కౌలు రైతులకు చేదు అనుభవమే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కౌలు రైతులకు చేదు అనుభవమే

ఒంగోలు, జూలై 6, (way2newstv.com)
ఎన్నో కష్టాలకోర్చి గతేడాది పంటలు సాగు చేసిన కౌలు రైతులకు చేదు అనుభవమే ఎదురైంది. పెట్టిన పెట్టుబడి ఖర్చూ కూడా తిరిగి రాలేదు. కనీస మద్దతు ధర అమలు కాకపోగా.. ఇంకా తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది సాగు చేసేందుకు కౌలుదారులు ముందుకు రావట్లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. చివరకు కృష్ణా, గుంటూరు, సాగర్, గోదావరి డెల్టాల కింద కూడా పంటల సాగుకు కౌలురైతులు ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది. రెండు, మూడు పంటలు పండే పొలాల సాగుకూ కౌలుదారులు ధైర్యం చేయలేకపోతున్నారు. గతేడాది మిగిల్చిన చేదు అనుభవాలే వారిని సాగుకు ససేమిరా అనేలా చేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో కౌలు ధరలు 25 శాతం నుంచి 40 శాతం వరకు పడిపోయాయని భూయజమానులు ఆందోళన చెందుతున్నారు.బ్యాంకుల్లో తిరిగి రుణం పుట్టకపోవడంతో రైతులు మరింతగా అప్పుల పాలయ్యారు.
 
 
 
 కౌలు రైతులకు చేదు అనుభవమే
 
 బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో పడిపోయారు. దీనికితోడు విత్తనాల నుంచి ఎరువులు, పురుగుమందుల వరకు ధరలు పెరిగిపోయి సాగు వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోగా.. కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలూ లభించక రైతులు అప్పుల పాలై ఉసురు తీసుకుంటున్న దైన్య స్థితి నెలకొని ఉంది. రైతుల పరిస్థితి ఇలా ఉంటే.. కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది.జూన్‌ నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమవుతుంది. పలుచోట్ల దుక్కులు దున్నేందుకు అనువుగా పదునైనప్పటికీ కాడి కట్టలేదు, సాలు దున్నలేదు. సాధారణంగా ఉగాది ముగియగానే కౌలు ఒప్పందాలు జరుగుతాయి. తొలకరి జల్లులు కురిసేనాటికి పత్తి, మిరపలాంటి ఎండుకట్టె తొలగించి తొలి దుక్కులకు పొలాలను సిద్ధంగా ఉంచడం ఆనవాయితీ. వాతావరణ పరిస్థితులను బట్టి ఖరీఫ్‌ సాగు ఆరంభమవుతుంది. కానీ, ఈ దఫా కృష్ణా, గోదావరి డెల్టాల్లో సైతం కౌలుకు భూములు తీసుకుని సాగు చేయడానికి రైతులు ముందుకు రావట్లేదు. కనీసం అడిగేవారు లేరు. దీంతో కౌలుధరలు అమాంతం పడిపోయాయి. సాధారణంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగునీటి వసతి కలిగి వాణిజ్య పంటలైన పత్తి, మిరప పండే భూములకు ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.18 నుంచి రూ.37 వేల వరకు కౌలు ధరలు పలుకుతాయి. వరి తరువాత మినుము, సెనగ, పెసర, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగయ్యే భూములకు ఎకరానికి రూ.12 నుంచి రూ.18 వేల వరకు కౌలు ఉంటోంది. ఇప్పుడీ కౌలు ధరలు బాగా తగ్గిపోయాయి. గుంటూరు జిల్లా విప్పర్ల గ్రామంలో ఎకరం రూ.19 వేల నుంచి 20 వేల వరకు కౌలు ఉండేది.ఈ ఏడాది రూ.10 నుంచి రూ.12 వేలకు మించి తీసుకునేందుకు ముందుకు రావట్లేదు.. రైతు, కౌలుదారు కూడా అయిన కె.సీతయ్య మాట్లాడుతూ గతేడాది రూ.18 వేలు చెల్లించానని, ఈ ఏడాది రూ.10 వేలకు కొన్ని ఎకరాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. కౌలు ఎలాఉన్నా ముందుగా సాగు చేయాలని రైతులు కోరుతున్నారన్నారు. వట్టిచెరుకూరు మండలం పల్లపాడులో ఈ ఏడాది మే, జూన్‌ రెండో వారం వరకు నీటి వసతి కలిగిన, ముంపునకు వీల్లేని మిరప పండే భూములను ఎంపిక చేసుకుని ఎకరానికి రూ.34 వేల నుంచి రూ.36 వేల వరకు కౌలుకు తీసుకున్నారు. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నా అడిగేవారు కరువవుతున్నారని కొర్రపాటి రామకృష్ణ అనే యువరైతు చెప్పారు.ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, చీమకుర్తి తదితర మండలాల్లో గతంలో రూ.5,000 నుంచి పదివేల వరకు కౌలు ఉండేదని, ఇప్పుడు రెండు, మూడు వేలకు కూడా ఎవరూ అడగట్లేదని బండ్లమూడికి చెందిన ఎం.వెంకారెడ్డి చెప్పారు. గతేడాది ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్న రైతులు అసలు సాగు చేయకుండా అలాగే బీడుగా వదిలేశారని, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎవరూ భూమిని అడగట్లేదన్నారు. గోదావరి డెల్టాలో ఇంతకన్నా దారుణ పరిస్థితులున్నాయి. సార్వా, దాళ్వాలో ఎకరానికి 70 నుంచి 80 బస్తాల దిగుబడి వచ్చే భూములను తీసుకోవడానికీ కౌలుదారులు ముందుకు రావట్లేదు. సార్వాలో 15 బస్తాలను పది బస్తాలకు తగ్గించినా స్పందన రావట్లేదని రైతు  నేత త్రినాథ్‌రెడ్డి చెప్పారు. ఎకరానికి అయిదారు బస్తాల మేర కౌలును రైతులు తగ్గిస్తున్నారన్నారు. నీటివసతి ఉండి, అరటి సాగయ్యే, ఆదాయంపై నమ్మకమున్న వైఎస్సార్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కౌలుకు కాసింత డిమాండ్‌ కొనసాగుతోంది. కాగా,  వాణిజ్య పంటలు అయిన పత్తి, మిరప దిగుబడి బాగా వచ్చే పొలాలను మాత్రం ఎంపిక చేసుకుని మరీ తక్కువ కౌలుకు ఇచ్చేట్లయితే సాగు చేస్తామని రాష్ట్రంలో అక్కడక్కడా ముందుకు వస్తున్నారని భూయజమానులు చెపుతున్నారు.