్కరించిన రాపాక వరప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. అయినా పవన్ కల్యాణ్ మాత్రం ఆ చర్య తీసుకోలేకపోతున్నారు. సస్పెండ్ చేసినా రాపాకకు అడ్వాంటేజీగా మారుతుందని భావిస్తున్నారు. అయితే పార్టీలో ఉన్నా ఆయన వల్ల ప్రయోజనం ఏముందన్న ప్రశ్న కూడా తలెత్తోంది.