ఆగని కల్తీరాయుళ్ల ఆగడాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆగని కల్తీరాయుళ్ల ఆగడాలు

నిజామాబాద్, ఫిబ్రవరి 13, (way2newstv.com)
కల్తీరాయుళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఉదయం నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ప్రజల అవసరాలన్నీ కల్తీమయం అవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా అధికారుల వైఫల్యం ప్రజలకు శాపంగా మారుతోంది. ఫలితంగా కల్తీ వస్తువులు ప్రజల ఉసురుతీస్తున్నాయి. నిత్య జీవితంలో ప్రజలకు అతిముఖ్యమైన వంట నూనెల కల్తీ అడ్డూ అదుపులేకుండా సాగుతోంది. నిజామాబాద్ వ్యాప్తంగా వంట నూనెల అమ్మకాలపై నిఘా లేకపోవడం, తనిఖీలు అసలే జరగకపోవడంతో ఏది కల్తీ, ఏది మంచి అన్నది లేకుండా ప్రతినెల కోట్లాది రూపాయల అమ్మకాలు సాగుతున్నాయి. ప్రజలను తీవ్ర అనారోగ్యానికి గురి చేసే వ్యర్థపదార్థాలు వంట గదికి చేరుతున్నాయి. 


 ఆగని కల్తీరాయుళ్ల ఆగడాలు

ప్రతి ఇంట్లో వంటకు వినియోగించే నూనె అమ్మకాల్లో కల్తీ రాయుళ్లు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. బ్రాండెడ్ వంట నూనెల పేర్లతోను కల్తీ నూనె మార్కెట్‌లో విక్రయించబడుతున్నట్లు ఆరోపణలున్నాయి. నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, పిట్లం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కల్తీనూనెల అమ్మకాలు జరుగుతున్నట్లు విస్తృత ప్రచారం ఉంది. నిజానికి పల్లీ, పొద్దుతిరుగుడు, సోయాల నుంచి తయారైన వంట నూనెలను ప్రజలు తమ నిత్యావసరాలకు వినియోగిస్తారు. వీటి ధర ఎక్కువగానే ఉండగా బిటి పత్తి, మొక్కజొన్న చొప్ప, జొన్న, గడ్డి, ఆముదం నుంచి తీసే నూనెలు అతి తక్కువ ధరకు లభ్యమవుతుంటాయి. తక్కువ ధరకు లభించే నూనెలను పల్లీ, పొద్దుతిరుగుడు, సోయా నూనెలతో కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీటికి తోడు జంతు కళేబరాల నుండి తీసే నూనె సైతం పెద్ద ఎత్తున నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ తదితర పట్టణాల్లోని ఫాస్‌ఫుడ్ సెంటర్‌లు, హోటళ్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.నిజామాబాద్ నగర శివారులోని మాలపల్లిలో అనేకసార్లు జంతు కళేబరాల నుంచి నూనె తీసే ముఠాలు పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే పోలీసు దాడులు కల్తీ రాయుళ్లను నిలువరించకపోగా పెద్ద ఎత్తున కల్తీనూనె మార్కెట్‌లకి వస్తున్నట్లు సమాచారం. మరో పక్క వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చౌకధర నూనెలు ఆయిల్ విక్రయదారులకు చేరుతున్నట్లు సమాచారం. నిరంతరం జరుగుతున్న ఈ సరఫరా కోట్ల రూపాయల విక్రయానికి దారితీస్తుండగా వంట నూనె పూర్తిగా కల్తీమయమవుతోంది. శుభకార్యాల్లో పెద్ద ఎత్తున అవసరమయ్యే నూనెలు కొనుగోలు డబ్బాల రూపంలో జరుగుతుండగా వాటిలో ఎక్కువ శాతం కల్తీ అయిన నూనెలే ఉంటున్నాయని తెలుస్తోంది.నిరుపేద గ్రామీణులు ఖరీదైన బ్రాండెడ్ వంట నూనెలను వాడకపోగా ఎలాంటి ధృవీకరణ లేని వంట నూనెలను నేరుగా వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తారు. ఇక్కడే వారికి కావాల్సిన నూనెను కొలతల ప్రకారంగా విక్రయిస్తుండగా కల్తీనూనెలను అరికట్టలేని పరిస్థితి తలెత్తోంది. కామారెడ్డిలో ఓ వ్యాపారి కల్తీనూనెలతో కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు సైతం అయితే పెద్ద ఎత్తున ముడుపులు అందుకుంటున్న అధికారులు అక్రమార్కునిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. సదరు వ్యాపారి పెద్ద ఎత్తున హోల్‌సెల్ అమ్మకాలను సాగిస్తూ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో సైతం కల్తీనూనెలతో ముంచెత్తుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరో పక్క కామారెడ్డి జిల్లా పిట్లంలో కల్తీ నూనెలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో చౌకగా లభించే నాణ్యతలేని వంట నూనెలు పిట్లంలో పెద్ద ఎత్తున విక్రయించబడుతోంది. మామూలు మండల కేంద్రమైన పిట్లంలో ప్రతిరోజు లక్షలాది రూపాయల వంట నూనెల అమ్మకాలు జరుగుతుండడం గమనార్హం.నిజామాబాద్ నగరంలో ఓ ప్రముఖ వ్యాపారి కల్తీవంట నూనెలతోనే కోట్లు సంపాదించినట్లు ప్రచారం ఉంది. నిజామాబాద్ గంజ్ ప్రాంతం మొదలుకొని పలుచోట్ల భారీగా కల్తీవంట నూనెలు విక్రయించబడుతున్నాయి. నూనెల తయారీ అమ్మకాలపై నిర్థిష్ట మార్గదర్శకాలు లేకపోవడంతో వంట నూనెల విక్రయాలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. వంట నూనెల దుకాణాలపై దాడులు జరిగిన దాఖలాలు లేకపోగా ప్రతి ఇంటి వంటగదిని కల్తీ పలకరిస్తోంది. ఫలితంగా ప్రజలకు గుండెపోటు, బిపి తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. కల్తీనూనెల కారణంగా రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి చిన్నవయస్సులోనే అనేకమంది మృత్యువాత పడుతున్నారు. వైద్యులు చేస్తున్న హెచ్చరిల్లో వంట నూనెలు చేరుతుండగా కల్తీని నిరోధించలేక వంట నూనె లేకుండా వంట చేయలేక సామాన్య ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారు.