కెప్టెన్ వర్సెస్ ఈటెల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కెప్టెన్ వర్సెస్ ఈటెల

కరీంనగర్, జూలై 2, (way2newstv.com)
తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు కీల‌క నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు రోజురోజుకూ ముదురుతోంది. వారిద్దరూ సీఎం కేసీఆర్‌కు స‌న్నిహితులే. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టుకోసం ఇద్దరు నేత‌లు ఎవ‌రికివారుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. దీంతో పార్టీ క్యాడ‌ర్‌లో గంద‌ర‌గోళం ఏర్పడింది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఈ ప‌రిణామాలు పార్టీకి తీవ్ర న‌ష్టాన్ని క‌లిగించేలా ఉన్నాయి. అయితే ఈ విష‌యం.. కాస్తా సీఎం కేసీఆర్ దాకా వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. వారికి స‌ర్దిచెప్పడం గులాబీ బాస్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరు నేత‌ల వ్యవ‌హారం అటు ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లా, వ‌రంగ‌ల్ జిల్లాలో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది.ఆ ఇద్దరు కీల‌క నేత‌లు ఎవ‌రంటే.. ఒక‌రేమో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. ఈయ‌న ప్రస్తుతం హుజురాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మ‌రొక‌రు.. రాజ్యస‌భ స‌భ్యుడు కెప్టెన్ ల‌క్ష్మీకాంతారావు. అయితే వీరిద్దరూ సీఎం కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితులు కావ‌డం గ‌మ‌నార్హం. 
 
 
 
కెప్టెన్ వర్సెస్ ఈటెల
 
కెప్టెన్ త‌న‌యుడు వొడిత‌ల స‌తీశ్ ప్రస్తుతం ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. ఆయ‌న స‌తీమ‌ణి ఎంపీపీగా ఉన్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రి ఈట‌ల క‌రీంన‌గ‌ర్ ఎంపీగా బ‌రిలోకి దిగుతార‌నే టాక్ వినిస్తోంది.ఈ క్రమంలోనే హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టుకోసం కెప్టెన్‌ చాక‌చ‌క్యంగా పావులు క‌దుపుతున్నట్లు స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న స‌తీమ‌ణిని హుజురాబాద్ నుంచి బ‌రిలోకి దించాల‌ని ప్రయ‌త్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే.. హుజురాబాద్, జ‌మ్మికుంట వ్యవ‌సాయ‌మార్కెట్ల చైర్మన్ల ప‌ద‌వుల‌ను త‌న అనుచ‌రుల‌కు ఇప్పించుకునేందుకు ఆయ‌న ముమ్మరంగా ప్రయ‌త్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కెప్టెన్ ఇలా వ్యవ‌హ‌రించ‌డంపై మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కెప్టెన్‌పై ర‌గిలిపోతున్నారు.ఇదిలా ఉండ‌గా.. ఈట‌ల కూడా త‌న స‌తీమ‌ణిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేయించాల‌ని ప్రయ‌త్నం చేస్తున్నార‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో మంత్రి ఈట‌ల‌, కెప్టెన్ మ‌ధ్య విభేదాలు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో కెప్టెన్‌కు ద‌గ్గర‌వుతునే నాయ‌కులు, కార్యక‌ర్తల‌ను ఈట‌ల దూరంగా ఉంచుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇక చైర్మన్ ప‌ద‌వుల విష‌యంలోనూ ఈట‌ల గ‌ట్టిగానే ఉన్నార‌నీ, త‌న వ‌ర్గానికి చెందిన వారికే ప‌ద‌వులు ఇప్పించుకోవ‌డానికి ప‌ట్టుద‌ల‌తో ఉన్నట్లు ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.ఈ క్రమంలో ఈట‌ల‌, కెప్టెన్ ప‌ర‌స్పరం గులాబీ బాస్ వ‌ద్ద ఫిర్యాదు చేసుకున్నట్లు కూడా ప్రచారం జ‌రుగుతోంది. ఈట‌ల త‌న‌కు త‌మ్ముడి లాంటి వాడ‌ని అనేక‌మార్లు కేసీఆర్ చెప్పారు. ఇదే స‌మ‌యంలో వ‌రంగ‌ల్‌కు కేసీఆర్ వ‌స్తే.. కెప్టెన్ ఇంటికి వెళ్లి క‌లిసి వ‌స్తారు. మ‌రి త‌న‌కు అత్యంత స‌న్నిహితులు అయిన ఈ ఇద్దరి మ‌ధ్య జ‌రుగుతోన్న కోల్డ్‌వార్‌కు కేసీఆర్ ఎలా చెక్ పెడ‌తారో ? చూడాలి. ఎన్నిక‌లు సమీపిస్తోన్న వేళ ఈ వార్‌కు చెక్ పెట్టక‌పోతే పార్టీకి న‌ష్టం అన్నది మాత్రం క‌రీంన‌గ‌ర్ జిల్లాలో వినిపిస్తోన్న మాట‌.