విజయ్ మాల్యా ఆస్తులు వేలమే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విజయ్ మాల్యా ఆస్తులు వేలమే

ముంబై జూలై 6, (way2newstv.com) 
బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో జల్సాలు చేస్తున్న విజయ్‌ మాల్యాకు భారీ షాక్.. మాల్యాకు చెందిన ఆస్తులను జప్తు చేయడానికి లండన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లండన్‌కు సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌ షైర్‌లో మాల్యాకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా లేడి వాక్‌, బ్రాంబుల్‌ లాడ్జ్‌, టెవిన్‌, క్వీన్‌ హూ లేన్‌లతో పాటు వెల్విన్‌లోని మాల్యా ఇళ్లలో సోదాలు నిర్వహించడానికి అధికారులకు అనుమతులు ఇచ్చింది. అంతర్జాతీయంగా భారత్ తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే లండన్ కోర్టు తాజా చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం మాల్యాను ఇటీవలే పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు’గా ప్రకటించిన విషయం తెలిసిందే.
 
 
 
 విజయ్ మాల్యా ఆస్తులు వేలమే
 
 ఈ కారణంగానే కోర్టు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాల్యా విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తున్నామని న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం. విజయ్‌ మాల్యాకు దాదాపు 159 చోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరు పోలీసులు ఈడీతో కలిసి దీనికి సంబంధించిన నివేదికలను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు సమర్పించారు. మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు సమయం కావాల్సిందిగా ధర్మాసనాన్ని కోరారు. మరోవైపు.. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల కోసం ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ఆగస్టు 27 లోగా విజయ్ మాల్యా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. మాల్యా మోసంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోని బ్యాంకులతో పాటు 13 బ్యాంకుల నెత్తిన పిడుగు పడింది. మొత్తం రూ.9000 కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి అతడు విదేశాలకు పారిపోయాడు.