ఉచితంగా గ్యాస్ సిలెండర్లు నెలకు 2500 నుంచి 3500 మధ్య జమ ఆకట్టుకుంటున్న జనసేన మ్యానిఫెస్టో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉచితంగా గ్యాస్ సిలెండర్లు నెలకు 2500 నుంచి 3500 మధ్య జమ ఆకట్టుకుంటున్న జనసేన మ్యానిఫెస్టో

హైద్రాబాద్, ఆగస్టు 15, (way2newstv.com)
వచ్చే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ముందుకు వెళుతున్నారు. పోరాట యాత్ర పేరుతో ఏపీలోని జిల్లాల్లో పర్యటిస్తోన్న పవన్ రెండు రోజుల కిందట తొలిసారిగా హామీల గురించి మాట్లాడారు. ప్రస్తుతం పశ్చిమగోదావరిలో పర్యటిస్తోన్న జనసేనాని తన ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేశారు. మంగళవారం భీమవరంలోని మావుళ్లమ్మను దర్శించుకున్న పవన్, అనంతరం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ఏడు సిద్ధాంతాలు, 12 హామీలను పొందుపర్చారు. పవన్ పొందుపరిచిన సిద్ధాంతాలు.... కులాలను కలిపే ఆలోచనా విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని పేర్కొన్నారు. ఇక హామీల విషయంలో రెండు రోజుల కిందట స్పష్టంచేసిన అంశాలనే పొందుపరిచారు. 
 
 
 
ఉచితంగా గ్యాస్ సిలెండర్లు
నెలకు 2500 నుంచి 3500 మధ్య జమ
ఆకట్టుకుంటున్న జనసేన మ్యానిఫెస్టో
 
తాము అధికారంలోకి వస్తే మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు, ఉచితంగా వంట గ్యాస్‌ సిలిండర్లు అందజేస్తామని అన్నారు. రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 వరకు నగదు జమ, బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5 శాతానికి రిజర్వేషన్ల పెంపు, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు 9వ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్ల కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పొరేషన్‌ ఏర్పాటు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు, ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దుచేసి, వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలను ఏర్పాటు చేయనున్నట్టు మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. మహోన్నత వ్యక్తులు, మేధావులు ఎన్నో ఏళ్లు శోధించి, మధించి రూపొందించిన రాజ్యాంగ ప్రవేశికకు రాజకీయ పార్టీలు తూట్లు పొడిచాయని, సంపూర్ణమైన అభివృద్ధి నుంచి ప్రజలను దూరం చేశారని పవన్ ఆరోపించారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగానూ ప్రజలను విడదీశారని, కులమతాల పేరుతో బేధాలను సృష్టించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాలరాశారని జనసేనాని వ్యాఖ్యానించారు. చెప్పింది చేయం.. చేసింది చెప్పమనే రీతిలో వంచన రాజకీయాలతో దేశాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆర్బాటంగా మేనిఫేస్టోలను ప్రకటించే రాజకీయ పార్టీలు వాటిని ఎన్నికల అనంతరం మొక్కుబడిగా కూడా అమలుచేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు.