సిక్కోలులో పంద్రాగస్టు వెనుక స్టోరీ.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిక్కోలులో పంద్రాగస్టు వెనుక స్టోరీ..

శ్రీకాకుళం, జూలై 24, (way2newstv.com)
సరిగ్గా 2004 సార్వత్రిక ఎన్నికల నాటి పరిస్థితులే ఉత్తరాంధ్రలో ఉన్నాయంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరాయి. అందులో టీడీపీ కంచుకోట, అధికారాన్ని అందిపుచ్చుకునేందుకు సెంటిమెంట్ జిల్లా శ్రీకాకుళంలో టీడీపీ జయాపజయాలు ఫిఫ్టీ-ఫిఫ్టీ కంటే బలహీనంగా ఉంటాయన్న సర్వేలు ఆ పార్టీ అధిష్ఠానానికి హైబీపీ తెప్పించింది. దీంతోనే ముఖ్యమంత్రి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. దీనికితోడు ఇటీవలే జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే తన పార్టీ బలాన్ని పెంచుకునేలా వ్యూహాన్ని రచించడం, శ్రీకాకుళం జిల్లా నుంచే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ప్రసంగాలను ప్రారంభించడంతో ముఖ్యమంత్రి ఆగస్టు 15 జెండా పండుగ శ్రీకాకుళంలో నిర్వహించేందుకు నిర్ణయించినట్టు సీఎంవో కార్యాలయ వర్గాలు చెప్పకనే చెబుతున్నాయి.ఉత్తరాంధ్రలో అధికార పార్టీ అపజయాలకు అద్దంపట్టే ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలు, వలసలు పెరిగిపోవడం, రైతాంగం సాగునీరులేక అల్లాడడం, నిరుద్యోగం, యువత నిరాశలో ఉండడం వంటివి టీడీపీకి పెనుగండంగా మారనున్నాయి. 
 
 
 
 సిక్కోలులో పంద్రాగస్టు వెనుక స్టోరీ..
 
రైల్వేజోన్ వస్తే ఉపాధి వచ్చేది, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ వస్తే పరిశ్రమలు వచ్చేవి... ఏవీ లేకపోవడంతో టీడీపీకి దెబ్బ తప్పదంటున్నారు. 2004లో కాంగ్రెస్‌కి ఈ జిల్లాలు ఇరవైకి పైగా అసెంబ్లీ సీట్లు ఇచ్చి పీఠం మీద కూర్చొపెట్టిన సీన్ రీపీట్ అవ్వడం ఖాయమంటూ రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సైకిల్‌కి ఎక్కడిక్కడ పంచర్లు పడ్డాయి... శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖపట్నం వరకూ అంతా రిపేర్లే అంటూ హెచ్చరికలను బాబు ప్రైవేటు సర్వేలు చెబుతునే ఉన్నాయి. అధికార పార్టీ నాలుగేళ్ళ పాలన వ్యతిరేకతను బాగా పోగేసింది. చెప్పిన మాటలూ, ఇచ్చిన హామీలు ఈ జిల్లాల్లో సకాలంలో నెరవేర్చకపోవడంతో తిరుగుబాటు మొదలైందంటున్నారు. బీసీలు, పేదలు ఎక్కువగా ఉన్న చోటనే అధికార పార్టీకి ప్రమాదఘంటికలు అంటూ రాజకీయ ప్రైవేట్ సర్వేలు సుస్పష్టంగా చెబుతున్నాయి. అందుకే, గత ఎన్నికల్లో లెక్కే మారుతుందన్న అనుమానాలు బాబులో కన్పిస్తున్నాయంటూ ఆ పార్టీ కార్యకర్తలే బాహాటంగా చెప్పుకొస్తున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో మిత్రపక్షం బీజేపీ ఒక సీటు కూడా కలుపుకుని పాతిక ఎమ్మెల్యేలను టీడీపీ ఖాతాలోకి చేరాయి. అలాగే, ఐదు ఎంపీ సీట్లులో నాలుగు సునాయాసంగా గెలుచుకుని, వైసీపీ నుంచి అరుకు ఎంపీ గీతను లాగేసి ఐదు ఎంపీలుగా తనవేనని టీడీపీ చెప్పింది. అలాగే, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుని మొత్తంగా 29 ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర టీడీపీ బలంగా పేర్కొంది. అంటే, రానున్న సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ ఉత్తరాంధ్రలో బలంగా ఉండాలి. కానీ, ఆ పరిస్థితులు కన్పించడం లేదంటున్నారు. ఈసారి ఉత్తరాంధ్రలో టీడీపీ భారీ షాక్ తగిలేలా ఉందని, పోయిన ఎన్నికల్లో ఎనభైశాతం పైగా సీట్లును గెలుచుకున్న టీడీపీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాపు, వెలమ, కళింగ వంటి బీసీలు బాగా ఉన్న ఈ జిల్లాల్లో టీడీపీ అంటే ముఖంచాటేసుకునేలా మారారు.
బాబు ముఖ్యమంత్రి కావడానికి మద్దతు ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడు ఓటు మారిస్తేగాని మా రాత మారదన్న నిశ్చయానికి వచ్చారు. ఇక్కడ ఐదుగురు మంత్రులు ఉన్నారు. అందరూ సీనియర్లు.. గండర గండర్లే! కానీ, తాజా రాజకీయ వాతావరణం మాత్రం వీరంతా డేంజర్ జోన్‌లో ఉన్నారంటూ సంకేతాలు వెలుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి ఓడిపోయేది ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఇంధన శాఖ మంత్రి అని ఇంటెలిజెన్స్ నివేదికలు సుస్పష్టం చేస్తున్నాయి. సొంతపార్టీలోనే గ్రూపులను ప్రోత్సహిస్తూన్న కళా పనితీరు కూడా ఆయన ఓటమి అంచున నిలబెట్టాయని అంటున్నారు. ఇక మరో మంత్రి అచ్చెన్నాయుడు పెద్దగళాన్ని విస్తారంగా విప్పేసి విపక్షాలపై విరుచుకుపడే నైజం ఆయనను రాష్ట్రంలోనే ఇమేజ్ పెంచింది. కానీ, టెక్కలి ఓటర్లు ఆయనను వ్యతిరేకిస్తున్నారన్న వాస్తవం ఇప్పుడిప్పుడే బయటపడుతుందంటున్నారు. ఈయనకు సరైన ప్రత్యర్థిని వైసీపీ వెతుకుతోంది. మాజీ కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి వంటి నేత అచ్చెన్నపై పోటీకి దిగితే ఆయన గెలుపు కూడా కష్టమేనంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు బాబువద్దకు చేరాయి.విజయనగరం జిల్లాలో ఫిరాయింపు మంత్రి సుజయకృష్ణరంగారావుకి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆ జిల్లా అంతటా వైసీపీ స్వీప్‌గా విజయాన్ని సాధిస్తుందన్న సంకేతాలైతే ప్రజల నుంచి వున్నాయి. ఇక్కడ మంత్రి ఫిరాయింపే ఆయనకు పెద్ద మైనస్. విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మంత్రుల తీరూ అలాగే ఉంది. అయ్యన్నపాత్రుడు మళ్ళీ గెలిచే అవకాశాలు లేవన్నది సుస్పష్టం. అందుకే, ఆయన బరిలోకి దిగరన్నది పబ్లిక్ టాక్. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల కాలంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన భీమిలి అసెంబ్లీలో విజయం దక్కదన్నది సర్వేలు తేల్చిచెప్పేశాయి. ఇలా... ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఐదుగురు మంత్రులకూ విజయం తథ్యమన్న ధీమా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల సీట్లు ఎన్ని గెలుస్తామన్న అంచనాల్లో బాబు మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో పంద్రాగస్టు పండుగ వేదికగా శ్రీకాకుళాన్ని ఎంచుకుని ముఖ్యమంత్రి ఇక్కడ నుంచే ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ విజయానికి కావల్సిన రిపేర్లు చేసేందుకు కసరత్తు ప్రారంభిస్తారన్నది సీఎంవో కార్యాలయం నుంచి అందిన సమాచారం