విజయవాడ, జనవరి 3, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరూ నాయకులే. అందరూ పెద్దోళ్లే. వారిలో ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని వ్యవహారంలో ఒక్కొక్కరూ ఒక్కో విషయాన్ని చెబుతున్నారు. నేను చెప్పిందే ఫైనల్ అంటే నేను చెప్పిందే ఫైనల్ అన్నట్టు చెబుతున్నారు. వీరందరిలో అసలు ఎవరి ప్రటకన పార్టీ అధికారిక ప్రకటనగా తీసుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారట. అంతేనా.. అసలు పొంతన లేని ప్రకటనలతో పిచ్చెక్కించేస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. మూడు రాజధానుల విషయంలో ఇదే ఫైనల్ అని అర్థమొచ్చేలా ఆ మధ్య ఎంపీ సుజనా చౌదరి మాట్లాడారు.అమరావతిని తరలిస్తామంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చెప్పుకొచ్చారు.
కమలం పార్టీ ప్రతి ఒక్కరిది తలోదారి
ఈ విషయాన్ని తనకు డైరెక్ట్‌గా ప్రధాని మోదీయే చెప్పారని అంటున్నారు. ఇదే ఫైనల్... ఇందులో మరో మాటకు అవకాశమే లేదన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. రాష్ట్రం తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే కేంద్రం అనుమతించేస్తుందని అనుకోవద్దన్నది సుజనా మాట. మరోపక్క, సుజనాతో పాటే బీజేపీలో చేరిన మరో ఎంపీ సీఎం రమేశ్ మాత్రం ఇంకో మాట చెబుతున్నారు. కేంద్రం రాజధానిపై సూచనలు చేస్తుందే తప్ప.. అందులో జోక్యం చేసుకోదన్నది సీఎం రమేశ్ మాట.ఈ ఇద్దరు బీజేపీ ఎంపీలు కేంద్రం జోక్యం చేసుకొనే విషయంలో తలో విధంగా మాట్లాడుతున్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అని సీఎం రమేశ్ అంటూనే అమరావతి నుంచి రాజధాని మార్పును మాత్రం బీజేపీ వ్యతిరేకిస్తుందని అంటారు. మరోపక్క అసలు రాజధానిని తరలించడాన్ని కేంద్రం అంగీకరించదని సుజనా చెబుతారు. ఇంకో పక్క అసలు బీజేపీ తరఫున తాను చెప్పిందే ఫైనల్ అన్న అర్థం వచ్చేలా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ ప్రకటన చేస్తారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర పార్టీ తరఫున మా స్టాండ్ మాదే కదా.. రాజధానిని తరలించడాన్ని తాము అంగీకరించేది లేదంటారు. అంతే కాదు.. రైతులకు న్యాయం చేయాల్సిందేనని చెబుతారు.ఇక అందరి కంటే ఇంపార్టెంట్ నేను చెప్పిందే అన్నట్టుగా జీవీఎల్ నరసింహారావు మాటలుంటాయని జనాలు అనుకుంటున్నారు. అసలు జీవీఎల్ చెబుతుంటే అచ్చంగా కేంద్రం నుంచి ఆ పార్టీ చెప్పిన విషయాల్లానే ఉంటాయని గుసగుసలాడుకుంటున్నారు. మరోపక్క, కేంద్రం నుంచి అసలు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం జరగలేదని, ఇక్కడ మాత్రం జనాలను కన్‌ఫ్యూజ్ చేయడానికి ఆ పార్టీ నాయకులు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారనే టాక్ ఉంది. ముఖ్యంగా సుజనా, రమేశ్ ముందు నుంచి కలసిమెలసి ఉంటున్నారు. కానీ, ఈ విషయంలో కాస్త భిన్నమైన వాదనలు వినిపించారు. ఈ మధ్యనే సీఎం రమేశ్ ఏపీ సీఎం జగన్‌ను కలుసుకున్నారు కూడా. దీనిపైన వివిధ రకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.ఏపీ బిజెపి నేతలు రాజధాని విషయంలో తలో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నది అయితే క్లియర్‌గా కనిపిస్తోందని అంటున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా రాష్ట్రంలో పార్టీ బలపడడం లేదు. నాయకులైతే చేరుతున్నారు గానీ.. కింది స్థాయిలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేవారు ఎవరూ లేరని అంటున్నారు. దీంతో ప్రస్తుతానికి రాజధాని అంశంతో రాష్ట్ర ప్రజల నోళ్లలో నానితే పార్టీని ముందుకు నడిపించ వచ్చనే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారట. అందుకే ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల వారిని కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నారట. అయినా ఈ విషయంలో పార్టీ తరఫున అధికారిక ప్రకటనలు ఏమున్నా కూడా కన్నా లక్ష్మీనారాయణే చెప్పాల్సి ఉంటుంది. అధ్యక్షుడిగా ఉన్న నాయకుడిదే పార్టీ పరమైన ప్రకటనగా గుర్తించాలని జనాలు అంటున్నారు. మరి కన్నా మాటలకు వాల్యూ ఉందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.