నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, జూలై 24 (way2newstv.com)   
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దాలని, కాలనీలు స్వయం సమృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముందుగా నిర్వాసితుల జీవనస్థితిగతులు, వ్యక్తిగత సమాచారంపై అధ్యయనం జరపాలని సూచించారు. మొత్తం 74 కాలనీలకు అవసరమైతే ప్రత్యేకంగా ఐటీడీఏను ఏర్పాటు చేస్తామని, పునరావాసం-పరిహారం కింద మరింత సాయానికి సిద్ధంగా వున్నామని చెప్పారు. లక్ష కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం, మౌలిక వసతులు కల్పించడం కూడా తమదే బాధ్యతని అన్నారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై 68వ సారి ముఖ్యమంత్రి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటివరకు మొత్తం 56.69% పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే తవ్వకం పనులు 76.30%, కాంక్రీట్ పనులు 30.70% చేపట్టినట్టు తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 62.27% నిర్మాణం పూర్తయ్యిందని, అలాగే రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.55%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 93% చేపట్టినట్టు వెల్లడించారు. 
 
 
 
నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ
పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష
 
గత వారం స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్ తవ్వకం పనులు 1.75 లక్షల క్యూబిక్ మీటర్ల మేర చేపట్టగా, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు 23 వేల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.
పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 851.75 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్కు సంబంధించి మొత్తం 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 11.30 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 11,080 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి. మొత్తం 45 డిజైన్లకు గాను 14 డిజైన్లు కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం పొందగా, మరో 22 పెండింగ్ వున్నాయి. మరో 9 డిజైన్లు ఏజెన్సీల దగ్గర నిలిచివున్నాయని అధికారులు చెప్పగా, ఎప్పటికప్పుడు ఆమోదం పొందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. 
ఇప్పటివరకు సందర్శకుల సంఖ్య 50,000 లకు దాటిందని, పోలవరం సందర్శనకు వచ్చే వారి సంఖ్య ఇంకా అనూహ్యంగా పెరుగుతోంది అని అధికారులు ముఖ్యమంత్రి కి తెలియజేశారు.. ఈవారం 5,709 మంది వివిధ జిల్లాల నుంచి పోలవరం ప్రాజెక్టును సందర్శించారని, ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టును చూసిన వారి సంఖ్య 50 వేలు దాటిందని తెలిపారు.. మూడు నెలల్లో రైతులు, విద్యార్ధులతో సహా 50,878 మంది ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు...