సైబర్ క్రిమినల్స్ తో జరా భద్రం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సైబర్ క్రిమినల్స్ తో జరా భద్రం

హైద్రాబాద్, జూలై 11, (way2newstv.com)
సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు.. స్టాక్ ట్రేడింగ్ ఖాతాదారులను టార్గెట్ చేస్తున్నారు. భారీ మోసాలకు షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. పలు వెబ్‌సైట్‌లు, ఏజెంట్‌ల నుంచి డీమ్యాట్ ఖాతాదారుల ఫోన్ నంబర్‌లను కోనుగోలు చేసి, వారిని మోసం చేస్తున్నారు. కొనుగోలు చేసిన ఫోన్ నంబర్ల ఆధారంగా ఖాతాదారులకు లాభాల గ్యారెంటీ హామీపడుతూ సందేశాలు పంపిస్తున్నారు. వారిని నమ్మించేందుకు మొదటి దశలో స్వల్ప నగదును డిపాజిట్ చేయించుకొని వారంలో దానికి 120 శాతం ఎక్కువగా వారి ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ ఒక్క లావాదేవితో చాలా మంది డీమ్యాట్ ఖాతాదారులను సైబర్ క్రిమినల్స్ తమ ఉచ్చులోకి దించుతున్నారు. ఇంకొందరు లాభాలను అంకెల్లో చూపిస్తూ మాయచేస్తున్నారు. ఖాతాదారుడికి ప్రత్యేక అప్లికేషన్‌ను ఇచ్చి రోజు వారి పెట్టుబడి మీద జరిగే లావాదేవిలను అప్లికేషన్‌లో మార్చి చూపిస్తున్నారు. ఆ అంకెల ప్రాఫిట్‌లను చూసుకుని మురిసిపోవడం ఖాతాదారుల వంతవుతున్నది. 
 
 
 
సైబర్ క్రిమినల్స్ తో జరా భద్రం 
 
సాధారణంగా డీమ్యాట్ ఖాతాదారులు తక్కువ కాలంలో భారీగా లాభాలు సంపాదించాలనే ఆశతో ఉంటారని సైబర్ క్రిమినల్స్ నమ్మకం. ఇదే సైబర్ క్రిమినల్స్‌కి కలిసొచ్చిన విషయం. ఆశావాహులను 5 నిమిషాల్లో తమ బుట్టలో వేసుకుని వారి నుంచి లక్షలు కొట్టేస్తున్నారు. స్టాక్ ట్రేడింగ్ ఖాతాదారులను బురిడి కొట్టించడం చాలా ఈజీ అని ఇటీవల పట్టుబడ్డ సైబర్ మాయగాళ్లు పోలీసు విచారణలో చెప్పడ గమనార్హం. డార్క్‌నెట్‌తో పాటు పలు ఎజెన్సీలు, బ్రోకర్లు డిమ్యాట్ ఖాతాదారుల ఫోన్ నెంబర్లు విక్రయిస్తుండడం సైబర్ క్రిమినల్స్‌కి కలిసి వస్తున్నది. ఇలా లక్షలాది ఫోన్ నంబర్లను కోనుగోలు చేసుకుని తమ మోసపూరిత వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. కంపెనీ చరిత్ర, మార్కెట్‌లో ఆ కంపెని బ్రాండ్, ఉత్పత్తుల డిమాండ్ తదితర అంశాలను లోతుగా విశ్లేషించి ఆ కంపెనీ లాభనష్టాలను అంచనా వేసి స్టాక్ ట్రేడింగ్ పెట్టుబడులలో రాణించే వారు సైతం సైబర్ మాయగాళ్ల మాటలకు బోల్తాపడుతుండడం విస్మయానికి గురిచేస్తున్నది. సైబర్ క్రిమినల్స్ లక్షలు కాజేసేందుకు వారు పెడుతున్న పెట్టుబడి ఎంతో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. ఒక్కో నంబర్‌కు ఒక్క రూపాయి నుంచి మూడు రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ఈ నెంబర్లను వేరు వేరు వెబ్‌సైట్‌ల నుంచి కోనుగోలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బ్రోకర్ల నుంచి ఖాతాదారుల నెంబర్లను కొంటున్నారు. ఇలా లక్షలాది ఫోన్ నంబర్లను సేకరిస్తున్న ఆన్‌లైన్ చీటర్లు ఖాతాదారులను బురిడి కొట్టిస్తున్నారు. ఈ ఫోన్ నంబర్లను సేకరించిన సైబర్ నేరస్థులు ముందుగా డిమ్యాట్ ఖాతాదారులను నమ్మించేందుకు ప్రయత్నిస్తారు. తరువాత లాభాల వల విసురుతారు.సూరత్‌కు చెందిన షానవాజ్ అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ లఖానీ ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గత నెల అరెస్టు చేశారు. ఆ ముఠా దేశవ్యాప్తంగా గత నాలుగేండ్లుగా 120 మంది కార్పొరేట్ ఖాతాదారుల నుంచి 5 కోట్ల రుపాయాలను దోచేసింది.