రైతు బంధుపై ఎన్నికల ప్రభావం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతు బంధుపై ఎన్నికల ప్రభావం

హైద్రాబాద్,సెప్టెంబర్26,way2newstv.com
రైతుబంధు పథకం రెండోవిడత డైలమాలో పడింది. ఎన్నికల నేపథ్యంలో ఈ పథకం అమలవుతుందా? లేదా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయం గనుక రబీసీజన్‌ ప్రారంభంలోపే రెండో విడత చేపడతామని అధికారులు చెబుతున్నారు. అయితే అది సాధ్యం కాకపోవచ్చని చెబుతున్నవారూ లేకపోలేదు. అపద్ధర్మ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్‌ ఆమోదంతో అమలు చేయాల్సి ఉంది. ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. తొలి విడత రైతుబంధు పథకం అమలు సందర్భంగా చేపట్టిన ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలోనూ స్పష్టత రాలేదు. 
రైతు బంధుపై ఎన్నికల ప్రభావం
తొలివిడత రైతుబంధు పథకానికి సుమారు 45 రోజుల పాటు కసరత్తు చేసి పేఆర్డర్లు 
        అందజేశారు. ఈ నెలాఖరుతో ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తుంది. అక్టోబరుతో రబీసీజన్‌ ప్రారంభం
కానుంది. సీజన్‌ ప్రారంభానికి ముందే చెక్కులు ఇస్తేనే రైతులు పెట్టుబడికి ఉపయోగించుకుంటారు. ఆ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయలేదు. వాస్తవంగా తహశీల్దారులు సేకరించిన రైతుల వివరాలు ఆర్డీవోకు అందజేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ద్వారా సీసీఎల్‌ఏకు ఆ జాబితా చేరుకుంటుంది. ఈ అధికారులందరూ ధ్రువీకరించిన అనంతరం నేషనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) వెళ్తుంది. అక్కడ అన్ని జిల్లాల వారీగా బ్యాంకుల వారీగా చెక్కులు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తికావడానికి సుమారు రెండు నెలలు పడుతుంది. గత మే 10న ఈ రైతుబంధు పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండో విడతకు రూ.5,925 కోట్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వ్యవసాయ శాఖ రూ.1000 కోట్లకు మాత్రమే ప్రతిపాదనలు చేస్తూ ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ఇప్పటి వరకు చేయలేదు. దీని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ పథకం కొనసాగిస్తారా లేక ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అమలవుతుందా అనే అనుమానాలున్నాయి. వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలకు సంబంధించిన పథకాలు సైతం డోలాయమానంలో ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయలేదు.తొలి విడతలో అధికారుల సమాచారం ప్రకారం ముద్రించిన చెక్కుల్లో 9.9లక్షల చెక్కులు మిగిలిపోయాయి. ఇందులో మరణించిన వారిపేర్ల మీద, వలసలు వెళ్లిన వారి పేర్లతోపాటు ఇతర సమస్యలతో కూడుకుని ఉన్నాయని అధికారులు అంటున్నారు. పట్టాదారులు ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులకు సదరు చెక్కులు అంద చేయాలనే వినతులు సైతం వచ్చాయి. వాటిని వ్యవసాయ శాఖ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు రైతుల కుటుంబాలు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. పెండింగ్‌లో ఉన్న చెక్కులలో మన రాష్ట్రంలో భూములు ఉండి, ఇతర రాష్ట్రాల్లో బతుకుదెరువు కోసం వెళ్లినవారున్నారు. అదే విధంగా చనిపోయిన వారి పేరు మీద వచ్చిన చెక్కులు, రెవెన్యూశాఖతో దొర్లిన తప్పిదాల వల్ల కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.