పశ్చిమ పొలిటికల్ స్క్రీన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పశ్చిమ పొలిటికల్ స్క్రీన్

ఏలూరు, జూలై 27 (way2newstv.com): 
గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభిస్తుందో ఆ పార్టీకే అధికారం ఖాయమనే సెంటిమెంట్‌. దీనికి తగ్గట్టుగానే పోలవరం నుంచి నరసాపురం వరకు అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు ఒకటే ఉత్కంఠ. రాష్ట్ర నేతలు జిల్లాలో కలియ తిరగబోతున్నారు. పట్టుకోసమే అన్ని పార్టీల్లో పట్టుదల. నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఏఏ సమస్యలు ఉన్నాయో నివేదిక రూపంలో సమర్పించాల్సిందిగా సీనియర్‌ నాయకులకు ఆదేశాలు. అంతకంటే మించి మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో తేల్చి, ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు మొగ్గు చూపాలని, అవసరమైతే పార్టీలో చేర్చుకోవాలనే సూచనలు. అధికార పక్షం ప్రజలకు చేరువకావాలని గ్రామదర్శినికి దిగింది. ఇంతకుముందే వైసీపీ నియోజకవర్గాల్లో పట్టు కోసం జగన్‌ నాయకత్వంలో పాదయాత్ర చేసింది. ఇప్పుడు తాజాగా సొంత జిల్లాపై జనసేనాధిపతి పవన్‌ దృష్టి పెట్టారు. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటుంది. వామపక్షాలు జనసేనకు దండుగా నిలబడుతున్నాయి. గోదావరి తీరాన తమకు తిరుగులేదన్నట్టుగా పార్టీ కార్యక్రమాలను అమలు చేయబోతున్నారు.
 
 
 
పశ్చిమ పొలిటికల్ స్క్రీన్ 
 
తెలుగుదేశం పార్టీ గడచిన నాలుగేళ్ళుగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తమ కేడర్‌ను నేరుగా సమకూర్చుకుంది. నాయకత్వాన్ని పటిష్టపరిచింది. నియోజకవర్గాల్లో తిరుగులేని విధంగా వ్యూహాలు ప్రదర్శించింది. కానీ పార్టీలో ఉన్న లోపాలు కాస్తా ఎన్నికలకు ముందు లుకలుకలు రూపంలో బయటపడుతున్నాయి.ఎమ్మెల్యేలదే అంతా పెత్తనం అయినప్పటికీ, స్థానిక నాయకత్వంపై మాత్రం ఎటూ తేల్చుకోలేక కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే చతికిలపడ్డారు. పరిస్థితి సున్నితంగా ఉండడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సాధారణంగా మెజార్టీ భారీగా ఉన్న ప్రాంతంలో నాయకత్వ లోపం సర్వ సాధారణం. అందరినీ ఒప్పించి, మెప్పించడానికే కాలం గడిచిపోవడంతో స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో నాయకత్వం వెనుకడుగు వేస్తుంది. జిల్లాలో గ్రామదర్శిని పేరిట తెలుగుదేశం ప్రజల మధ్యకు చేరింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక క్యాలెండర్‌ ప్రకారం మూడు నెలలపాటు ప్రతీ గ్రామంలోనూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మొదటి నాలుగు రోజుల్లోనే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నది జనం నేరుగా ఎమ్మెల్యేలకే చూపించారు. గ్రామదర్శిని కార్యక్రమం పుణ్యమా అంటూ లోపాల్లో స్పష్టత వచ్చింది. తేల్చుకోవాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యేలకు తెలిసొచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 26న కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. కొవ్వూరులో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అంతకుముందు పశివేదలలో జరిగే గ్రామదర్శినిలో పాల్గొంటారు. అంటే పార్టీ శ్రేణులు దిశ, నిర్దేశం చేయడం, వారిలో ఉత్సాహం నూరిపోయడం, ప్రత్యర్ధి పార్టీల వైఖరి, ఎత్తుగడలు ఎలాంటివో వారికి వివరించడం వంటి వాటిపై సీఎం చంద్రబాబు ప్రధానంగా దృష్టి పెట్టారు. తెలుగుదేశం కేడర్‌ ఇప్పటికే ఎన్నికల బరిలో దూకేసింది.
 జిల్లాలో వైసీపీని పటిష్టపరిచేందుకు, అధికార పక్షాన్ని దునిమాడేందుకు, పరోక్షంగా పార్టీ కేడర్‌ను ముందకు నడిపేందుకు జగన్‌ పాదయాత్రను ఎంచుకున్నారు. జిల్లాలో ఇప్పటికే పాదయాత్ర పూర్తయింది. మరి ఆ పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతుందా, కేడర్‌లో పూర్తిస్థాయి ధైర్యం వచ్చిందా, ఎన్నికల సమరానికి సిద్ధపడ్డారా అంటే నియోజకవర్గాల్లో ఆ పరిస్థితే లేదు. కారణం నియోజకవర్గ స్థాయిలో భవిష్యత్తులో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో ఆ పార్టీలో ఉన్న తడబాటు ఒక కారణం. వాస్తవానికి జగన్‌ తన పాదయాత్రలో భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాస్‌ పోటీ చేయనున్నట్టు బహిర్గతం చేశారు. అంతకుమించి మిగతా నియోజకవర్గాల్లో ఎవరికీ ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ఇదే పార్టీలో అప్పటి నుంచి ఇప్పటిదాకా కొత్త సందిగ్ధతను సృష్టించింది. పార్టీలో ఎవరంటారు, ఎవరు మిగులుతారు.. అనే ప్రశ్నలు ఉద్భవించాయి.
కానీ వైసీపీ నాయకత్వం వీటినేమీ పట్టించుకోవడం లేదు. ఆఖరుకి రిజర్వుడు నియోజకవర్గాల్లో అయితే ఏడాదిలోపే ఒకరికంటే మించి నియోజకవర్గ ఇన్‌చార్జీలను మార్చడానికి సాహసించారు. ఇది కాస్తా మిగతా నియోజకవర్గాల్లో కన్వీనర్లను ఇరకాటంలో పడేసింది.ఎన్నికల సమయం నాటికి పోటీలో ఎవరు ఉండబోతున్నారనే సస్పెన్స్‌ను మిగిల్చింది. రిజర్వు నియోజకవర్గమైన చింతలపూడిలో చోటు చేసుకున్న పరిణామాలు దీనికి ఉదాహరణగా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు పార్టీ ఏది అనుకుంటే అదే అంతిమ నిర్ణయం కావడం, మిగతావారికి రుచించడం లేదు. పార్టీ కేడర్‌లో స్థైర్యం నింపేందుకు పాదయాత్ర చేసినా, పాదయాత్ర ముగిసిన తరువాత ఆ ఉత్సాహం ఏదీ పార్టీలో కనిపించడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
తన సొంత జిల్లా పశ్చిమలో జనసేన కదం తొక్కేలా ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సింది పోయి..నేరుగా నిర్ణయాలు ప్రకటిస్తుండడంతో కొంత అయోమయం తలెత్తింది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకులుగా ఇప్పటిదాకా ఏ ఒక్కరికీ బాధ్యతలు అప్పగించలేదు. ప్రస్తుతానికి సభ్యత్వ నమోదు మాత్రమే అంటూ ఆ పార్టీ నేరుగా తేల్చిచెబుతోంది. కానీ ఈ వారంలో జిల్లాలో పర్యటించేందుకు పవన్‌ సిద్ధమయ్యారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని జనసేన ఉవ్విళ్ళూరుతోంది. కానీ మరోవైపు సమాచార లోపం కేడర్‌ను ఇబ్బంది పెడుతున్నది. పార్టీ ఇన్‌చార్జ్‌ కలవకొలను తులసి ఇప్పటికే పార్టీని సమన్వయం చేసుకుంటూ మిగతా కన్వీనర్లతో బిజీగా ఉన్నారు. ఆయనకు పార్టీ నాయకత్వం, కేడర్‌ పూర్తిస్థాయి టచ్‌లో ఉన్నారు.
రాజకీయాల్లో సీనియర్‌ అయిన కలవకొలను తులసి ఇంతకుముందు ప్రజారాజ్యంలోనూ కొన్ని బాధ్యతలు మోశారు. ఇప్పుడు తొలిసారిగా పవన్‌కల్యాణ్‌ పశ్చిమ పర్యటనకు రానుండడంతో ఆ మేరకు కలవకొలను తులసి, మరికొందరు నేతలు ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, కేడర్‌ను అప్రమత్తం చేశారు. ముందుగా ఆయన ఎక్కడెక్కడ పర్యటనకు సిద్ధపడుతున్నారో తెలుసుకోవడానికి జిల్లా నేతలంతా ఆదివారం సాయంత్రం సేనాధిపతి పవన్‌తో భేటీ అయ్యారు. పవన్‌ రాక సందర్భంగా రాజకీయాలు ఊపందుకుంటాయని ఆ పార్టీ ధీమాతో ఉంది. ఇంకోవైపు వామపక్షాలు జనసేనాధిపతికి అండగా నిలిచేందుకు సిద్ధం కానున్నాయి.
నాలుగేళ్ళ క్రితం పూర్తిగా దెబ్బతిని జనానికి దూరమైన కాంగ్రెస్‌ తిరిగి పుంజుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఆ మేరకు కాంగ్రె్‌సలో ఇప్పటికే ఉత్సాహం నూరిపోసేందుకు ఉన్నంతలోనే నాయకత్వం ప్రయత్నిస్తున్నది. డీసీసీ అధ్యక్షుడు బేగ్‌ నియోజకవర్గాల వారీ సమావేశాలు నిర్వహించి కేడరంతా సమావేశాలకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌చాందీ ఈనెల 31న ఏలూరు రానున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం తాడేపల్లిగూడెంను మార్చి సమావేశాలను జిల్లా కేంద్రమైన ఏలూరులో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక పూటంతా యావత్‌ నాయకత్వం చాందీతో భేటీ అయ్యేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది.