1100 మంది దాటితే కొత్త పోలింగ్ కేంద్రమే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

1100 మంది దాటితే కొత్త పోలింగ్ కేంద్రమే

కడప, జూలై 24, (way2newstv.com)
జిల్లాలో కొత్తగా 112 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయిస్తూ ఆమేరకు జిల్లారెవెన్యూ యంత్రాంగం భారత ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఓటర్లసంఖ్య 1100 లకు మించి వుంటే మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం అధికారులు జిల్లాలో కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా ఒక పోలింగ్ కేంద్రంలో 1300 మంది ఓటర్లకు మించితే కొత్తపోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం ఇటీవల కలెక్టర్ అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలందరితో సమావేశం నిర్వహించారు. ప్రజలందరూ ఓటువేసేందుకు అనుకూలంగా ఉండాలనే హేతుబద్ద కారణాలతో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్చ జరిపారు. 
 
 
 
1100 మంది దాటితే కొత్త పోలింగ్ కేంద్రమే
 
జిల్లాలో కొన్ని పోలింగ్ కేంద్రాలు శివారుగ్రామాలకు దూరంగా ఉండి, ఆగ్రామప్రజలు రెండు మూడు కిలోమీటర్లు వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితివుంది. ఈ పరిధిని తగ్గించి ఓటరుకు అతి సమీపంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేస్తే వారికి పోలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉండటమే గాకుండా పోలింగ్‌శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇలా పోలింగ్ కేంద్రాలకు చాలా దూరంలో ఉన్న 9గ్రామాలను అధికారులు గుర్తించారు. ఈనేపధ్యంలోనే కొత్త పోలింగ్ కేంద్రాలకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 9,04,787 మంది పురుషులు, 9,30,117మంది మహిళలు ఉన్నారు. ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 2,598 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కొత్త ఓటర్ల జాబితాను సవరించి పోలింగ్ కేంద్రాల పరిధి పెంచేందుకు వీలుగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టిన నేపద్యంలో ఈ పోలింగ్ కేంద్రాల సంఖ్య 2,710కి చేరనున్నాయి. జిల్లా యంత్రాంగం పంపిన ప్రతిపాదనలు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదిస్తే ప్రతి 1100 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటుకానుంది. బద్వేలు పరిధిలో 269, రాజంపేట పరిధిలో 281, కడపలో 261, రైల్వేకోడూరులో 243, రాయచోటిలో 275, పులివెందులలో 292, కమలాపురంలో 246, జమ్మలమడుగులో 311, ప్రొద్దుటూరులో 280, మైదుకూరు నియోజకవర్గ పరిధిలో 269 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కొత్త ఓటర్ల చేరికపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం దృష్టిసారించగా దాదాపు లక్షమంది కొత్త ఓటర్ల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై అధికారులు పూర్తిస్థాయిలో దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. వీటిని స్క్రూృట్ని చేస్తే ఎంతవరకు అభ్యర్థుల దరఖాస్తులు పూర్తివివరాలు ఉన్నాయో తేలనుంది. ఏ ఎన్నికలు వచ్చినా అందుకుతగ్గట్టుగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితాను సిద్ధంగా ఉంచాలనే ప్రణాళికతో చర్యలు తీసుకుంటోంది.