న్యూఢిల్లీ, జూలై 2, (way2newstv.com)
త్వరలో జరగనున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికపై బీజేపీ దృష్టి సారించింది. ఎగువ సభలో బీజేపీ పెద్ద పార్టీయే అయినా, డిప్యూటీ ఛైర్మన్‌ను గెలిపించుకోడానికి అవసరమైనంత మెజార్టీ మాత్రం లేదు. దీంతో తన మిత్రపక్షం అభ్యర్థిని రంగంలోకి దింపాలని కాషాయదళం యోచిస్తోంది. రాజ్యసభ ఉపాధ్యాక్షుడు పీజే కురియన్ పదవీ కాలం ముగియడంతో ఎన్డీఏ అభ్యర్థిని రంగంలోకి దించి ఆ స్థానాన్ని దక్కించుకోకోవాలని పావులు కదుపుతోంది. తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో ఎన్డీయే తరఫున శిరోమణి అకాలీదళ్‌కు చెందిన నరేష్ గుజ్రాల్ పేరును ఖరారుచేసినట్టు సమాచారం. మిత్ర పక్షానికి చెందిన అభ్యర్థిని పోటీలో నిలిపితే, ఇతర పార్టీల మద్దతు కూడా ఉంటుందనే వ్యూహంతో నరేష్ గుజ్రాల్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
డిప్యూటీ ఛైర్మన్ గా నరేష్ గుజ్రాల్...?
ఎందుకంటే ఆయన మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ తనయుడు కాబట్టి విపక్షాలు కూడా సానుకూలంగా ఉంటాయని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. 1948, మే 19న జలంధర్ లో జన్మించిన నరేష్ గుజ్రాల్, పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు పీజే కురియన్ పదవీ కాలం జులై 1 తో ముగియడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విందును ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సమావేశానికి రాజ్యసభలోని వివిధ పార్టీలకు చెందిన నేతలను వెంకయ్య ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... డిప్యూటీ ఛైర్మన్ ఎంపికలో అధికార, విపక్షాలు కలిసి కురియన్ లాంటి సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికే మొగ్గుచూపుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎగువ సభ డిప్యూటీ చైర్మన్‌గా మాజీ ప్రధాని తనయుడు గుజ్రాల్ పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. అలాగే తటస్థంగా ఉన్న బీజేడీ లాంటి ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. అయితే, కాంగ్రెస్ కూడా యూపీఏ అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం యూపీఏ మిత్రపక్షాలతోపాటు మిగతా పార్టీలను సంప్రదించి ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాలని యోచిస్తోంది. అందులో భాగాంగానే తృణమూల్ పార్టీకి చెందిన ఎంపీని నిలబెట్టే అవకాశం ఉంది.