అనంత రైతులకు వేరుసెనగ కష్టాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనంత రైతులకు వేరుసెనగ కష్టాలు

అనంతపురం,  జనవరి 8, (way2newstv.com),
అనంతపురం జిల్లాలో వేరుశెనగ కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 రోజులుగా ఈ పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజుల వరకు కొనుగోలు చేయమని ఆయిల్‌ఫెడ్ అధికారులు, కేంద్రాల నిర్వహణాధికారులు రైతులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీంతో ఎప్పుడు కొనుగోలు చేస్తారా అని రైతులు ఎదురు చూస్తున్నారు. నిత్యం కరవు కోరల్లో చిక్కి శల్యమవుతున్న జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వేరుశెనగ పంట దిగుబడి బాగా వచ్చింది.  తొలుత గిట్టుబాటు ధర లేకపోయినా రైతులు ప్రైవేటు వ్యాపారులకు వేరుశెనగ కాయలు అమ్ముకున్నారు. తర్వాత వామపక్షాలు, రైతుల సంఘాల ఆందోళనతో నాఫెడ్ ఆదేశాలతో ఆయిల్‌ఫెడ్ ద్వారా డిసెంబర్ 4 నుంచి ప్రభుత్వం వేరుశనగ కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేసింది. 
అనంత రైతులకు వేరుసెనగ కష్టాలు

ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ కో ఆపరేటివ్ సొసైటీలకు బాధ్యతల్ని అప్పగించింది. వర్షాల కారణంగా హెక్టారుకు 20 నుంచి 25 బస్తాల వరకు పంట చేతికొచ్చింది. నవంబరులో రైతులు అనేక మంది పొలాల్లోనే యంత్రాల ద్వారా కాయల్ని సిద్ధం చేసి, దళారుల ద్వారా అమ్ముకున్నారు. క్వింటాలుకు రూ.2000 నుంచి రూ.2,300 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. జిల్లాలో కదిరి, ధర్మవరం, అనంతపురం, హిందూపురం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా తమిళనాడుకు చెందిన వ్యాపారులు వేరుశెనగ కాయలు కొన్నారు. తర్వాత ఆయిల్‌ఫెడ్ ద్వారా రూ.4,450 మద్దతు ధరతో సుమారు 80వేల క్వింటాళ్లను కేంద్రాల్లో కొనుగోలు చేశారు. వీటికి మొత్తం రూ.36 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. కానీ రూ.5 కోట్లు మాత్రమే ఆయిల్‌ఫెడ్ అధికారులు చెల్లించారు. మిగతా రూ.31 కోట్లు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. ముందుగా తెలిపిన ప్రకారం వేరుశెనగ కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల్లోపు రైతులకు నగదు ఇవ్వాల్సి ఉంది. కానీ 20 రోజులు దాటినా డబ్బు చేతిక రాక రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో 10,600 మంది వరకు రైతులు తమ పంట విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకుని టోకెన్‌లు తీసుకుని వేచి ఉన్నారు. ఒక్క అనంతపురం మార్కెట్ యార్డ్ పరిధిలోనే 600 మంది పైబడి రైతులు పేర్లు నమోదై ఉన్నాయి. కాగా 5వేల మంది రైతుల నుంచి మాత్రమే వేరుశెనగ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మిగతా వారంతా పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్న వేరుశెనగతో గోడౌన్లు నిండిపోవడంతో కొనుగోళ్లు నిలిపి వేశామని, మూడు జిల్లాల్లో గోడౌన్ల నుంచి వేరుశనగ రవాణాకు టెండర్లు పొందిన వ్యక్తి సకాలంలో వాటిని తరలించడంలో తీవ్ర జాప్యం చేయడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంకా లక్ష క్వింటాళ్ల మేరకు వేరుశెనగ కాయలు అమ్ముకోవడానికి రైతులు వేచి ఉండక తప్పలేదు. మరోవైపు నిల్వ ఉంచుకోవడానికి ఇబ్బందిగా ఉన్న రైతులు దళారుల ద్వారా వ్యాపారులకు అమ్మేస్తున్నారు. 42 కిలోల బస్తా కేవలం రూ.1300కే కొంటుండటంతో రైతులు నష్టపోతున్నారు. దీంతో దళారుల పంట పండుతోంది. అంతేకాకుండా చాలామంది రైతులు బళ్లారి, కర్నూలు జిల్లాల మార్కెట్ యార్డులకు తరలించి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. అలాగే కొనుగోలు చేసిన పంటకు డబ్బు కూడా సకాలంలో చెల్లిస్తే అప్పులు తీర్చుకుంటామంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించి కొనుగోలు కేంద్రాలను తిరిగి తెరిపించాల్సి ఉంది.