అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కరువు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కరువు

అనంతపురం, జనవరి 31, (way2newstv.com)
అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువైంది. కనీస వేతనాలు అందకపోగా పనిభారంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పొంతన లేని జీవోలతో ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేలాది మంది జీవితాలను బుగ్గిపాలు చేయాలని చూస్తున్న వైఖరిని మార్చుకోకుంటే ప్రభుత్వానికి పతనం తప్పదని ఉద్యోగ, కార్మిక సంఘాల హెచ్చరిస్తున్నాయి. 
జిల్లాలో సుమారు 22 వేల మంది కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం సంవత్సరాల తరబడి వారికి ఉద్యోగ భద్రత కల్పించకుండా తాత్సారం చేస్తోంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఉంది. ఉద్యోగ భద్రత, పనిభారంపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 


 అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కరువు

సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఆ విధానానికి స్వస్థి చెప్పింది. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పేరుతో నియామకాలను చేపడుతోంది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ కేటగిరీ ఉద్యోగులే అధికంగా ఉన్నారు. గత పది సంవత్సరాలుగా చూస్తే ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల భర్తీ కొసరంత కూడా జరగ లేదు. ఒక వేళ జరిగినా పై క్యాడర్‌లో చేర్పులు మార్పులు మినహా కీలకంగా పనిచేస్తున్న జూనియర్‌, సీనియర్‌ క్యాడర్‌ పోస్టుల నియామకాలు పూర్తి చేయని పరిస్థితులు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో పారిశ్రామికీకరణకు కీలకమైన కియా లాంటి భారీ పరిశ్రమలను గైడ్‌ చేస్తున్న ఎపిఐఐసి శాఖలో 30 మంది ఆఫీస్‌ క్యాడర్‌ ఉంటే 26 మంది కాంట్రాక్టు, అవుట్‌సోర్పింగ్‌లోనే పనిచేస్తున్నారు. ఇదే తరహాలో పరిశ్రమల శాఖ, రెవెన్యూ, విద్య, వైద్యం, మున్సిపల్‌, పంచాయితీ తదితర అన్ని శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరు విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం వారిని గుర్తించడం లేదు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా ఉద్యోగ భద్రత కల్పించలేదు. మరో వైపు పనిభారంతో ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో పోలిస్తే కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉంది. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు చెబుతున్న మాటలను ప్రభుత్వం పట్టించుకోకుండా కాలం వెల్లదీస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.