ఖరీఫ్ పై చిగురిస్తున్న ఆశలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఖరీఫ్ పై చిగురిస్తున్న ఆశలు

రంగారెడ్డి, జూలై 14, (way2newstv.com)
 ఖరీఫ్‌పై రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. రైతుల కు సాగు పెట్టుబడి కోసం రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఎకరాకు నాలుగు వేల చొప్పున అందచేయడంతో ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతుకు వరుణుడు ప్రస్తుతం సహకరిస్తుండడంతో రైతులు ఖరీఫ్ పనులు మరింత ముమ్మురం చేయనున్నారు. జూన్ ప్రారంభంలో కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులకు జూన్ 15 నుంచి వరుణుడు కరుణించక పోవడంతో పాటు మండు వేసవిని తలపించేలా సూర్య ప్రతాపంతో పంటలు ఎండుముఖం పట్టడంతో ఖరీఫ్‌పై పెట్టుకున్న ఆశలు సన్నగిల్లాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతన్నలో ఖరీఫ్‌పై ఆశలు మరోసారి చిగురించడంతో వ్యవసాయ పనులలో బిజిబిజిగా మారారు. 
 
 
 
ఖరీఫ్ పై చిగురిస్తున్న ఆశలు
 
రంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.64 లక్షల హెక్టార్లు  అయిన జూన్‌లో వరుణుడు సహకరించకపోవడంతో ఇప్పటివరకు కేవలం 10% సాగు మాత్రమే జరిగింది. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు వరి 424 హెక్టార్‌లు, జొన్న 444 హెక్టార్‌లు, మొక్క జొన్న 1078 హెక్టార్‌లు, కంది 212 హెక్టార్‌లు, అముదం 50 హెక్టార్‌లు, పత్తి 14,480 హెక్టార్‌లు, కూరగాయలు 50 హెక్టార్‌ల విస్తీర్ణంలో సాగు చేశారు. గత మూడు రోజులుగా కురుసున్న వర్షాలతో రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 15 వరకు పత్తి సాగు చేసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు సూచించడంతో మెజార్టీ రైతులు పత్తి సాగుకు సిద్ధమవుతుండడంతో సాధారణ విస్తీర్ణం 60,417 హెక్టార్‌ల కన్నా ఎక్కువ పత్తి సాగులోకి రానుంది. నగర శివారు మండలాల రైతులు మాత్రం కూరగాయల సాగు చేయడానికి విత్తనాలు వేస్తున్నారు. సకాలంలో వర్షం కురవక పోవడంతో సాగు చేయవలసిన పంటలపై అధికారులు రైతులకు    అవగాహన కల్పించవలసిన అవసరం చాలా వరకు ఉంది. కురుస్తున్న వర్షాలు:  జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్‌లో సాదారణ వర్షపాతం 91.7 మి.మికి గాను 86.4 మి.మి నమోదు కావడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. జూలైలో సారణ వర్షపాతం 152.8 మి.మి కాగా ఇప్పటివరకు 10 మిమి వర్షపాతం నమోదయింది.  జిల్లాలోని అన్ని మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో వ్యవసాయ పనులు ముమ్మురం అవుతున్నాయి. గత రెండు రోజులుగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో ఎక్కడ చూసిన రైతులు వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు. ఎరువులు, విత్తనాలను ఇప్పటికే సిద్దం చేసుకున్న రైతులు ప్రస్తుతం పూర్తి స్థాయి పనులకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ అధికారులు సైతం రైతులకు అందుబాటులో ఉంటు వారికి కావలసిన సలహాలు, సూచనలు అందచేయడానికి సిద్ధంగా ఉన్నారని వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు తెలిపారు.