ఏపీ డీజీపీ రేసులో కొత్త ట్విస్ట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ డీజీపీ రేసులో కొత్త ట్విస్ట్

విజయవాడ, జూన్ 28 (way2newstv.com)   
ఒకటి, రెండు రోజుల్లో  ఏపీ కొత్త డీజీపీ నియామకం జరగనుంది. ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త డీజీపీ కోసం ప్రభుత్వం కసరత్తు చేసింది. సర్కార్ నలుగురితో సీనియారిటీ జాబితా తయారుచేసింది. పరిశీలనలో విజయవాడ సీపీ గౌతమ్‌సవాంగ్‌‌, ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. విజయవాడ సీపీ గౌతమ్‌ సవాంగ్‌కే డీజీపీ పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.రాష్ట్రానికి కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరు? ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే మాట! డీజీపీ మార్పు ప్రతి రెండేళ్లకొకసారి లేదా అప్పటి వరకూ ఉన్న అధికారి పదవీ విరమణతో మారేదే అయినా… ఎన్నికల ఏడాది కావడంతో ప్రతి ఒక్కరికీ కొత్త డీజీపీ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎప్పుడూ పోలీసు వర్గాల్లో మాత్రమే చర్చ జరిగే పోలీసుదళాల అధిపతి నియామకంపై ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఎక్కువ ఉత్కంఠ కలిగిస్తోంది. 
 
 
 
ఏపీ డీజీపీ రేసులో కొత్త ట్విస్ట్
 
ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య ఈ నెల 30వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు.అయినా ఇప్పటి వరకూ ప్రభుత్వం కొత్త పోలీస్ బాస్ పై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఉత్కంఠ మరింత ఎక్కువవుతోంది. అయితే, సీఎం చంద్రబాబు కొత్త డీజీపీ నియామకంపై కసరత్తు పూర్తిచేసి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్లో ఏడుగురు డీజీపీ స్థాయి అధికారులున్నా ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారు… ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌. ఈ ఇద్దరిదీ ఒకే బ్యాంచ్‌.రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అవినీతి ఎక్కువగా ఉందని జాతీయస్థాయిలో సర్వేలు వెల్లడించాయి. దీంతో అప్పటికే రాష్ట్ర శాంతిభద్రతల అడిషనల్‌ డీజీగా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆర్పీ ఠాకూర్‌కు డీజీపీగా పదోన్నతి ఇచ్చి ఏసీబీ డీజీగా నియమించారు. ఫలితంగా ఏడాదిన్నరలోనే రాష్ట్రంలో అవినీతి తగ్గింది. ప్రభుత్వశాఖల్లో కీలక స్థానాల్లో ఉంటూ వందల కోట్లు పోగేసిన అవినీతి డైనోసార్లను ఠాకూర్‌ బయటకు లాగారు. దీనికితోడు ఆదాయానికి మించిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా కొత్త చట్టం తీసుకొచ్చి విశాఖపట్నంలో గేదెల లక్ష్మీ గణేశ్వరరావు ఆస్తులను ప్రభుత్వపరం చేశారు.కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడ నగరానికి కొత్తరూపు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం… దీనిని ప్రశాంతంగా ఉంచే బాధ్యతల్ని గౌతమ్‌ సవాంగ్‌కు అప్పగించింది. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఎన్నికైన కొత్తలో సీఎం సొంత జిల్లా చిత్తూరు ఎస్పీగా సవాంగ్‌ పనిచేశారు. అప్పటి నుంచి చంద్రబాబుతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. చివరి నిమిషం వరకూ పోలీస్‌బాస్‌ ఎవరో వెల్లడించకుండా ఆఖర్లో ఇద్దరినీ పిలిపించి మాట్లాడి సవాంగ్‌ వైపే సీఎం మొగ్గు చూపుతారని తెలుస్తోంది. అవినీతి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే యజ్ఞాన్ని పూర్తి చేయాలని, ఇప్పట్లో మిమ్మల్ని అక్కడి నుంచి కదిపితే ఆ పని ఇతరులు పూర్తి చేయడం కష్టమవుతుందని ఠాకూర్‌కు సీఎం సూచించే అవకాశం ఉంది.చంద్రబాబు ప్రభుత్వం సీనియారిటీకే ప్రాధాన్యం ఇస్తోంది. మొదట జేవీ రాముడును డీజీపీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత సాంబశివరావుకు అవకాశం ఇచ్చింది. ఆయన కన్నా సీనియర్‌ అయిన ఎస్వీ రమణమూర్తి ఉన్నా కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నందున పరిగణనలోకి తీసుకోలేదు. సాంబశివరావు తర్వాత 1986 బ్యాచ్‌కు చెందిన ఆర్పీ ఠాకూర్‌, గౌతమ్‌ సవాంగ్‌లలో ఒకరిని నియమిస్తారని ప్రచారం జరిగినా ఆ ఇద్దరి కన్నా సీనియర్‌ అయిన మాలకొండయ్యను డీజీపీగా నియమించింది. తర్వాత సీనియారిటీలో 1986 బ్యాచ్‌కు చెందిన వీఎస్ కే కౌముది(కేంద్ర సర్వీసుల్లో), ఆర్పీ ఠాకూర్‌, వినయ్‌ రంజన్‌ రే(జైళ్లశాఖ డీజీ), గౌతమ్‌ సవాంగ్‌ ఉన్నారు. ఆ తర్వాతి బ్యాచ్‌ నుంచి ఎన్‌.వి.సురేంద్రబాబు(ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ), ఏ.ఆర్‌.అనురాధ(హోంశాఖ ముఖ్య కార్యదర్శి) మాత్రమే ఏపీలో డీజీపీ హోదాలో ఉన్నారు. రమణమూర్తి నుంచి ఏఆర్‌ అనురాధ వరకూ పోలీస్‌ బాస్‌ స్థానానికి అర్హులే అయినా అనారోగ్యంతో బాధపడుతోన్న రమణమూర్తి మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నారు.