కశ్మీర్ పీఠంపై హిందూ ముఖ్యమంత్రి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కశ్మీర్ పీఠంపై హిందూ ముఖ్యమంత్రి

శ్రీనగర్, జూలై 13(way2newstv.com) 
బీజేపీ కశ్మీర్ ను చేజిక్కించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే త్వరలోనే కశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కశ్మీర్ పీఠంపై తొలిసారిగా హిందూ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టాలని కమలనాధులు నిర్ణయించేశారు.ఈ మేరకు చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే లోపే కశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కొందరు చెబుతుండగా, అమర్ నాధ్ యాత్ర ముగిసిన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశముందనది మరికొందరు అంటున్నారు.కాని ఈసారి ట్రెండ్ మార్చాలన్నది కమలనాధుల ఉద్దేశం. అందుకోసమే బీజేపీ సారథ్యంలో ఇతర పార్టీలతో కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ పట్టుదలగా ఉన్నారు. నిన్న బీజేపీ కాశ్మీర్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి రామ్ మాధవ్, సీనియర్ బీజేపీ నేత నిర్మల్ సింగ్ తో ప్రధాని ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. 
 
 
 
 కశ్మీర్ పీఠంపై  హిందూ ముఖ్యమంత్రి
 
ఈ భేటీలో ఎలాగైనా కశ్మీర్ లో అతి త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మోదీ వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా, నిర్ణయాలు నిర్భయంగా తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కూడా ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది.మొత్తం 87 మంది సభ్యులున్న కశ్మీర్ లో బీజేపీకి కేవలం 25 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 44 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే దాదాపు 19 మంది సభ్యులు బయట పార్టీల నుంచి రావాల్సి ఉంటుందన్నమాట. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ లో అసమ్మతిని క్యాష్ చేసుకునే పనిలో కమలనాధులున్నారు. పీడీపీకి మొత్తం 28 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఇందులో దాదాపు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు మెహబూబా ముఫ్తీపై అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ మద్దతు ఉండనే ఉంది. దీంతో ఎక్కువ సంఖ్యలో పీడీపీ నుంచే బీజేపీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారని భావిస్తున్నారు. మొత్తం మీద కశ్మీర్ లోయలో కొత్త ట్రెండ్ ను సృష్టించాలనుకుంటున్న కమలనాధులు ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాల్సి ఉంది. పీడీపీకి మద్దతు ఉప సంహరించడంతో కశ్మీర్ లో ఉన్న ప్రభుత్వం కుప్పకూలింది. ప్రస్తుతం అక్కడ గవర్నర్ పాలన నడుస్తోంది. కశ్మీర్ లోయలో పరిస్థితులను చక్కదిద్దాలంటే హిందూ సీఎం అవసరమని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి కూడా అదేకోరారు. ఇప్పటి వరకూ కశ్మీర్ చరిత్రలో హిందూ వ్యక్తి ముఖ్యమంత్రిగా లేరు. ఏ పార్టీనెగ్గినాఅక్కడ సీఎం ముస్లిం వర్గానికి చెందిన వారే ఉంటూ వస్తున్నారు. అది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. నెహ్రూ హయాం నుంచే ఈ ట్రెడిషన్ ను ఫాలో అవుతూ వస్తున్నారు.