ఎమ్మెల్యే పోస్టు పైనే రాములమ్మ కన్ను - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎమ్మెల్యే పోస్టు పైనే రాములమ్మ కన్ను

మెదక్, ఆగస్టు 13, (way2newstv.com)
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఐదు స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారని, మిగిలిన ఐదు స్థానాల్లో అభ్యర్థుల పోటీ తీవ్రంగా ఉన్నట్టు విశ్వనీయ వర్గాల సమాచారం. కాగా, ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతిని మెదక్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నియమించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మెదక్ ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేసే నిర్ణయాన్ని ఆమెకే వదిలేసినట్లు ప్రచారం జరుగుతున్నది. కాగా, విజయశాంతి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ ఎన్నికలకు ఆరు నెలల ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపిన విషయం తెలిసిందే.  మెదక్ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఐదు మినహా మిగలిన ఐదు నియోజకవర్గాల నుండి పోటీ పడుతున్న అభ్యర్థులు పైరవీలు ముమ్మరం చేశారు. ఈ నెల 13న రాహుల్ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు జనాలను తరలించే విషయంలో నిమగ్నమయ్యారు. మెదక్ నుండి విజయశాంతి, నర్సాపూర్ నుండి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, జహిరాబాద్ నుండి డాక్టర్ గీతారెడ్డి, అందోల్ నుండి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, సంగారెడ్డి నుండి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్లు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఖరారయ్యారని అంటున్నారు. 

ఎమ్మెల్యే పోస్టు పైనే రాములమ్మ కన్ను
ఒకవేళ రాములమ్మ పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తే, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవాలని పోటీ పడుతున్నట్లు తెలిసింది. వీరంతా రాష్ట్ర నేతల వద్ద పైరవీలు చేయిస్తున్నారని సమాచారం. సురేష్ షెట్కార్ ఎంపీగా పోటీ చేసేందుకు అంగీకరిస్తే ఖేడ్ నియోజకవర్గం నుంచి సంజీవరెడ్డిని ఎమ్మెల్యే బరిలోకి దించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. పటాన్‌చెరు నియోజకవర్గం నుండి శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అంతేగాక, జిన్నారం జడ్పీటీసీ ప్రభాకర్ పటాన్‌చెరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సునీతా రెడ్డితో పైరవీ చేస్తున్నారని అంటున్నారు. కార్పొరేటర్ శంకర్ యాదవ్ కూడా ఇదే నియోజకవర్గం నుండి ఎమ్మె ల్యే బరిలో నిలిచేందుకు పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. సిద్దిపేట నియోజకవర్గం నుండి యూత్ కాంగ్రెస్ ఆలిండియా సెక్రటరి హరికృష్ణ, నియోజకవర్గ ఇంచార్జీ శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అదే విధంగా జిల్లా కార్యదర్శి చొప్పదండి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు తెలిసింది. గజ్వెల్ నియోజకవర్గం నుండి టీడీపీ నుండి కాంగ్రెస్‌లో చేరిన ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, దివంగత రంగారెడ్డి కుమారుడు జశ్వంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గం నుండి మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, ఎంపీగా పోటీ చేసిన శ్రావణ్‌కుమార్ రెడ్డి ఎమ్మెల్యే బరిలోకి దిగాలని ఉత్సాహపడుతున్నట్టు వార్తలు ఉన్నాయి. చెరుకు ముత్యంరెడ్డికి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ఆశిస్సులు ఉన్నాయని, శ్రావణ్‌కుమార్‌రెడ్డికి సునీతారెడ్డి మద్దతు ఉందని ప్రచారం సాగుతున్నది. ఈ విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు రాజధాని హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారని అంటున్నారు. నర్సాపూర్ నుండి మాజీ మంత్రి సునీతారెడ్డి, సంగారెడ్డి నుండి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అందోల్ నుండి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ నుండి మాజీ ఎంపీ విజయశాంతి, జహిరాబాద్ నుండి మాజీ మంత్రి గీతారెడ్డి 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్టాన వర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది.