సీజేనే సుప్రీం.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీజేనే సుప్రీం..

న్యూఢిల్లీ, జూలై 7 (way2newstv.com)
సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపుపై ఇద్దరు సభ్యుల ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చింది. ఏ బెంచ్‌లకు ఎటువంటి కేసులు కేటాయించాలన్న నిర్ణయాధికారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. సీజేఐనే మాస్టర్ ఆఫ్ రోస్టర్ అని తీర్పునిచ్చింది. ఏకే సిక్రీ, అశోక్ భూషన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సీజేఐ అంటే మొత్తం కొలీజియం కాదన్నారు. న్యాయవ్యవస్థ నిర్వహణలో సీజేఐ ముందు వరుసలో ఉంటారని, సుప్రీంకోర్టు నిర్వహణ కూడా ఆయన బాధ్యతే అని, ఒక విధంగా కోర్టుకు ఆయనే ప్రతినిధి అని ధర్మాసనం వెల్లడించింది.కేసుల కేటాయింపు, ధర్మాసనాల ఏర్పాటులో ప్రధాన న్యాయమూర్తికి విశేషాధికారాలుంటాయని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఉద్ఘాటించింది. ఆయనే మాస్టర్ ఆఫ్ ది రోస్టర్‌, ధర్మాసనాలకు కేసులను కేటాయించే నైతిక హక్కు చీఫ్ జస్టిస్‌కే ఉంటుందని స్పష్టం చేసింది.
 
 
 
 సీజేనే సుప్రీం..
 
 సీజేఐ అధికారుల గురించి సవాల్ చేస్తూ కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్‌ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ట్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం నాడు ఈ వ్యాఖ్యలు చేసింది. సీజేఐ తన ప్రత్యేక అధికారాలను ఇతర న్యాయమూర్తులతో పంచుకోవాల్సిన అవసరం లేదంటూ శాంతిభూషణ్ పిటిషన్‌పై ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. సమానులలో చీఫ్ జస్టిస్ ప్రథములు, ఆయనకు కేసులను కేటాయించే అధికారంతోపాటు సుప్రీంకోర్టు పాలనా వ్యవహారాలకు  నేతృత్వం వహిస్తారని పేర్కొంది. న్యాయవ్యవస్థను తక్కువ చేసే ఇలాంటి చర్యలు పెను ముప్పుగా పరిణమిస్తాయని జస్టిస్ సిక్రీ అభిప్రాయపడ్డారు. చీఫ్ జస్టిస్ సీనియర్‌ న్యాయమూర్తి, న్యాయవ్యవస్థకు అధికార ప్రతినిధి లాంటివారని ధర్మాసనం పేర్కొంది. గతంలో సీనియర్ న్యాయవాది అశోక్ పాండే ఇలాంటి పిటిషన్‌ దాఖలు చేయగా దానిపై కూడా సుప్రీం ఇలాగే స్పందించింది. కేసుల కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని దాఖలు చేసిన పిటిషన్‌లో అశోక్ పాండే కోరారు. అయితే వ్యాజ్యాన్ని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం కొట్టివేసింది. ‘రాజ్యాంగం.. సీజేఐపై విశ్వాసం ఉంచింది. న్యాయమూర్తిగా సీజేఐ.. సమానుల్లో ప్రథముడు. ఇతర విధులు నిర్వర్తించడంలో ఆయన స్థానం విశిష్టమైంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా.. సంస్థ అధిపతి అని చెబుతూ రాజ్యాంగంలోని 146 వ అధికరణం ఆయన అధికారాన్ని తెలియజేస్తుంది . సంస్థాపరమైన దృక్పథం నుంచి చూస్తే ప్రధాన న్యాయమూర్తి.. సుప్రీంకోర్టు అధిపతి. కేసుల కేటాయింపులో, ధర్మాసనాల ఏర్పాటులో ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేక విశేషాధికారం ఉంది.’అని అప్పటి ధర్మాసనం పేర్కొంది. కేసుల కేటాయింపుల విషయంలో ప్రధాన న్యాయమూర్తి వైఖరిని ప్రశ్నిస్తూ సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లు ఈ ఏడాది జనవరిలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఆ నేపథ్యంలోనే న్యాయవాది అశోక్‌ పాండే, మాజీ మంత్రి శాంతి భూషణ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్‌లో దీనిపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. కేంద్ర తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ వేణుగోపాల్.. శాంతి భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తప్పుబట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య ఐక్యత అవసరమని నొక్కిచెప్పారు. ఐదుగురు సభ్యుల కొలీజయానికి కేసులను కేటాయించే అధికారం కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ న్యాయమూర్తుల మధ్య సంఘర్షణకు దారి తీయవచ్చుని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అధికారం కేవలం ఒక వ్యక్తి ఉండాలని, ఆయనే చీఫ్ జస్టిస్ట్ అయి ఉండాలని అటార్నీ జనరల్ అన్నారు.