పారదర్శకతతోనే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పారదర్శకతతోనే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి

విజయవాడ, జూలై 12 (way2newstv.com)
సక్సెస్ అనేది ఓ కిక్అని సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి ర్యాంకు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్‌ చేయడం కోసమే సింగపూర్‌ పర్యటనకు వెళ్లాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో నీతివంతమైన పాలన ఉంది కాబట్టే పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. నాలుగేళ్ల క్రితం రాష్ట్రానికి ఏం పరిశ్రమలు వచ్చాయో విమర్శించే వాళ్లు చెప్పాలన్నారు. రోడ్డు మీద తిరిగే వాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాళ్ల హయంలో అవినీతికి పాల్పడి, అధికారులను కూడా జైల్లో పెట్టించారని మండిపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదని చెప్పుకొచ్చారు. తాను కేవలం టీమ్ లీడర్‌ను మాత్రమేనన్నారు. అధికారులు, మంత్రులు, ప్రజలు.. టీమ్ సభ్యులు అని వ్యాఖ్యానించారు. 
 
 
 
పారదర్శకతతోనే  ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి
 
అవినీతి జరిగితే ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రానికి మొదటి స్థానం ఎలా వస్తుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అవినీతి లేదు కాబట్టే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టంచేశారు.రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడారు. పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టే విషయంలో సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. పరిశ్రమల విషయంలో ఏపీ మైనస్‌లో ఉండేదని.. అలాంటిది ఇప్పుడు అగ్రభాగాన నిలపగలిగామన్నారు. పెట్టుబడిదారులపై వేధింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరిశ్రమల విషయంలో ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలను ఏపీలో పాటిస్తున్నామని సీఎం అన్నారు. ప్రమోషన్, నెట్ వర్కింగ్, పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్తున్నామని... ఇప్పటివరకు 5.80 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని సీఎం తెలిపారు. సింగపూర్ పర్యటనపై కొంతమంది విమర్శలు చేస్తున్నారని, పారిశ్రామిక పెట్టుబడుల కోసమే తాను అక్కడికి వెళ్లానని చెప్పారు. తన పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్ లైన్ లో ఉంచామని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీలో నెలకొల్పిన కియా మోటార్స్ గురించి ఆయన ప్రస్తావించారు. జనవరిలో ఈ సంస్థకు చెందిన మొదటికారు బయటకు వస్తుందని అన్నారు.ఓ వైపు రాష్ట్రం పెట్టుబడుల విషయంలో దూసుకుపోతుంటే.. కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తాము విదేశాలు తిరిగి పెట్టబడులు ఆహ్వానిస్తుంటే.. ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.