కనకదుర్గ ఫ్లైఓవర్ ఎడతెగని జాప్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కనకదుర్గ ఫ్లైఓవర్ ఎడతెగని జాప్యం

విజయవాడ, ఫిబ్రవరి 18, (way2neawastv.com)
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్  నిర్మాణంలో ఎడతెగని జాప్యం కొనసాగుతోంది. కేంద్ర నిధులతో చేపట్టే ఈప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. నిధుల మంజూరులో కేంద్రం కొర్రీలు వేస్తోంది. జాప్యంవల్ల ప్రాజెక్టు వ్యయం ఏకంగా రూ.340 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టు భూసేకరణ, ఇతర పనుల కోసం రూ.138 కోట్లను వెచ్చిస్తోంది.కేంద్రం ఇవ్వాల్సిన రూ.340 కోట్లకుగాను ఇప్పటివరకు రూ.225 కోట్లు మాత్రమే అందాయి. 82 శాతం పనులు పూర్తయ్యాయని, ఆ ప్రకారం ఇప్పటికే రూ.280 కోట్లు రావాల్సి ఉందని సమాచారం. ఈ లెక్కన కేంద్రం నుంచి మరో రూ.55 కోట్లు అందాల్సి ఉంది. ఈ రెండు నెలలకు సంబంధించి కేంద్రం నుంచి రూ.11.60 కోట్లు, రాష్ట్రం నుంచి రూ.4.80 కోట్లు రావాల్సి ఉంది.

 
కనకదుర్గ ఫ్లైఓవర్ ఎడతెగని జాప్యం

బిల్లుల చెల్లింపులో బెంగళూరులో ఉన్న రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ  ప్రాంతీయ కార్యాలయం కొర్రీలు వేస్తోంది. ఒక విభాగం బిల్లుల మంజూరుకు  సంబంధిత పనులన్నీ పూర్తి కావాలనే షరతు విధిస్తోంది. ఆయా ప్రాంతాల్లో 60 శాతం పనులు పూర్తయిన బిల్లులను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.భూసేకరణ పరిహారం, ఇతర పనులకు రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా రూ.110 కోట్లు కేటాయించింది. ఈ ఖర్చు ఇప్పటికే రూ.123 కోట్లకు చేరింది. నిర్మాణంలో మార్పులనుకేంద్రం అంగీకరించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. నగరపాలక సంస్థ కార్యాలయం వైపు అప్రోచ్ రహదారిని రూ.14.50 కోట్లతో వయాడక్టు తరహాలో నిర్మించాల్సి ఉంది.దీని వ్యయం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. రెండు ప్రార్థన మందిరాల తొలగింపు నేపథ్యంలో కొన్ని రోజులు పనులు నిలిచిపోయాయి.  ఇటీవల అంతర్జాతీయ స్థాయి హెచ్2ఓ ఫార్ములా రేసు నిర్వహణకు ఈ వంతెన కింద రూ.రెండు కోట్లతో వీఎంసీ పార్కును ఏర్పాటు చేశారు. దీంతో వంతెన పనులకు ఆటంకమేర్పడింది.వాస్తవానికి ఇంత భారీ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేయడం కష్టం. కానీ కాంట్రాక్టు  సంస్థ సోమాతో కేంద్రం ఈ మేరకే  2016 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఒప్పందం చేసుకుంది. గడువు దాటి రెండేళ్లయింది. తాజాగా ఈ ఏడాది మే 14నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ రహదారుల పర్యవేక్షణ విభాగం ప్రతిపాదించింది.ఇప్పటికీ బిల్లులు అందితేనే కాంట్రాక్టు సంస్థ పనులు చేస్తోంది. ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న వలస కార్మికుల్లో చాలామంది ఇంటిముఖం పట్టారు. రెండు నెలల బిల్లులు ఆపేశారని కాంట్రాక్టు సంస్థ పేర్కొంటోంది.