ఏపీ కాంగ్రెస్ లో ఘర్ వాపసీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ కాంగ్రెస్ లో ఘర్ వాపసీ

విజయవాడ, జూలై 13 (way2newstv.com)  
 రాష్ట్ర విభజన అనంతరం అడ్రస్‌ లేకుండా పోయిన కాంగ్రెస్‌  పార్టీ... ఇప్పుడు ఏపీలో పట్టాలెక్కే ప్రయత్నం చేస్తోంది. పార్టీకి దూరమైన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.గత ఎన్నికల్లో అటు దేశంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ అధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ 2019  ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కేంద్రంలోని ఎన్డీయే సర్కారును గద్దె దించేందుకు ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే యువనేత రాహుల్‌ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించింది. ఏఐసీసీని ప్రక్షాళన చేసి కొత్త నేతలకు అవకాశం కల్పిచింది.
 
 
 
ఏపీ కాంగ్రెస్ లో ఘర్ వాపసీ
 
 పార్టీ అధికారాన్ని కోల్పోయి అయిదేళ్లయినా పార్టీలోనే పని చేస్తున్న నేతలను గుర్తించి పదవులను కట్టబెట్టింది. అధికారంలో లేని రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జిలను నియమించింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ యువ నేతలతో మంతనాలు జరుపుతూనే పార్టీకి సీనియర్ల అవసరాన్ని గుర్తించారు. పలు రాష్ట్రాలకు సీనియర్లను ఇన్‌ఛార్జిలుగా నియమించింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడదీసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీలో ఏపీలో ఘోర పరాభవం పాలైంది. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దని వారించినా రాష్ట్రాన్ని విడదీశారని విమర్శలు అప్పట్లో బాగానేవచ్చాయి. అయినా విడదీయడంతో ఘోర ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పుడు తెరపైకి వచ్చింది. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని పార్లమెంట్‌ సాక్షిగా బీజేపీ అడగటం.. ఇప్పుడు దానిని అధికారంలో ఉండికూడా అమలు చేయలేకపోతుండడాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఓన్‌ చేసుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీకి తిరిగి అధికారం అప్పగిస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే చేస్తామని ప్రచారం చేస్తోంది. అదే విధంగా పార్టీని గాడిలో పెట్టేందుకు అప్పట్లో పార్టీకి దూరమైన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇటీవల మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్‌ చాందీ చర్చలు జరిపారు. త్వరలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.అదే విధంగా పార్టీకి దూరంగా ఉంటున్న లగడపాటి రాజగోపాల్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌తో పాటు పలువురు సీనియర్‌ నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.మొత్తంమీద కాంగ్రెస్‌ పార్టీ ఆచరణలో పెడుతున్న గర్‌ వాపసీ ఎంత మేరకు సక్సెస్‌ అవుతుందో వేచిచూడాలి.